- కొత్త అంచనాలు సిద్ధం చేస్తాం
- అసెంబ్లీలో మంత్రి రామానాయుడు
అమరావతి (చైతన్యరథం): ఉత్తరాంధ్రలోని తోటపల్లి ప్రాజెక్టు ఆధునికీకరణ పనులకు సంబంధించి పునః పరిశీలన చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గురువారం అసెంబ్లీలో ఆ ప్రాంత ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు. పాలకొండ, రాజాం, కురుపాం నియోజకవర్గాలకు నీరందించే ఆశయంతో నాగావళి నదిపై తోటపల్లి వద్ద ఈ ప్రాజెక్టు నిర్మించి శతాబ్ద కాలం గడిచిపోయినందున ముఖ్య నిర్మాణాలు, అనుబంధ కాలువలు శిథిóలావస్థకు చేరిపోయాయి. తోటపల్లి ఆయకట్టు రైతుల అగచాట్లను దృష్టిలో పెట్టుకుని 2018లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం తోటపల్లి కుడి, ఎడమ కాలువల ఆధునీకరణ పనుల కు రూ.195 కోట్లు కేటాయించి పనులను కాంట్రాక్టర్‌కు అప్పగించింది. రూ 41.66 కోట్ల విలువైన 22 శాతం పనులు పూర్తి చేసినట్లు నిమ్మల స్పష్టం చేశారు. దురదృష్టవశాత్తు 2019లో వచ్చిన దుర్మార్గ వైసీపీ ప్రభుత్వం 25 శాతం లోపు జరిగిన పనులను ఎక్కడివి అక్కడే ఆపేయడం, రద్దు చేయడం వంటి దుశ్చర్యల్లో భాగంగా తోటపల్లి ఆధునీకరణ పనులు కూడా ఆగిపోయాయన్నారు. గతంలో ఈ పనులు చేసిన కాంట్రాక్టర్ కూడా తిరిగి చేపట్టేందుకు సిద్ధంగా లేరన్నారు. సభ్యుల కోరిక మేరకు తోటపల్లి కుడి, ఎడమ కాలువల ఆవశ్యకతను, ప్రాధాన్యతను పరిగణలోకి తీసుకుని కొత్త రేట్లు ప్రకారం అంచనాలు వేయించి పునః పరిశీలన చేస్తామని మంత్రి నిమ్మల తెలిపారు.
వారు గాలికి వదిలేశారు … మనం గాడిలో పెడదాం
శ్రీకాకుళం జిల్లా హిరమండలం గొట్టా గ్రామం వద్ద వంశధార నదిపై నిర్మించిన గొట్ట బ్యారేజ్ అనుబంధ కాలువల ఆధునికీకరణ పనులను గత వైకాపా ప్రభుత్వం గాలికి వదిలేసిందని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గురువారం నాడు అసెంబ్లీలో ధ్వజమెత్తారు. వంశధార స్టేజ్ 2 కింద ఎడమ కాలువ ఆయకట్టు భూములకు నీరందడం లేదని నరసన్నపేట, టెక్కలి, పలాస ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో మంత్రి వారికి స్పష్టమైన వివరణ ఇచ్చారు. 1,48,235 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఉద్దేశించిన ఈ బృహత్తర ప్రాజెక్టు ప్రాధాన్యత ప్రభుత్వానికి తెలుసునన్నారు. అందువల్లనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2018లో గొట్టా బ్యారేజ్ కాలువల ఆధునీకరణకు 676 కోట్ల రూపాయలతో అంచనాలు తయారు చేయించారని చెప్పారు. ప్రతిపాదన కార్యరూపం దాల్చే స్థాయిలో కొత్తగా వచ్చిన అరాచక వైకాపా ప్రభుత్వం వాటిని గాలికి వదిలేసిందని మంత్రి విమర్శించారు. వంశధార స్టేజ్-2 లో కుడికాలువ కొంతవరకు పర్వాలేదు.
48 ఏళ్ల కిందట నిర్మించిన ఎడమ కాలువ రాతి కట్టడాలు, షట్టర్లు పూర్తిగా దెబ్బ తినడంతో అనుకున్న స్థాయిలో ఆయకట్టు రైతులకు నీరు అందడం లేదు. 2481 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యం ఉన్న ఎడమ కాలువ ద్వారా ప్రస్తుతం 1800-1900 క్యూసెక్కుల మాత్రమే ప్రవహిస్తున్నట్లు మంత్రి రామానాయుడు వివరించారు. దీనికి తోడు ఎడమ కాలువపై 24 లిఫ్టులు ఉండడం వల్ల వాటికి మరో 360 క్యూసెక్కుల నీరు వెళుతోంది. అందువల్లనే ఆయకట్టు భూములకు పూర్తిస్థాయిలో నీరందడం లేదన్నారు. ఆయకట్టు రైతుల అగచాట్లను, సమస్య తీవ్రతను ప్రభుత్వం గుర్తించింది. అందులో భాగంగానే వంశధార స్టేజ్-2 ఎడమ కాలువ పూడిక తీయడం, గట్లు పటిష్ట పరచడం, షట్టర్లు తదితర ఇతర నిర్మాణాలు ఆధునికరించటం వంటి పనులన్నిటికి ప్రతిపాదనలు తయారుచేసి ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. అత్యవసర ప్రాతిపదికన చేపట్టాల్సిందిగా కోరతామన్నారు. అలాగే గొట్టా బ్యారేజ్ ఆధునీకరణకు కూడా రూ.16 కోట్లు వ్యయం కాగల ప్రతిపాదన ఇప్పటికే ప్రభుత్వానికి సమర్పించి పరిపాలనామోదం కోసం చూస్తున్నామని మంత్రి రామానాయుడు వివరించి చెప్పారు.
ల్యాండ్ కన్వర్షన్ వివరాల సేకరణ
మూడు దశాబ్దాలుగా ల్యాండ్ కన్వర్షన్ (భూ మార్పిడి) వివరాల సేకరణ కార్యక్రమం జరగలేదని గురువారం అసెంబ్లీలో కావలి ఎమ్మెల్యే దాగుమాటి వెంకట కృష్ణారెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానంగా జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈనెల 25న జరిగే కలెక్టర్ల సమావేశంలో ల్యాండ్ కన్వర్షన్ వివరాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి రెండు నెలల్లో పూర్తిచేస్తామని వివరించారు. పట్టణీకరణ, సెజ్‌లు, పారిశ్రామికీకరణ నేపథ్యంలో పెద్ద మొత్తంలో వ్యవసాయ భూములు ఇతర అవసరాలకు మారిపోయాయన్నారు. రెవెన్యూ, వ్యవసాయం, ఇరిగేషన్ శాఖల సమన్వయంతో ల్యాండ్ కన్వర్షన్ వివరాలు సేకరించాల్సి ఉంది. ఈ లెక్కలు తేలిన తర్వాత కన్వర్షన్ అయిన భూములను ఆయకట్టు పరిధి భూముల నుంచి తొలగిస్తామని మంత్రి రామానాయుడు స్పష్టమైన సమాధానం ఇచ్చారు.
రాష్ట్రంలో మొత్తం నాలుగు కోట్ల ఎకరాల భూ విస్తీర్ణంలో రెండు కోట్ల ఎకరాల విస్తీర్ణం మాత్రమే సాగుకు అనువైనదిగా ఆయన పేర్కొన్నారు. ఈ రెండు కోట్ల ఎకరాల్లో ప్రస్తుతం కోటి ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు అనుబంధ ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వివిధ దశల్లో ఉన్న అన్ని నీటి వనరులను సమీకరించుకుని కొత్తగా 43.598 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వబోతున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో మరో 48.612 లక్షల ఎకరాలకు నీరు అందించేందుకు ప్రతిపాదనలు, ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకెళుతున్నట్లు
మంత్రి రామానాయుడు వివరించారు.
పోలవరం` బనకచర్ల డీపీఆర్ తయారీ సందర్భంలో సభ్యుడు ప్రతిపాటి పుల్లారావు సూచనలు పరిగణలో తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. సాగర్ ఆయకట్టు కాలువల పూడిక తీత, కలుపు తొలగింపు తదితర పనులు కూడా ఓ అండ్ ఎం పనుల్లో భాగంగా చేస్తామన్నారు. గత ఐదేళ్ల పాలనలో ఓ అండ్ ఎం పద్దు కింద నిధులు కేటాయించకపోవడం వలనే ఈ దుస్థితి దాపురించిందని, వచ్చే వేసవి నుంచి ఈ పరిస్థితిని చక్క దిద్దుతామని మంత్రి రామానాయుడు తెలిపారు.