- ఇది తోపు ప్రకాష్ రెడ్డి పరిజ్ఞానం, పని తనం
- ప్రాజెక్టు గేట్ల మరమ్మతులకు వెంటనే అంచనా తయారు చేయండి
- అధికారులకు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశం
రాప్తాడు (చైతన్యరథం): లక్ష ఎకరాలకు నీరు ఇస్తామని.. కనీస పరిజ్ఞానం లేకుండా పేరూరు ప్రాజెక్టు గేట్లు విరగ్గొట్టారని మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిపై మాజీ మంత్రి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత విరుచుకుపడ్డారు. తన ఎన్నికల హామీల్లో కీలకమైన పేరూరు ప్రాజెక్టును ఆమె బుధవారం పరిశీలించారు. రామగిరి మండలంలో ఉన్న అప్పర్ పెన్నార్ ప్రాజెక్ట్ (పేరూరు ప్రాజెక్ట్)ను సంబంధిత శాఖ అధికారులతో కలసి పరిశీలించారు. జీడిపల్లి రిజర్వాయర్ నుంచి పేరూరు ప్రాజెక్ట్ వరకు నిర్మించే పరిటాల రవీంద్ర సాగునీటి కాలువతోపాటు పుట్టకనుమ, సోమరవాండ్లపల్లి రిజర్వాయర్ల నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ఆమె సందర్శించారు. అప్పట్లో 805కోట్ల నిధులతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఈ శిలాఫలకాలు ఆవిష్కరించబడ్డాయి. అనంతరం విరిగిన ప్రాజెక్టు గేట్లను కూడా పరిశీలించి.. ఏం చేయాలన్నది చర్చించారు. వెంటనే గేట్ల మరమ్మతులకు అంచనాలు తయారు చేయాలని సునీత ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో వర్షపు నీటితో ప్రాజెక్ట్ నిండితే… అత్యుత్సాహంతో ప్రాజెక్ట్ గేట్లు ఎత్తే క్రమంలో 5, 8 వ గేట్లను ప్రకాష్ రెడ్డి విరగ్గొట్టారన్నారు.
ప్రాజెక్ట్ 5, 8 వ గేట్స్ పూర్తిగా పాడయ్యాయని.. 6వ గేట్ చైన్ లింక్స్ పాడయ్యాయన్నారు. మొత్తం ప్రాజెక్ట్ 8గేట్లు ఫంక్షనింగ్ సరిగా లేదని.. లిగ్మెంట్స్, మోటార్స్, స్టార్టర్ బాక్స్ లు, వైరింగ్ మరమ్మతులు చేయించాల్సిన అవసరం ఉందని అధికారులు తెలిపారన్నారు. మరమ్మత్తుల కోసం 1.26 కోట్లతో అంచనా వేసి అనుమతులకోసం ప్రభుత్వానికి పంపుతున్నట్టు చెప్పారు. ఇప్పటికే సంబంధిత శాఖ ఎస్‌ఈ, సీఈలు విజయవాడ మీటింగ్ వెళుతున్న సందర్బంగా ఈ గేట్స్ సమస్యను ఉన్నత స్థాయికి తీసుకెళ్లి నిధులు విడుదల చేయించాలని సూచించారు. గేట్స్ మరమ్మత్తు చేయకపోతే వర్షపు నీరు నిలువ చేయడానికి అవకాశం లేదన్నారు. ఎక్కువ నీరు వస్తే బయటకు పంపడానికి అవకాశం ఉండదని.. ప్రాజెక్ట్ దెబ్బతింటుందన్నారు. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో 22 కోట్ల జైకా నిధులు మంజూరు చేయగా.. ఆ నిధులతో గత పాలకులకు అభివృద్ధి చేయడం చేతకాలేదని విమర్శించారు. త్వరలోనే ప్రాజెక్టుకు నీరందించే పనులు ప్రారంభమవుతాయన్నారు.