అమరావతి(చైతన్యరథం): చేనేత కార్మికులకు అండగా నిలిచిన సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరికి రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి ఎస్.సవిత ధన్యవాదాలు తెలిపారు. రాబోయే పండగల నేపథ్యంలో చేనేత వస్త్రాలు ధరించాలని, నేతన్న కళాకారులకు అండగా నిలవాలని నారా భువనేశ్వరి పిలుపునివ్వడంపై మంత్రి సవిత హర్షం వ్యక్తంచేశారు. ఈ మేరకు ఆదివారం మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. నిజం గెలవాలి పర్యటన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికుల కష్టాలను నారా భువనేశ్వరి స్వయంగా చూశారన్నారు. యాసిడ్, బ్లీచింగ్ మధ్య నిల్చొని ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా రేయింబవళ్లు ప్రజల కోసం వస్త్రాలు రూపొందిస్తున్న చేనేతలకు అండగా నిలవాలని, రాబోయే దసరా, దీపావళి పండలకు చేనేత వస్త్రాలు కొనుగోలు చేద్దామని భువనేశ్వరి పిలుపునివ్వడం సంతోషకరమన్నారు. చేనేత కార్మికులను ఆదుకోడానికి సీఎం చంద్రబాబు ఇప్పటికే కార్యాచరణ చేపట్టారన్నారు.
నేతన్నల అభివృద్ధికి 2014-19లో అమలు చేసిన పథకాలన్నింటినీ మరోసారి అమలు చేయనున్నామని మంత్రి వెల్లడిరచారు. ఇటీవల నిర్వహించిన చేనేత, జౌళి శాఖ సమీక్షలోనూ సీఎం చంద్రబాబునాయుడు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారన్నారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వమే భరించేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. సాధారణ మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇవ్వనున్నామన్నారు. చేనేతలకు 365 రోజులూ పని కల్పించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు. ప్రస్తుతమున్న ట్రెండ్‌కు అనుగుణంగా దుస్తుల తయారీలో నేతన్నలకు శిక్షణ ఇవ్వడంతో పాటు మార్కెటింగ్ సదుపాయం కూడా కల్పించనున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్జిబిషన్లు నిర్వహించడం, ఈ కామర్స్ లో చేనేత వస్త్రాల విక్రయాలకు అవకాశం కల్పించడంపై తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. భువనమ్మ పిలుపు మేరకు ప్రజలు స్పందించి, చేనేత వస్త్రాలను వారానికి ఒకసారైనా ధరించాలని మంత్రి సవిత ఆ ప్రకటనలో కోరారు.