- చిత్రగుప్తుడి పాపాల చిట్టా కంటే జగన్ అండ్ కో చిట్టా పెద్దది
- దోపిడీలో అధికారులు భాగస్వాములు కావడం సిగ్గుచేటు
- వాసుదేవరెడ్డి, సమీర్‌శర్మలు అప్రూవర్‌లుగా మారాలి
- జేపీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కట్టకుండానే రూ.800 కోట్లు నొక్కారు
- ఆ డబ్బును కట్టేదాకా వారిని వదిలిపెట్టేది లేదు
- పాపాల పెద్దిరెడ్డి వంటి నేతలు దోచినదంతా కక్కిస్తాం
- దోపిడీకి కాదేది అనర్హం అన్నట్లు రాష్ట్రాన్ని లూటీ చేశారు
- విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చి అందరినీ శిక్షిస్తాం
- వైసీపీ నేతలు కటకటాల్లోకి వెళితే తప్ప ప్రాయశ్చిత్తం జరగదు
- టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కె.ఎస్.జవహర్ వ్యాఖ్యలు
మంగళగిరి: అగ్గిపుల్ల, సబ్బుబిల్ల, కుక్కపిల్ల కాదేది కవితకు అనర్హం అన్నట్లు… జగన్‌రెడ్డి, వైసీపీ నేతలు కూడా దేనిని వదలకుండా దోచుకున్నారని మాజీ మంత్రి కె.ఎస్.జవహర్ మండిపడ్డారు. దోచుకున్న ఫైళ్లు దొరక్కుండా దగ్ధం చేసినంత మాత్రాన చేసిన పాపాల నుంచి తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏ నేరస్తుడైనా ఏదొక చోట దొరకాల్సిందే. ఎన్ని ఫైళ్లు దగ్ధం చేసినా వైసీపీ నేతల పాపాల చిట్టా అంతా టీడీపీ దగ్గర ఉంది. దొంగలతో పాటు అధికారులు కూడా భాగస్వాములు కావడం సిగ్గుచేటు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి సమీర్ శర్మ డ్రైవర్ నాగరాజుకు ఫైళ్లు దగ్ధం చేయమని చెప్పడం దారుణం. వీరిపై వెంటనే కేసులు పెట్టి కటకటాల్లో వేయాలి. ఒకప్పుడు వాసుదేవరెడ్డి బేవరేజెస్, ఎక్సైజ్‌లో అక్రమంగా కోట్లు కొల్లగొట్టారు.. ఇప్పుడు లెక్కేస్తుంటే అక్రమాల లెక్కలు తేలడం లేదు. ఐఏఎస్ అధికారులుగా ఉండి జగన్ రెడ్డి, ఆలీబాబా 40 దొంగలకు సహకరిస్తూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఫైళ్లను అమరావతిలో దగ్ధం చేశారు..కరకట్టపై దగ్ధం చేశారు. ప్రజలు అప్రమత్తమై పట్టుకుంటే కొన్ని దొరికాయి. ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించి వాసుదేవరెడ్డిని, కరకట్టపై ఫైళ్లను దగ్ధం చేయించిన సమీర్ శర్మలపై థర్డ్ డిగ్రీలను ప్రయోగించి నిజాలను బయటకు తీయాలి. వీరి వెనుక ఎవరు ఉన్నా వదిలిపెట్టేది లేదు. వారి పాపాల చిట్టాను బయటకు తీయాలి. చిత్రగుప్తుడి దగ్గర ఉన్న పాపాల చిట్టాకంటే వైసీపీ నేతల పాపాలు ఎక్కువగా ఉన్నాయి. వారి పాపాలపై విచారణ జరిపి బయటపెట్టి శిక్షిస్తాం.
పాపాల పెద్దిరెడ్డి గనులనే మాయం చేశాడు
వైసీపీ అధికారంలోకి వచ్చాక జేపీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ దాదాపు రూ.800 కోట్లు కట్టకుండానే కట్టామని చెప్పి మోసం చేశారు. జగన్ రెడ్డి ఏ విధంగా దోపిడీదారులను ప్రోత్సహించారో ఇదే ఉదాహరణ. ఆ డబ్బు ప్రభుత్వానికి కట్టేదాకా వారిని వదిలిపెట్టం. ఇక పాపాల పెద్దిరెడ్డి గనులనే మాయం చేశాడు… నేడు ఫైళ్లు ఒక లెక్క వాటిని మాయం చేయడానికి యత్ని స్తున్నాడు. పెద్దిరెడ్డి అక్రమాలకు సంబంధించి ఎవరైతే అధికారులు సహకరించారో వారు అప్రూవర్‌గా మారాలి. అలాగే వాసుదేవరెడ్డి, సమీర్‌శర్మలు అప్రూవర్‌గా మారి ప్రభుత్వానికి నిజం చెప్పాలి. దోచుకున్న దోపిడీని ప్రజలకు పంచాల్సిన అవసరం ఉంది. వైద్యఆరోగ్య శాఖ, గ్రూప్ 1లో అనేక అవకతవకలు జరిగాయి. వాటిని బయటపెట్టాల్సిన అవసరం ఉంది. నాడు నేడు పేరుతో దోచుకున్నారు. గతంలో స్కూల్ విద్యార్థుల కోసం ఉంచిన సైకిళ్లను ఏం చేశారో తెలియదు. రోడ్లు వేయకుండా వేసినట్లు చూపి బిల్లులు తీసుకున్నారు. పోలవరంను ముంచారు..అమరావతిలలో మట్టి, ఇసుక, కంకరను కూడా వదలకుండా దోచుకెళ్లారు. వారిని వెంటనే అరెస్టు చేసి శిక్షించాలి.
ఫైళ్ల దగ్ధంపై నోరు విప్పి జగన్ సత్యశీలతను నిరూపించుకోవాలి
జగన్‌రెడ్డి సత్యహరిశ్చంద్రుడని చెప్పుకుంటాడు. నేడు ఫైళ్ల దగ్ధంపై బయటకు వచ్చి మాట్లాడి సత్యశీలతను నిరూపించుకోవాలి. జగన్ తన అనుంగులు ఏ విధంగా దోచుకున్నారో… తానే చెప్పాలి. నెల్లూరు కోర్టుల్లో ఉన్న కాగితాలను కూడా కాకాణి తగలబెట్టించాడు. వైసీపీ నేతల పాపాలు పండాయి. ప్రజా కోర్టులో తీర్పు ఇచ్చారు. అలాగే న్యాయస్థానంలో కూడా తీర్పు జరిగి వైసీపీ నేతలు కటకటాల్లోకి వెళితే తప్ప వారు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం జరగదు. నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులకు అధికారులు సహకరించి ఫైళ్లను దగ్ధం చేస్తే మూల్యం చెల్లించుకుంటారు. ప్రతి డిపార్ట్‌మెంట్‌లో ఉన్న ఫైళ్లను భద్రపరచాలి. ఏ కాగితం బయటకు వెళ్లడానికి వీళ్లేదు. అక్రమంగా దోచుకుని నేడు ఫైళ్లను దగ్ధం చేస్తే వారి పాపం పోతుం దనుకుంటున్నారేమో…అధికారులు ఇకనైనా మారి ఏ ఫైళ్లు దగ్ధం చేశారో చెప్పాలని హితవుపలికారు.