అమరావతి(చైతన్యరథం): ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేసే బిల్లును మంత్రి అనగాని సత్యప్రసాద్ బుధవారం శాసనసభలో ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భూమి అనేది రైతులకు తల్లిలాంటిదాన్నరు. తల్లికి బిడ్డకు ఉన్న అనుబంధం ఎంతో గొప్పదని పేర్కొన్నారు. అది ఆస్తి కాదని అనుబంధమని అన్నారు. ఇలాంటి భూమిని చెరపట్టేందుకు ఓ నియంత తెచ్చిన చట్టమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పేర్కొన్నారు. ప్రజల భూములను దోపిడీ చేసేందుకు తెచ్చిన ఈ చట్టాన్ని రద్దు చేస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్ కల్యాణ్ చెప్పారన్నారు. ఆ మేరకు చట్టాన్ని రద్దు చేసే బిల్లు సభలో ప్రవేశపెడుతున్నామన్నారు. జగన్ అప్పట్లో రెండు చట్టాలు అప్పట్లో తెచ్చారని.. ఒకటి సమగ్ర భూ సర్వే, రెండోది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని అన్నారు. జగన్ ప్రచార ఆర్బాటం, అధికార మదంతో సమగ్ర భూ సర్వేని ఇష్టానుసారం చేశారన్నారు. పాస్ పుస్తకాలు, హద్దురాళ్లపై గత సీఎం ఫోటోలు వేయించుకోవడం.. భూములను జగన్ దానం ఇచ్చినట్టుగా వ్యవహరించడం దారుణమన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం భూముల రిజిష్ట్రేషన్ తరువాత యజమానులకు జిరాక్స్ పత్రాలు ఇస్తారని, ఆన్‌లైన్‌లో చూసుకోవాలంటున్నారని పేర్కొన్నారు.
టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారిగా ప్రభుత్వ అధికారిని కాకుండా ప్రైవేటు వ్యక్తుల ఎవ్వరినైనా పెట్టుకునేట్టు చట్టంలో సెక్షన్‌ను రూపకల్పన చేశారని అనగాని తెలిపారు. అవసరమైతే చంచల్ గూడ జైలులో జగన్ రూమ్యేట్‌ను కూడా టైటిలింగ్ అధికారి స్థానంలో కుర్చోబెట్టొచ్చని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏదైనా వివాదం వస్తే టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి వద్దకు వెళ్లి సమస్యను పరిష్కారించుకోవాల్సి ఉంటుందన్నారు. వారసత్వ హక్కులను ఆయనే నిర్ణయిస్తారన్నారు. అక్కడా పరిష్కారం కాకుంటే నేరుగా హైకోర్టుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. సివిల్ కోర్టుల జోక్యానికి వీలు లేకుండా చట్టంలో సెక్షన్లు పొందుపరిచారన్నారు. హై కోర్టులకు వెళ్లటం చిన్న, సన్నకారు రైతులకు అసలు సాధ్యం కాదన్నారు. కింది స్థాయిలో న్యాయస్థానాల జోక్యానికి అవకాశం లేకుండా చేసి పేద రైతులకు అన్యాయం చేయాలని చూశారన్నారు. ఈ చట్టాన్ని అమలులోకి తెస్తూ 512 జీవోను రహస్యంగా తెచ్చారన్నారు. 2023, అక్టోబర్ 20న ఈ చట్టం అమలులోకి వచ్చిందన్నారు. పేదవాడి భూమిని భక్షించేలా ఏపీ టైటలింగ్ యాక్ట్ ను రూపొందించారని అనగాని పేర్కొన్నారు. అందుకే ఈ చట్టాన్ని రద్దు చేయడానికి సభ ఆమోదం కోసం బిల్లు ప్రవేశపెడుతున్నామన్నారు.