- నాలెడ్జ్ హబ్, సైన్స్ సిటీ పేరిట 17వేల ఎకరాల సేకరణ
- పరిశ్రమలూ రాలేదు.. ఉద్యోగాలూ కల్పించలేదు
- వేలకోట్ల భూదందాకు వైసీపీ సర్కారు విశ్వప్రయత్నం
- అధికారంలోకి వచ్చాక భూములు వెనక్కి తీసుకుంటాం
- ఉరవకొండ సభలో యువనేత లోకేష్ హెచ్చరిక
ఉరవకొండ (చైతన్యరథం): వైఎస్ హయాలో లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరుతో 8844 ఎకరాలు భూసేకరణ చేపట్టారు. సైన్స్ సిటీ పేరుతో 8వేల ఎకరాలు భూసేకరించారు. దాదాపు 17వేల ఎకరాలు భూసేకరణ చేపట్టినా ఒక్క పరిశ్రమ రాలేదు. కంపెనీ రాలేదు. ఒక్కరికీ ఉద్యోగం దక్కలేదు. ఇదీ వైసీపీ ప్రభుత్వ నిర్వాకం. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఆ భూములను వెనక్కి తీసుకుంటాం. పరిశ్రమల ద్వారా ఉద్యోగాలు, ఉపాధి కల్పించే బాధ్యత తీసుకుంటామని యవనేత నారా లోకేష్ ప్రజలకు హామీ ఇచ్చారు. వైసీపీ హయాంలో ఎక్కడ చూసినా భూదందా, ఇసుక దందా తప్ప పాలన ఎక్కడుందని లోకేష్ ప్రశ్నించారు.
లేపాక్షి నాలెడ్జ్ హబ్ కోసం సేకరించిన భూముల విలువ పదివేల కోట్లు ఉంటుందని, ఆ భూమిని సీఎం మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి 500 కోట్లకు కొట్టేయాలని ఎత్తుగడ వేశారన్నారు. ఎవరైతే భూములు తీసుకుని జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారో ఆ కంపెనీ దివాలా తీసిందని యువనేత వ్యాఖ్యానించారు. ఆదివారం ఉదయం ఉరవకొండలో నిర్వహించిన శంఖారావం సభలో లోకేష్ మాట్లాడుతూ `నేడు దేశంలో ఎక్కడ చూసినా అనంత కియా కార్లే కనిపిస్తున్నాయన్నారు. చెన్నకేశవస్వామి దేవాలయమున్న పుణ్యభూమి ఉమ్మడి అనంత అంటూ.. రాళ్లిస్తే రత్నాలు చేయగల గొప్ప వ్యక్తులు పుట్టిన నేలగా అభివర్ణించారు. కష్టాన్ని నమ్ముకున్న అనంత వాసుల తెగువను ప్రశంసిస్తూ.. ఎత్తిన పసుపు జెండా దించకుండా తెలుగుదేశానికి కావలి కాస్తున్న పసుపు సైన్యానికి పేరుపేరునా నమస్కారాలు ప్రకటించారు. భారీగా హాజరైన పార్టీ శ్రేణులు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ `పంట పొలాల్లో వాడే పురుగు మందులకంటే ప్రమాదకరమైన నాసిరకం మద్యాన్ని అమ్ముతూ రాష్ట్ర ప్రజల ఆరోగ్యంతో జగన్ చెలగాటమాడుతున్నారని లోకేష్ దుయ్యబట్టారు.
జగన్‌కు సవాల్..
ఈ సందర్భంగా జగన్‌కు ఛాలెంజ్ విసుర్తూ.. ‘డేట్, టైం నువ్వు ఫిక్స్ చెయ్. నీ బూమ్ బూమ్ షాపు వద్దకు వెళ్దాం. ప్రజలు ఏం అనుకుంటున్నారో విందాం. నువ్వు సిద్ధమా?’ అని జగన్‌ను నిలదీశారు. నాసిరకం మద్యం తాగి ముగ్గురు చనిపోయారని అనకాపల్లిలో ఓ మహిళ ఆవేదనను గుర్తు చేస్తూ, జే-బ్రాండ్ మద్యం విషంకంటే దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్‌ను కటింగ్, ఫిట్టింగ్ మాస్టర్‌గా అభివర్ణిస్తూ.. కరెంట్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, ఇంటిపన్ను, చెత్తపన్ను, నిత్యావసర ధరలు పెంచి జనాన్ని జగన్ బాదడే బాదుడని దుయ్యబట్టారు. అన్న క్యాంటీన్, పెళ్లికానుకలు, పండుగ కానుకలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, డ్రిప్ ఇరిగేషన్, 6 లక్షల మంది వృద్ధులకు పెన్షన్‌ను కట్ చేసి.. జగన్ కటింగ్ బాబాయ్ అవతారమెత్తాడన్నారు.
మీకోసం సూపర్ `6
ప్రజల కష్టాలు చూసి చంద్రబాబు, పవన్ సూపర్ 6 హామీలు ప్రకటించారన్నారు. టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పడిన ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలిస్తామని, అప్పటివరకూ ప్రతి నెలా రూ.3వేలు నిరుద్యోగ భృతి కల్పిస్తామన్నారు. స్కూల్‌కు వెళ్లే ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకు ఏడాదికి రూ.15వేలు ఇస్తాం. ఇద్దరుంటే 30వేలు, ముగ్గురుంటే రూ.45 వేలు ఇస్తామన్నారు. రైతు ఆత్మహత్యలు నివారణకు ప్రతి ఏటా రూ.20వేలు ఆర్థిక సాయం చేసి ఆదుకుంటామన్నారు. ప్రతి ఇంటింకి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని, 18 నుంచి 59 ఏళ్ల మహిళలకు ప్రతి నెల రూ.15 వందల చొప్పున, ఏడాదికి రూ.18వేలు, ఐదేళ్లలో రూ.90 వేలు మీకు అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ హక్కు కల్పిస్తామన్నారు.
డిక్లరేషన్‌తో బీసీల ప్రాభవం
26వేల మంది బీసీలపై అక్రమ కేసులు, 300మంది బీసీలను పొట్టనబెట్టుకోవడం తప్ప.. ఐదేళ్లలో బీసీలకు వైసీపీ చేసిందేమిటని ప్రశ్నించారు? చంద్రయ్య, జాలయ్య, అమర్‌నాథ్‌గౌడ్‌లాంటి వారిని చంపేశారు. బీసీ సబ్‌ప్లాన్ నిధులు రూ.75వేల కోట్లను దారిమళ్లించారన్నారు. వెనుకబడిన వర్గాల సముద్ధరణకు టీడీపీ-జనసేన బీసీ డిక్లరేషన్ ప్రకటించిందన్నారు. 50 ఏళ్లు నిండిన బీసీలకు నెలకు 4వేల పెన్షన్ ఇస్తామని, బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తామని, బీసీలకు ఐదేళ్లలో లక్షా 50వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. స్థానిక సంస్థల్లో వైసీపీ సర్కారు కోతపెట్టిన పదిశాతం రిజర్వేషన్లు పునరుద్ధరిస్తామన్నారు. బీసీ సాధికారత కోసం రూ.పదివేల కోట్లు ఖర్చుచేస్తామని, ఆదరణ కింద రూ.5వేల కోట్లు పనిముట్ల కోసం ఖర్చుపెడతామన్నారు.
చంద్రన్న బీమా కింద రూ.10 లక్షలు, పెళ్లి కానుక కింద బీసీలకు రూ.లక్ష అందిస్తామని, బీసీలకు పర్మినెంట్ క్యాస్ట్ సర్టిఫికెట్లు, పెండిరగ్‌లో ఉన్న బీసీ భవనాల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. అన్న ఎన్టీఆర్‌ను ఎమ్మెల్యేగా చేసి, ముఖ్యమంత్రిని చేసిన జిల్లా అనంతపురం. మామయ్య హరికృష్ణను, మీ అందరి బాలయ్య, నాకు ముద్దుల మామయ్య బాలకృష్ణను రెండుసార్లు గెలిపించారని గుర్తు చేశారు. అందుకే డబుల్ ప్రేమతో ఐదేళ్లలో అనంతను టీడీపీ ఎంతో అభివృద్ధి చేసిందన్నారు.
అక్కడ కిమ్! ఇక్కడ జిమ్!!
ఉరవకొండ (చైతన్యరథం): వైసీపీ నేత జగన్‌ను ఉత్తర కొరియా నియంత కిమ్‌తో పోలుస్తూ.. యువనేత నారా లోకేష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఉత్తర కొరియాకు ఓ నియంతున్నాడు. పేరు కిమ్. ఆంధ్రలోనూ ఓ నియంతున్నాడు. పేరు జిమ్. ఆకారాలు వేరేమోగానీ, ఆలోచనలు, దుర్మార్గాలూ సేమ్ టు సేమ్ `అని యువనేత లోకేష్ చమత్కరించారు. ఉత్తరకొరియాలో కిమ్‌కు 17 ప్యాలెస్‌లుంటే, ఇక్కడ జగన్‌కు 6 ప్యాలెస్‌లున్నాయన్నారు. కిమ్.. తన సొంత బాబాయిని లేపేశాడు. సొంత అన్ననీ లేపేశాడు. ఆంధ్రా జిమ్ జగన్ కూడా అంతే. సొంత బాబాయిని లేపేశాడు. సొంత తల్లి, చెల్లినీ మెడపట్టుకుని బయటకు గెంటేశాడు. కిమ్ వీడియో గేమ్‌లు ఆడతాడు. జగన్ పబ్‌జీ ఆడతాడు. కిమ్ దొంగ నోట్లు, మాదకద్రవ్యాలతో దోచుకుంటాడు. జగన్ దొంగనోట్లు, డ్రగ్స్, నాసిరకం మందు విక్రయాలతో దోచుకుంటాడు. నార్త్ కొరియాలో కిమ్ 340మందిని చంపేశాడు.
ఆంధ్రా జిమ్ వేలాదిమందిని జైళ్లలో కుక్కాడు. ఆంధ్రా కిమ్ ఎస్సీ, ఎస్టీలను ఊచకోత కోశాడు. అనేకమందిని పొట్టనబెట్టుకున్నాడు. దళిత డాక్టర్ సుధాకర్‌ను హింసించి ఎలా చనిపోయేలా చేశాడో చూశాం. హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేసిన అంగన్‌వాడీలను కొట్టి జైలుకు పంపడం జగన్‌కే చెల్లిందని దుయ్యబట్టారు. నార్త్ కొరియాలో కిమ్ తనను ప్రశ్నిస్తే సంక్షేమ పథకాలు కోసేస్తాడు. ఏపీ జిమ్ కూడా అంతే. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా జైలుకు పంపిస్తాడు ఆంధ్రా జిమ్ అన్నారు. నాపై 22 కేసులు పెట్టారు. ఈ జిమ్ ఎవరో అర్థమైందా రాజా.. జగన్! అని లోకేష్ ఎద్దేవా చేశారు.