- పీవీకి భారతరత్నపై స్పందించరా?
- +జగన్ తీరును తప్పుబట్టిన లోకేష్
అమరావతి: తెలుగువారైన దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న పురస్కారంపై స్పందించేందుకు ఏపీ సీఎం జగన్‌రెడ్డి నిరాకరించటాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తప్పుబట్టారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్ శుక్రవారం పార్లమెంట్ నుంచి బయటకు వస్తున్న క్రమంలో అక్కడ ఉన్న జాతీయ మీడియా ప్రతినిధులు.. భారత రాజకీయాల్లో శిఖర సమానులు, తెలుగు వ్యక్తికి అత్యున్నత పురస్కారం రావడంపై స్పందించాలని పదేపదే అడిగినా జగన్ పట్టించుకోలేదు. దీనిపై వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి స్పందిస్తారని చెబుతూ వాహనం ఎక్కి వెళ్లిపోయారు.
జగన్ వైఖరిని టీడీపీ యువనేత లోకేష్ విమర్శించారు. ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు, రాజనీతిజ్ఞుడు, మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావుకి భారతరత్న వంటి అత్యున్నత పురస్కారం దక్కడం తెలుగువారిగా మనమంతా గర్వపడాల్సిన సందర్భం.. అయితే దీనిపై స్పందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని నేషనల్ మీడియా కోరితే.. ఆయన తప్పించుకున్న ధోరణి చాలా చాలా అవమానకరం. ఇదేమి కుసంస్కారం జగన్ అని లోకేష్ వ్యాఖ్యానించారు.