అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు వ్యంగ్యపూరితంగా శుభాకాంక్షలు తెలిపారు. మీకు ఆయురారోగ్యాలు కలగాలి.. అయితే సీఎం హోదాలో మీకు ఇదే చివరి బర్త్ డే అవుతుంది.. ఎందుకంటే మీరు మూడు నాలుగు నెలల్లో మాజీ సీఎం అవ్వబోతున్నారని ఎక్స్ లో అయ్యన్న పేర్కొన్నారు. ఈ విషయం మీకూ పూర్తిగా అర్థం అయినట్లు ఉంది. అందుకే ఒక్కరోజులో మీ పుట్టినరోజు ప్రకటనల పేరుతో సొంత పత్రిక కోసం రూ.100 కోట్లు కొల్లగొట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ శాఖల నుంచి కోట్లు కుమ్మరించి శుభాకాంక్షలకు ప్రకటనలా? ప్రైవేటు సంస్థలను బెదిరించి మరీ యాడ్స్ పేరుతో వసూలు చేస్తారా? పుట్టిన రోజు నాడూ అబద్ధాలు చెప్పడమే మీ నైజమా అని అయ్యన్న విమర్శలు గుప్పించారు.
అందుకే నువ్వు 420 సీఎం
అందుకే నిన్ను 420 సీఎం అంటాను. గూగుల్‌ని అడిగినా నువ్వు 420 సీఎం అని చెబుతుంది. నేను వాస్తవమే చెపుతున్నా, కావాలంటే చెక్ చేసుకోండి. తుఫాన్‌తో నష్టపోయిన బాధితులను ఆదుకోవడం కూడా రాదు. అప్పుచేసి ఆదుకుంటానని ఎవరైనా చెపుతారా? గిరిజనులకు ఏం పొడిచావని చింతపల్లికి వెళ్ళావ్? ఏజెన్సీ లో మంజూరు చేసిన హైడ్రో ప్రాజెక్టుని గిరిజనులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నీ సొంత మనిషికి ఈ ప్రాజెక్టు ఇచ్చావ్. దీనివల్ల 40 గిరిజన గ్రామాలు మునిగిపోతాయ్. 53 వేల ఎకరాలకు సాగు నీరు అందదు. నిన్ను గెలిపించిన గిరిజనులకు నువ్వు ఇచ్చే గిఫ్ట్ ఇదా? నువ్వు చింతపల్లిలో కేక్ కట్ చేసే ముందు సమాధానం చెప్పాలి. పర్యాటక శాఖా మంత్రి హోదాలో గిరిజనులతో డాన్స్ చేసిన రోజా కూడా దీని కోసం నోరు విప్పలేదే? పుట్టినరోజు సందర్భంగా జగన్ కు బుద్ధి ఇవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానని అయ్యన్న అన్నారు.