- నా ఆరోపణలకు కట్టుబడే ఉన్నా..
- ఎలాంటి విచారణలకైనా నేను సిద్ధం
- అప్పన్నస్వామి మీద ప్రమాణానికైనా..
- మళ్లీ విరుచుకుపడిన మూర్తియాదవ్
అమరావతి(చైతన్యరథం): ఏపీ సీఎస్ జవహర్‌రెడ్డిపై జనసేన నేత మూర్తియాదవ్ గురువారం మరోసారి సంచలన అభియోగాలు చేశారు. జవహర్‌రెడ్డి తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన కాలంనుంచీ ఎవరెవరు బినామీలుగా ఉన్నారో పేర్లను బయటపెడుతూ.. భూకుంభకోణం విషయంలో ఇప్పటికీ తన ఆరోపణలకు కట్టుబడే ఉన్నానన్నారు. ఏ జీవో (596) అడ్డుపెట్టుకుని అసైన్డ్ భూముల కైంకర్యం ప్రణాళిక అమలు చేస్తున్నారో.. ఆ జీవోను రద్దు చేస్తే మొత్తం బండారం బయటికొస్తుందన్నారు. బినామీల ద్వారా వందల ఎకరాల భూములు కాజేశారనే ఆరోపణలను రుజువు చేసేందుకు సిద్ధమన్నారు. సీఎస్ లీగల్ నోటీసులకు భయపడేదే లేదని, అన్నవరం సమీపంలోని ఏ1 హోటల్ అధినేత చోడ్రాజు సత్య కృష్ణంరాజు, విశాఖకు చెందిన రియల్టర్ పేరిచర్ల శ్రీనివాసరాజు జవహర్ రెడ్డికి బినామీలుగా ప్రకటించారు. సూర్రెడ్డి త్రిలోక్.. జవహర్‌రెడ్డి వ్యవహరాలకు బ్రోకర్ అన్నారు. గతనెల 17న కృష్ణంరాజు క్యాన్సర్‌తో మరణిస్తే జవహర్‌రెడ్డి ఆఘమేఘాల మీద అన్నవరం వచ్చారని, కుటుంబం మీద సానుభూతి చూపకపోగా, లావాదేవీలకు సంబంధించిన అంశాలపై వత్తిడి తెచ్చారని ఆరోపించారు. అసైన్డ్ భూములను వెంచర్లేసి అమ్మేస్తున్నారని, బినామీల ఆస్తులతో బహిరంగ చర్చకు సిద్ధమా? అని సీఎస్‌కు ఛాలెంజ్ విసిరారు. భారీ కుంభకోణంపై లోతైన దర్యాప్తు జరిగితే, దేశంలోనే అతిపెద్ద భూకుంభకోణం ఇదే అవుతుందంటూ జనసేన నేత మూర్తియాదవ్ మరో బాంబు పేల్చారు.