- రాష్ట్ర ప్రయోజనాల కోసమే కృషి చేయాలి
- అధికారాన్ని బాధ్యతగా తీసుకోవాలి
- పదవులు శాశ్వతం కాదు
- కార్యకర్తల కష్టం, త్యాగం వల్లే ఆ విజయం
- వారికి న్యాయం చేయటం మన బాధ్యత
అమరావతి(చైతన్యరథం): చంద్రబాబు మారరు అనే అపవాదు నాపై ఉంది… కానీ ఇక అలా ఉండదని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇకపై మారిన చంద్రబాబును చూస్తారన్నారు. ఏదేమైనా రాష్ట్ర ప్రయోజనాలే మనందరి ప్రథమ కర్తవ్యం కావాలని టీడీపీ తరఫున కొత్తగా ఎన్నికైన ఎంపీలకు చంద్రబాబు సూచించారు. స్టేట్ ఫస్ట్ అనేదే తమ నినాదం అని, దీన్ని దృష్టిలో పెట్టుకొనే ఎంపీలందరూ పనిచేయాలని దిశానిర్ధేశం చేశారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం గురవారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జరిగింది. అందుబాటులో ఉన్న పలువురు ఎంపీలు ఈ సమావేశానికి ప్రత్యక్షంగా హాజరయ్యారు. ఇతర ఎంపీలు జూమ్ కాల్ ద్వారా పాల్గొన్నారు. ముందుగా ఎంపీలందరికీ చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొత్తగా ఎన్నికైన ఎంపీలకు కీలక సూచనలు చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఎవరూ ఆకాశంలో ఎగరొద్దని వార్నింగ్ ఇచ్చారు. ప్రజలు నమ్మకంతో ఇచ్చిన విజయాన్ని బాధ్యతగా సమాజ సేవ చేసేందుకు వినియోగించాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకోని వైసీపీ ఎంపీలు.. గత ఐదేళ్లు పాటు జగన్ కేసుల మాఫీ అజెండాతోనే ఢల్లీిలో పైరవీలు చేశారన్నారు.
కానీ, మన కర్తవ్యం వేరు అని టీడీపీ ఎంపీలకు చంద్రబాబు సూచించారు. అందుకు తగ్గట్లుగానే పార్లమెంట్‌లో కృషి చేయాలన్నారు. ముందు ప్రజాస్వామ్య వ్యవస్థల్ని గౌరవించాలని.. ఆ తరువాతే మనం అని చంద్రబాబు అన్నారు. వ్యవస్థలకు అతీతంగా ఎవరు వ్యవహరించినా.. ఆ వ్యవస్థే తిరిగి కాటేస్తుందన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని సూచించారు. పదువులు శాశ్వతం అని ఎవరూ అనుకోవద్దని హెచ్చరించారు. ముఖ్యమంత్రిగా తన ప్రమాణ స్వీకారానికి మోదీని ఆహ్వానించామని.. ఆయన వచ్చేందుకు సానుకూలంగా స్పందించారన్నారు.
కాగా, ఎంపీల సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి మీరు మారిన చంద్రబాబును చూస్తారన్నారు.
బ్యూరోక్రాట్‌ల పాలన ఇక ఎంతమాత్రం ఉండదన్నారు. ‘చంద్రబాబు మారరు అనే అపవాదు నా మీద ఉంది. ఇకముందు అలా ఉండదు. మీరే ప్రత్యక్షంగా చూస్తారు. ఎంపీలు అందరు తరచూ వచ్చి కలవండి. నేను బిజీగా ఉన్నా కూడా మాట్లాడతాను. టీడీపీ కార్యకర్తలు, నేతలు ఈ ఐదు సంవత్సరాల నా కోసం ప్రాణాలు ఇచ్చారు. పీక మీద కత్తి పెట్టినా జై టీడీపీ, జై చంద్రబాబు అన్నారు. అధికార పార్టీ వత్తిడికి ఎవరూ తలొగ్గలేదు. ఇకనుంచి ప్రతి అంశం నేను వింటాను.. నేనే చూస్తాను. ఇక ముందు రాజకీయ పరిపాలన ఉంటుంది. అందరూ కలిసి పని చేయాలి. ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా కలిసి పనిచేయాలి.
ఎవరి హద్దులు ఏమిటో నేను స్పష్టంగా చెపుతాను. అందరూ ఎవరి పరిధిలో వారు పని చేయాలి. అందరం కలిసి కార్యకర్తలు, నేతలకు న్యాయం చేయాలి. ఈ ఐదు సంవత్సరాలు కార్యకర్తలు, నేతలు పడిన ఇబ్బందులు నాకు చాలా మనోవేదన కలిగించాయి. వారి కష్టం, వారి త్యాగం, కృషి వల్లనే ఈ రోజు పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ నెల 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తాను. ఈ సారి ఎన్నికైన ఎంపీల టీమ్ చాలా బాగుంది. గతంలో ఎర్రన్నాయుడు ఉన్నప్పుడు ఇటువంటి టీమ్ ఉంది. ఈ టీమ్ ఢిల్లీలో రాష్ట్ర ప్రయోజనాల కోసం బాగా పని చేయాలని చంద్రబాబు సూచించారు.
కాగా శక్రవారం ఢిల్లీలో జరిగే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి కూటమిలో భాగమైన టీడీపీ ఎంపీలందరూ హాజరుకానున్నారు. నియోజకవర్గాల్లో ఉన్న ఎంపీలు నేటి రాత్రికి ఢల్లీి చేరుకోనున్నారు.