- అమరావతి ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక
- 5కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలకు ప్రతిఫలం
- స్వర్ణాంధ్ర నిర్మాణంలో కీలక మైలురాయి
- టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు
అమరావతి, ఏప్రిల్ 01: అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్‌సభ ఆమోదం లభించడం ఐదుకోట్ల ఆంధ్రుల ఆకాంక్షలకు ప్రతిఫలంగా నిలిచిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఇది కేవలం ఒక చట్టపరమైన నిర్ణయం మాత్రమే కాకుండా, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన చారిత్రాత్మక ఘట్టమని అభివర్ణించారు. “నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ – నా రాజధాని అమరావతి” అనే భావనతో ప్రతి ఆంధ్రుడు గర్వంగా నిలిచే రోజు ఇదని తెలిపారు. అమరావతి నిర్మాణం రైతుల త్యాగాలు, మహిళల కన్నీళ్లు, ప్రజల కలల సమాహారమని పేర్కొంటూ, శాంతియుత పోరాటానికి దక్కిన విజయమిదని స్పష్టం చేశారు. రైతుల దీక్షలు, ఉద్యమాలు, ప్రజల అంకితభావానికి ఇది న్యాయం చేసిన నిర్ణయమన్నారు. ప్రజా రాజధాని అమరావతి ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిందని, ఈ బిల్లు ఆమోదం స్వర్ణాంధ్ర నిర్మాణంలో కీలక మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. గత పాలనలో నెలకొన్న అనిశ్చితి, సందిగ్ధతకు ఇది శాశ్వతంగా తెరదించిందన్నారు.
ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దే దిశగా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అమరావతిని ఏకైక రాజధానిగా కేంద్రం స్పష్టతనిచ్చిన నేపథ్యంలో రాష్ట్రానికి స్పష్టమైన దిశ లభించిందని పల్లా గారు పేర్కొన్నారు. రాష్ట్రానికి ముఖచిత్రం, గౌరవప్రతీకగా అమరావతి నిలిచిందని, ఇకపై అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు పడతాయని అన్నారు.గత వైసీపీ ప్రభుత్వంలో మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని గందరగోళంలోకి నెట్టారని పల్లా ధ్వజమెత్తారు. ప్రపంచంలో దాదాపు ఎక్కడా అమలు కాని విధానాన్ని తీసుకువచ్చి అభివృద్ధిని అడ్డుకున్నారని విమర్శించారు. సచివాలయం ఒకచోట, అసెంబ్లీ మరోచోట ఉండే పరిస్థితులు పరిపాలనలో ఆలస్యం, ఖర్చుల పెరుగుదల, సమన్వయ లోపాలు తీసుకువస్తాయని పేర్కొన్నారు. అది అభివృద్ధి కాదు, అయోమయం సృష్టించే విధానమని స్పష్టం చేశారు.
మళ్లీ మావిగన్ అని మూడు రాజధానుల పేరుతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయడం జగన్ రెడ్డి రాజకీయ స్వార్థానికి నిదర్శనమని పల్లా గారు మండిపడ్డారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తస్మాత్ జాగ్రత్తగా వ్యవహరించాలని పల్లా హెచ్చరించారు. అమరావతి బిల్లు ఆమోదానికి సహకరించిన ప్రధాని నరేంద్ర మోదీజీకి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి పల్లా గారు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కృషి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మద్దతు, మంత్రి శ్రీ నారా లోకేష్ పాత్రతో ఈ విజయం సాధ్యమైందన్నారు. బలమైన రాజధాని నిర్మాణంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, అమరావతి భవిష్యత్తుపై ఉన్న అనుమానాలకు ఇక శాశ్వతంగా ముగింపు పలుకుదామని పల్లా శ్రీనివాసరావు గారు పిలుపునిచ్చారు.













