- కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి న్యాయం జరుగుతుంది
- కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఆశాభావం
అమరావతి: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. టీడీపీపీ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ విశాఖ రైల్వే జోనుకు భూమి విషయంలో ఉన్న సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. ఏపీ ఆర్థిక వ్యవస్థ సరిగా లేదనే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ఈ సారి కేంద్ర బడ్జెట్ లో ఏపీకి న్యాయం జరిగేలా కేటాయింపులు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా గట్టెక్కించాలంటే కేంద్ర ప్రభుత్వ సాయం అవసరమన్నారు. కేంద్ర నిధులు రాబట్టేందుకు ఎంపీలకు కొన్ని కొన్ని శాఖలు ప్రత్యేకంగా కేటాయించారని గుర్తుచేశారు. వివిధ పథకాల కింద వచ్చే కేంద్ర నిధులను ఏపీకి రప్పించే ప్రయత్నం చేస్తామని వివరించారు.
గత ఐదేళ్లల్లో కేంద్ర నిధుల్లోనూ అవకతవకలు జరిగాయని కేంద్ర మంత్రులే స్వయంగా సీఎం చంద్రబాబు దృష్టికి తెచ్చారని చెప్పారు. కేంద్ర పథకాలకు రాష్ట్రం నుంచి ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్లు ఇస్తామని ప్రకటించారు. ఏపీలో వెనుకబడిన జిల్లాలు ఉన్న క్రమంలో రాష్ట్రం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ విషయంలో వెసులుబాటు కల్పించమని కేంద్రాన్ని కోరతామని, కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందని భావిస్తున్నామన్నారు. శనివారం తెల్లవారుజామున 3 గంటల నుంచి మైక్రోసాఫ్ట్ ఎర్రర్ సమస్య తొలిగిపోయిందని తెలిపారు. విమాన ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా మాన్యువల్ పద్ధతిలో బోర్డింగ్ పాస్‌లు జారీ చేస్తున్నట్లు తెలిపారు. విమానాలన్నీ ప్రస్తుతం షెడ్యూల్ ప్రకారమే నడుస్తున్నాయని రామ్మోహన్ నాయుడు తెలిపారు.