- ఎస్‌ఐ, స్టేషన్ రైటర్ డబ్బులు దండుకుని బెదిరించారు
- సీఐ కేసు తీసేయాలని చెప్పినా ఇబ్బంది పెడుతున్నారు
- ప్రజావేదిక కార్యక్రమంలో ఎ.కొండూరు వాసుల ఫిర్యాదు
- అర్జీలు స్వీకరించిన మంత్రి సంధ్యారాణి, పనబాక లక్ష్మి
మంగళగిరి(చైతన్యరథం): గత ప్రభుత్వంలో జోగి రమేష్ అండదండలతో పోలీసుల్లో కొంతమంది తమపైనే దాడి చేసి తిరిగి తమపైనే అక్రమ కేసులు పెట్టి వేధించారని ఎ.కొం డూరు మండలానికి చెందిన తేళ్యూరి రాహేలు, తేళ్యూరి రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగిన గ్రీవెన్స్‌లో మంత్రి గుమ్మడి సంధ్యారాణి, మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మి ముందు గోడు వెళ్లబోసుకున్నారు. తప్పుడు కేసు అని సీఐ పరిశీలించి తీసేయాలని చెప్పినా నాడు ఎస్‌ఐ అంకమరావు, స్టేషన్ రైటర్ కోట శేఖర్ వైసీపీ నేతలకు కొమ్ము కాస్తూ తమను బెదిరించి డబ్బులు తీసుకుని కేసు క్లోజ్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు కేసులు తీసేయించి ఎస్‌ఐ, స్టేషన్ రైటర్‌పై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ఇచ్చారు.
టీడీపీ కార్యకర్తనని కక్షగట్టి నగరం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలో సెక్యూరిటీ గార్డు గా పనిచేస్తున్న తనను అప్పటి పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు తీసేయించారని కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం ఈదరాడ గ్రామానికి చెందిన సాదనాల సుబ్బారావు గోడు వెళ్లబోసుకున్నారు. 22 ఏళ్లుగా పనిచేస్తున్న తనకు ఉద్యోగం లేకుండా చేసి పొట్టగొట్టాడని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టుకు వెళితే ఉద్యోగం ఇవ్వాలని ఆర్డర్ ఇచ్చి నా చిట్టిబాబు జోక్యంతో కలెక్టర్ ఉద్యోగం ఇవ్వలేదని వివరించాడు. ఉపాధి లేక తన కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతుందని, ఉపాధి కల్పించి ఆదుకోవాలని వినతిపత్రం ఇచ్చాడు.
` తన పొలానికి సరిహద్దులుగా ఉన్న తాటి చెట్లను నరికేసి పాతూరి విజయ్‌కుమార్, పాతూరి వంశీ తమ పొలాన్ని ఆక్రమించేందుకు యత్నిస్తున్నారని పశ్చిమగోదావరి జిల్లా చేబ్రోలు మండలానికి చెందిన వల్లభనేని మాదవ్ ఫిర్యాదు చేశాడు. మూడు సార్లు సర్వే జరగకుండా అడ్డుకున్నారని.. తన పొలం ఆక్రమణకు గురికాకుండా సర్వే చేయించి న్యాయం చేయాలని విన్నవించాడు.
` నెల్లూరు ఏసీఎస్‌ఆర్ ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగులకు 18 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని అఫ్రీన్, సుధీర్ తదితరులు అర్జీ ఇచ్చారు. తమ కుటుంబాలు గడవటం కూడా కష్టంగా ఉందని.. దయచేసి జీతాలు ఇప్పించి ఆదుకోవాలని కోరారు.
` కర్నూలు జిల్లా కోసగి మండలం చిన్న భూంపల్లి గ్రామ ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో నాడు నేడు పనుల్లో భాగంగా చేపట్టిన గదుల నిర్మాణం అసంపూర్తిగా ఆగిపోయిందని దయచేసి నిధులు మంజూరు చేసి పూర్తి అయ్యేలా చూడాలని గ్రామ ప్రజలు అర్జీ ఇచ్చారు.
` తమకు బాపట్ల జిల్లా రేపల్లె మండలం ఉప్పూడి గ్రామంలో 86 సెంట్లు పట్టా కలిగిన మాగాణి భూమి ఉంది. దానిని గతంలో ఇళ్ల స్థలాల కోసం తీసుకుని పరిహారం ఇవ్వకపోవడంతో కోర్టుకు వెళ్లగా ఇళ్లు నిర్మించకుండా స్టే ఆర్డర్ ఇచ్చారు. అయితే ఆ భూమిలో ఇప్పుడు ఆక్రమణదారులు ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. వాటిని అడ్డుకుని తమ భూమిని ఇప్పించాలని యార్లగడ్డ రామమోహన్‌రావు వినతిపత్రం ఇచ్చారు.
` తన కుమారుడు మూడున్నరేళ్ల నుంచి కనిపించడం లేదు.. రావులపల్లి ఆంజనేయు లు అనే వ్యక్తి తన స్వగ్రామమైన పమిడిపాడు నుంచి తీసుకెళ్లాడు.. పోలీసుల వద్దకు వెళితే స్టేషన్‌లో రోజంతా కూర్చోబెడుతున్నారు తప్ప ప్రయోజనం ఉండటం లేదు..తన కొడుకు జాడ కనిపెట్టాలని పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం పమిడిపాడు గ్రామానికి చెందిన నంబుల రమణమ్మ విజ్ఞప్తి చేశారు.
` నెల్లూరు జిల్లా కావలి మండలానికి చెందిన పాటిబండ్ల శ్రీనివాసులు సమస్యను వివరిస్తూ తాము వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నామని గ్రామంలో అందరి భూములను చుక్కల భూముల నుంచి తొలగించి..తమ భూములను మాత్రం చుక్కల భూముల పరిధిలో ఉంచా రు. వైసీపీ నాయకులు తన పొలాన్ని రెగ్యులరైజ్ చేయవద్దని చెప్పడంతో అధికారులు పట్టించుకోలేదు. దయచేసి తన భూములను చుక్కల భూముల నుంచి తొలగించాలని అర్జీ ఇచ్చి అభ్యర్థించారు.
` ఏపీ మోడల్ స్కూల్స్‌లో పనిచేస్తున్న అటెండర్, వాచ్‌మెన్‌ల అసోసియేషన్ సభ్యులు తమను అవుట్ సోర్సింగ్ నుంచి తొలగించి కాంట్రాక్ట్ పద్దతిలోకి మార్చి మినిమమ్ టైం స్కేల్ ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అభ్యర్థించారు.
` విజయవాడ 59వ డివిజన్‌తో పాటు పలువురు వరద బాధితులు తమకు వరద పరి హారం అందలేదని అర్జీలు ఇచ్చారు. వరదల వల్ల తాము పూర్తిగా నష్టపోయామని.. తమకు వరద సాయం అందించి ఆదుకోవాలని వేడుకున్నారు.
` ఆరోగ్య సమస్యల కారణంగా గతంలో ఆర్థికసాయం కోసం దరఖాస్తు చేసుకున్న పలువురికి సీఎంఆర్‌ఎఫ్ నుంచి మంజూరైన చెక్కులను మంత్రి సంధ్యారాణి, మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి చేతులమీదుగా అందజేశారు. చెక్కులు తీసుకున్న వారు ప్రభుత్వానికి రుణపడి ఉంటామని, సీఎం చంద్రబాబు పేదలకు చేస్తున్న మేలును మరిచిపోలేమని హర్షం వ్యక్తం చేశారు.