అమరావతి: చంద్రబాబు ఆత్మవిశ్వాసం, మనోస్థైర్యం దెబ్బతీయాలన్న కుట్రలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్రప్రభుత్వం వ్యవహరిస్తున్నాయని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు విమర్శించారు. 40 రోజులుగా టీడీపీ అధినేతను జైల్లో పెట్టిన ముఖ్యమంత్రి, వైసీపీ ప్రభుత్వం, కావాలనే ఆయన ఆరోగ్య సమాచారం బయటకు తెలియనీయకుండా వైద్యుల్ని, జైలు అధికారుల్ని కట్టడి చేస్తోందన్నారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబుని మానసికంగా, భౌతికంగా దెబ్బతీయాలన్న కుట్రలు తాడేపల్లి ప్యాలెస్ నుంచే జరుగుతున్నాయని దుయ్యబట్టారు.
చంద్రబాబుకి జైల్లో ఈ నెల 14వ తేదీన వైద్య పరీక్షలు నిర్వహిస్తే, నేటికీ ఆ పరీక్షల వివరాలు ఎందుకు బయటపెట్టలేదు? చర్మసంబంధిత సమస్యతో బాధపడుతున్న వ్యక్తికి వైద్యపరీక్షలు నిర్వహిస్తే, వాటికి సంబంధించిన రిపోర్టులు బయటపెట్టకపోవడాన్ని కుట్ర అనక ఏమనాలి? సొంత బాబాయ్‌ను తన రాజకీయ ప్రయోజనాల కోసం చంపించిన వ్యక్తి, చంద్రబాబులాంటి గొప్ప నాయకుడి విషయంలో కుట్రలు చేయకుండా ఉంటాడా? ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చొని కుట్రలకు రూపకల్పన చేస్తుంటే, సకల శాఖల మంత్రి సజ్జల వాటిని అమలుచేయడంపై దృష్టి పెడుతున్నాడు. వారిద్దరి మాటలు చేతలు చూస్తుంటే, వారు పూర్తిగా తాము ఉన్న స్థానాలు, వాటి తాలూకా బాధ్యతల్ని పూర్తిగా విస్మరించారని అర్థమవుతోంది. తమ కుట్రలకోసం రాజ్యాంగ వ్యవస్థలనే వినియోగించుకునే స్థాయికి వారు దిగజారారని కళావెంకట్రావు తప్పుబట్టారు.
చంద్రబాబు ఆరోగ్య సమాచారం ఎందుకు బయటపెట్టలేదు?
చంద్రబాబు ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన నివేదికలు బయటపెట్టాలని ఆయన కుటుంబసభ్యులు కోర్టుల్ని ఆశ్రయించారు. వైద్య నివేదకలు బయటపెట్టకుండా కుట్రలు ఎందుకు చేస్తున్నారు? జైలు అధికారులు తాడేపల్లి ఆదేశాల ప్రకారమే.. చెప్పాలనుకున్న విషయాలు మాత్రమే బయటకు చెబుతున్నారు. చంద్రబాబు ఆరోగ్యం బాగుంటే, ఆయన్ని పరీక్షించిన వెంటనే ఆ పరీక్షల ఫలితాలు, వాటికి సంబంధించిన వైద్యనివేదికలు ఎందుకు బయటపెట్టలేదు? మాజీ ముఖ్యమంత్రి విషయంలోనే ఇలా వ్యవహరిస్తే, ఇక సామాన్యుల విషయంలో ఈ ప్రభుత్వం ఎంత దారుణంగా వ్యవహరిస్తుందో చెప్పాల్సిన పనిలేదు. ప్రభుత్వం ఇప్పటికైనా తక్షణమే చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించిన నివే దికల్ని బయటపెట్టాలని టీడీపీ తరుపున కళావెంకట్రావు డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి ఎన్ని ఆంక్షలు పెట్టినా.. ప్రజలు భువనేశ్వరిని కలవడం ఖాయం
భువనేశ్వరిని కలవడానికి వెళ్లే వారిపై ప్రభుత్వం ఆంక్షలు ఎందుకు పెడుతోంది? ఆమెకు మద్దతుగా ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసి తట్టుకోలేకే, ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారా? భువనేశ్వరిని కలవడానికి మాజీమంత్రి కొల్లు రవీంద్ర సారథ్యంలో బీసీలు బయలుదేరితే, ఆయన్ని అక్రమంగా నిర్బంధిస్తారా? జగన్మోహన్‌రెడ్డి ముఖ్య మంత్రి కావడం వల్లే ఇలాంటి అర్థంపర్థంలేని ఆంక్షలు రాష్ట్రంలో అమలు చేస్తున్నారని మండిపడ్డారు.