అమరావతి (చైతన్య రథం): ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను చంపేస్తామంటూ ఆగంతకుడు ఆయన పేషీకి ఫోన్ కాల్స్ చేయడంతోపాటు సందేశాలు పంపించడం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. బెదిరింపు కాల్స్, సందేశాల గురించి పేషీలోని సిబ్బంది పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు వివరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు వేగవంతం చేశారు. బెదిరింపు కాల్స్ చేసిన నూక మల్లికార్జునరావును అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. నిందితుడు మద్యం మత్తులో బెదిరింపు కాల్స్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. రహస్యప్రాంతంలో అతన్ని విచారిస్తున్నారు. పవన్ కల్యాణ్ పేషీకి 95055 05556 నంబరు నుంచి కాల్ వచ్చినట్టు గుర్తించారు. ఈ నంబరు ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు చెందిన మల్లికార్జునరావు పేరుతో ఉందని పోలీసులు తేల్చారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద టవర్‌నుంచి కాల్స్ వచ్చినట్లు తేలింది. నగర కమిషనర్ రాజశేఖర బాబు, టాస్క్‌ఫోర్స్, స్పెషల్ బ్రాంచి, లా అండ్ ఆర్డర్ విభాగాలకు చెందిన పోలీసులతో నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. ఆఘమేఘాలపై గాలింపు చేపట్టినా ఫోన్ స్విచాఫ్ చేయడంతో ఎక్కడ ఉన్నదీ గుర్తించడం కష్టంగా మారింది. విజయవాడతో పాటు తిరువూరులోనూ గాలింపు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు నిందితుడు మల్లికార్జునరావును అదుపులోకి తీసుకున్నారు.