పాలకొల్లు (చైతన్యరథం): జగన్ హయాంలో తొమ్మిది సార్లు విద్యుత్ చార్జీలు పెంచారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. తాను పెంచిన విద్యుత్ చార్జీలపై తానే ధర్నాలకు పిలుపు ఇచ్చిన ఘనుడు జగన్ అని ఎద్దేవా చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలోని మూడు గ్రామాల్లో రూ .3 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శుక్రవారం నాడు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిమ్మల మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ ఐదేళ్ల అరాచక పాలనతో విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేసి ప్రజలపై మోయలేని భారం మోపారని మండిపడ్డారు. తొమ్మిది సార్లు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై రూ.16 వేల కోట్ల భారం మోపారని విమర్శించారు. మరోవైపు డిస్కంలపై రూ.18 వేల కోట్ల బకాయిల భారం పడిరదని, అది ఇప్పుడు ప్రజలపై ప్రభావం చూపుతోందని అన్నారు. జెన్ కో నుంచి ఐదు రూపాయలకే యూనిట్ కరెంటు లభించే అవకాశం ఉండగా కమీషన్ల కోసం రూ. ఎనిమిది నుంచి 14 రూపాయల వరకు జగన్ కొనుగోలు చేశారని విమర్శించారు. ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపిన జగన్ ఇంటి ముందే వైసీపీ శ్రేణులు ధర్నాలు చేయాలన్నారు. విద్యుత్ లోటు రాష్ట్రాన్ని 2014- 19 ఐదేళ్లలో మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చిన ఘనత చంద్రబాబుది అని అన్నారు. గత చంద్రబాబు పాలనలో విద్యుత్ చార్జీలను పెంచకపోవడమే కాకుండా నాణ్యమైన విద్యుత్‌ను అందించామని మంత్రి నిమ్మల రామానాయుడు గుర్తుచేశారు.