- ఎన్డీఏ ప్రభుత్వం రాగానే విచారణ జరిపిస్తాం
- మూల విరాట్‌సహా బాధ్యులపై చర్యలు
- మద్యం ఆదాయంపై వేల కోట్ల అప్పు సిగ్గుచేటు
- కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీస్తున్నారు
- ధ్వజమెత్తిన కూటమి నేతలు బొండా, లంకా, గాదె
అమరావతి(చైతన్యరథం): మద్యనిషేధం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి ఐదేళ్లలో మద్యం అమ్మకాల్లోనే లక్ష కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డారని ఎన్డీఏ కూటమి నేతలు ధ్వజమెత్తారు. నాసిరకం మద్యంతో లక్ష మంది ప్రాణాలు తీసి ఆడబిడ్డల మంగల్యాలు తెంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దోచుకున్న డబ్బులను ఎన్నికల కోసం కంటైనర్లలో తరలిస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్ అవినీతిని బయటకు తీసి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో గురువారం కూటమి నేతలు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు, ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్, జనసేన నాయకుడు గాదె వెంకటేశ్వరరావు సంయుక్తంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ప్రజారోగ్యానికి జగన్ తూట్లు: బొండా
కల్తీ మద్యం, జే బ్రాండ్లతో ప్రజారోగ్యానికి జగన్ రెడ్డి తూట్లు పొడిచారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గంజాయి, డ్రగ్స్ కు ఏపీని కేరాఫ్ గా మర్చి… రాష్ట్రంలో భారీగా రవాణా చేస్తున్నారన్నారు. జగన్ వచ్చాకే వేల కోట్ల డ్రగ్స్ దందా జరుగుతోందని మండిపడ్డారు. అక్రమ మద్యం రవాణా విచ్చలవిడిగా జరుగుతోందన్నారు. నెల్లూరు ప్రభుత్వ మద్యం షాపుల్లో గోవా నుంచి వచ్చిన లిక్కర్ అమ్మకాలు జరగటం, విదేశాలనుండి విజయవాడ చిరునామాతో టన్నుల కొద్ది వచ్చిన డ్రగ్సే దీనికి నిదర్శనమన్నారు. మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి రూ.40 వేల కోట్లు అప్పు తేెవడం సిగ్గుచేటన్నారు.
లక్ష కోట్ల దోపిడీ… లక్ష మంది ప్రాణాలు బలి
జగన్ కల్తీ మద్యంతో లక్ష మంది ప్రాణాలు పోయాయన్నారు. ప్రజల ప్రాణాలు తీసి ఐదేళ్లలో లక్ష కోట్లను జగన్ రెడ్డి దోచుకున్నారని బొండా ఆరోపించారు. దోచుకున్న డబ్బులు తాడేపల్లి ప్యాలెస్ నుండి కంటైనర్లలో ఎన్నికల కోసం తరలిస్తున్న విషయం బయటపడిరదన్నారు. కల్తీ మద్యం అమ్మి ఆడబిడ్డల తాళిబొట్లు తెంపుతున్న జగన్‌కు త్వరలో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ అవినీతిపై చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. జగన్ అవినీతిని బయట పెట్టేందుకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.
జగన్ మిత్రులకు ఆదాయం… రాష్ట్ర ప్రజలకు అనారోగ్యం: లంకా
రాష్ట్రంలో జరుగుతున్న నాసిరకపు మద్యం అమ్మకాలు జగన్ మిత్రులకి ఆదాయ కిక్కు – పేదల ఆరోగ్యానికి ముప్పు మారిందని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ మండిపడ్డారు. 2019 ఎన్నికల ముందు మద్య నిషేధం చేస్తానన్న జగన్..ఇప్పుడు మద్యాన్నే ఆదాయ వనరుగా మార్చుకోవడం సిగ్గుచేటన్నారు. గత ఐదేళ్లలో మద్యం మాఫియా ద్వారా లక్ష కోట్లు ‘‘జె గ్యాంగ్ ‘‘ కొల్లగొట్టిందన్నారు. అవినీతి కోసమే మద్యం అమ్మకాల్లో డిజిటల్ చెల్లింపులకు అనుమతి ఇవ్వటం లేదన్నారు. మద్యం తయారీ కంపెనీలన్నీ జగన్ సన్నితులవేనన్నారు. జగన్ కుటుంబ సభ్యులు వైఎస్ అనిల్ రెడ్డి మద్యం వ్యాపారంలో ఆరితేరి పోయారన్నారు. ఆయన కనుసన్నలలోనే రాష్ట్రంలో మద్యం తయారీ కంపెనీలు పని చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో జరిగిన నాసిరకపు మద్యం అమ్మకాల్లో అవినీతి, అక్రమాల చిట్టా పై విచారణ జరిపి మూల విరాట్ తోపాటు అందులో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ జైలుకు పంపిస్తామన్నారు. మద్యం నియంత్రణ కోసం కనీసం జిల్లాకు ఒక్క అడిక్షన్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేయకపోవడం బాధాకరమని దినకర్ అన్నారు.
వాసుదేవ రెడ్డి కనుసన్నల్లో మద్యం మాఫియా
ఏపీ బేవరేజస్ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి కనుసన్నలోనే రాష్ట్రంలో మద్యం మాఫియా అరాచకాలు నడుస్తున్నాయని దినకర్ తెలిపారు. ఎన్నికల సమయంలో అక్రమంగా వైకాపా అభ్యర్థులకు మద్యం సరఫరా చేసేందుకు వాసుదేవ రెడ్డి ప్రణాళికలు రచించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు. తక్షణం వాసుదేవ రెడ్డిని విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. 2014 – 2019 మధ్య కాలంలో మద్యం ఆదాయం ఎంత? నిషేధం అని జగన్ చెప్పాకా నేటి పరిస్థితి ఏమిటో ప్రజలు గమనించాలన్నారు. దశలవారీ మద్యం నిషేధం అన్న తరువాత రాష్ట్రంలో ఎక్సయిజ్, వ్యాట్ ఆదాయం క్రమంగా తగ్గాల్సిందిపోయి పెరగడం దౌర్భాగ్యమన్నారు. జగన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మద్యం అమ్మకాలపై పన్నుల రూపంలో ఆర్జించిన ఆదాయం రమారమి 2019 – 20 కి రూ. 17,300 కోట్లు, 2020 – 21 కి రూ. 21,500 కోట్లు, 2021 – 22 కి రూ. 26,700 కోట్లు, 2022 – 23 కి 30,600 కోట్లు, 2023 – 24 కి రూ. 35,000 కోట్లు పైమాటేనని దినకర్ చెప్పారు.
ఢిల్లీ మద్యం కుంభకోణాన్ని మించి..
స్వంత వారి లాభం కోసం మధ్య నిషేధం హామీని గాలికొదిలేసిన జగన్ మద్యమే ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్నారని విమర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం నుండి వచ్చే వ్యాట్ ఆదాయాన్ని బేవరేజ్ కార్పొరేషన్‌కి తరలించి, కార్పొరేషన్ పేరుతో 20 సంవత్సరాలలో తిరిగి చెల్లించే విధంగా 25,000 కోట్ల రూపాయిల రుణం తీసుకొచ్చి, ఇక ఎప్పటికీ మధ్య నిషేధం అనేది జరగకుండా జగన్ కుట్ర చేశారన్నారు. జాతీయ, రాష్ట్ర రహదారులను ఆనుకొని మద్యం దుకాణాలు ఉండకూడదు అనే నిబంధనలున్నప్పటికీ.. దీనిపైనా సుప్రీంకోర్ట్ తీర్పులున్నా వాటిని బేఖాతరు చేస్తూ మద్యం అమ్మకాలు పెంచుకోవడంపైనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టటం దౌర్భాగ్యమన్నారు. జంగారెడ్డిగూడెంలో నాటు సారా వల్ల 25 మంది చనిపోయి సంవత్సరం దాటినా దాని వెనుక ఉన్నదెవరో ఇంత వరకు ఎందుకు బయటకు రాలేదో జగన్ సమాధానం చెప్పాలన్నారు.. వీటిని సహజ మరణాలుగా చిత్రీకరించే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చేయలేదా అని ప్రశ్నించారు. 2019 తరువాత నాసిరకపు మద్యం వల్ల లివర్ వ్యాధులు పెరిగినట్లు తెలిపారు.
ఢల్లీిలో బయటపడిన మద్యం స్కామ్ కన్నా ఆంధ్రప్రదేశ్ లో మద్యం కుంభకోణం చాలా పెద్దదన్నారు రాబోయే కాలంలో కేంద్ర విచారణ సంస్థల ద్వారా నిజాల నిగ్గు తేలుస్తామన్నారు. మద్యం కుంభకోణం మూలవిరాట్ కు జైల్ జీవితం ఖాయమన్నారు. నూతన తెలుగు ఏడాది కొత్త మార్పుతో ప్రారంభమై జగన్ ట్రబుల్ ఇంజన్ సర్కార్ పోయి ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజన్ సర్కార్ రావడం తథ్యమని దినకర్ అన్నారు.
దొంగ చేతికి అధికారమిచ్చారు: గాదె
ఒక్క ఛాన్స్ అంటే నమ్మి రాష్ట్ర ప్రజలు దొంగ చేతికి అధికారం ఇచ్చారని జనసేన నాయకుడు గాదె వెంకటేశ్వరరావు అన్నారు. జగన్ రెడ్డి తనకు అలవాటైన రీతిలో దొంగ వ్యాపారాలతో దోచుకోవడమే ధ్యేయంగా పాలన సాగించాడని మండిపడ్డారు. జగన్ కు వ్యాపారమే తెలుసు కాని.. పాలన తెలియదన్నారు. మేని ఫెస్టోను ఖురాన్, బైబిల్, భగవద్గీత అన్న జగన్ ఆ మాట ఏమైందో చెప్పాలన్నారు. మద్యపాన నిషేధంపై జగన్ మాట తప్పి.. మద్యాన్నే ఆదాయంగా మార్చి దోపిడీకి తెరలేెపారన్నారు. నేడు రోడ్డుప్క చిన్న దుకాణాల్లో కూడా డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నా… ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కేవలం నగదు లావాదేవీలు మాత్రమే అనుమతించటం వెనుక మతలబు ఏమిటని ప్రశ్నించారు. అక్రమ అమ్మకాలు, అక్రమ లావాదేవీలతో గడిచిన ఐదేళ్లలో లక్షల కోట్లు కొల్లగొట్టి తాడేపల్లి ప్యాలెస్‌కు తరలించారన్నారు. జగన్ నాసిరకం మద్యం అమ్మి ఆడబిడ్డల తాళిబొట్లు తెంచాడని విమర్శించారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై జగన్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జగన్ దుర్మార్గాన్ని ప్రజలు గమనిస్తున్నారని, తప్పకుండా బుద్ధి చెబుతారన్నారు. కూటమి అధికారంలోకి వస్తే మద్య నియంత్రణకు కృషి చేస్తామని… ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తామన్నారు. ప్రజా శ్రేయస్సు కోరే కూటమిని ఆదరించి గెలిపించాలని కోరారు.