- హింసా రాజకీయాలు జగన్ రక్తంలోనే ఉన్నాయి
అమరావతి(చైతన్యరథం): దొంగే.. దొంగ, దొంగ అని అరిచినట్లు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ మండిపడ్డారు. టీడీపీ హింసా రాజకీయాలు చేయబోతోంది..పోలింగ్‌బూత్‌ల్లో అల్లర్లు సృష్టిస్తుంది అన్న సజ్జల వ్యాఖ్యల వెనుక ఏదో కుట్ర ఉందనే అనుమానం కలుగుతోందని కంభంపాటి అన్నారు. హింసా రాజకీయాలు, పోలింగ్ రోజు అక్రమాలు, దాడులు అనేవి జగన్, వైసీపీ రక్తంలోనే ఉన్నాయని కంభంపాటి అన్నారు. నామినేషన్లు వేయకుండా, ప్రజలు సక్రమంగా పొలింగ్‌కు వెళ్లకుండా అల్లర్లు సృష్టించిన చరిత్ర వైసీపీదే అన్నారు. ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున హింసకు దిగేందుకు వైసీపీ పన్నాగం పన్నిందని….ఆ కుట్ర బయటకు రాకుండా టీడీపీ పై ముందుగానే ఆరోపణలు చేస్తున్నారని మాజీ ఎంపీ అన్నారు. తామే నేరాలు చేయడం…వాటిని వేరే వారిపై నెట్టేయడం అనేది వైసీపీ సిద్దాంతం అన్నారు. ఎన్నికల్లో ఓడిపోతామనే ఫ్రస్టేషన్ సజ్జల వ్యాఖ్యల్లో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికలు జరగాలనేదే తమ అభిమతమని…దీనిపై ఎన్నికల సంఘం దృష్టిపెట్టాలని డిమాండ్ చేశారు. నిత్యం ఫేక్ ప్రచారాలు, డీప్ ఫేక్ వీడియోలే వైసీపీలో ఓటమి భయానికి సాక్ష్యం అని కంభంపాటి అన్నారు.