- ఐదేళ్లు సచివాలయానికి వెళ్లని సీఎం జగనొక్కడే?
- రాష్ట్రంలో ప్రాజెక్టు కట్టాడా..ఉద్యోగమిచ్చాడా.?
- రంగుల పిచ్చోడికి జనం వెల్ల వేస్తారు..
- ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో భూములు కొట్టేసేయత్నం
- ఆరోగ్య శ్రీకి రూ.1500 కోట్లు బకాయిలు పెట్టాడు
- నేనొస్తే విద్యుత్ ఛార్జీలు పెరగవు.. కోతలుండవ్
- అధికారంలోకి రాగానే ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ
- దగాకు గురైన మైనార్టీలను ముందుండి నడిపిస్తా
- తాగు, సాగునీటికి హంద్రీనీవా జలాలు తీసుకొస్తా
- పిట్ట కథల మంత్రి, కట్టు కథల సీఎంకు రాజకీయ సన్యాసమే
- రాష్ట్ర పునర్నిర్మాణానికి కూటమి కట్టుబడి ఉంది..
- డోన్ ప్రజాగళం సభలో నారా చంద్రబాబు ఉద్ఘాటన
డోన్ (ప్రచార రథం): రాష్ట్రంలో వైసీపీకి కాలం చెల్లిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఐదేళ్లుగా సచివాలయానికి రాని సీఎం దేశంలో ఎక్కడైనా ఉన్నారా? అని ప్రశ్నించారు. నంద్యాల జిల్లా డోన్‌లో సోమవారం నిర్వహించిన ప్రజాగళం సభలో అశేష జనవాహినిని ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. డోన్ సభ అదిరిపోయింది.. జగన్ ముఠా సీన్ మారిపోయిందని చమత్కరిస్తూ.. డోన్ ఎమ్మెల్యేగా సూర్యప్రకాశ్ రెడ్డిని, ఎంపీగా శబరిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇక్కడి పిట్ట కథల మంత్రి, కట్టు కథల నాయకుడికి రాజకీయ సన్యాసం తప్పదని, కథలు చెప్పే మంత్రి వల్ల నియోజకవర్గం ఏమైనా బాగుపడిరదా? అని ప్రజలను ప్రశ్నించారు. ఆర్ధిక మంత్రి బుగ్గన అప్పులు తెస్తే.. ప్రజలు తీర్చాలా? మే 13న సీఎంతో పాటు మంత్రి కూడా మాజీ కాబోతున్నాడు. తర్వాత ఎక్కడికి పారిపోతాడో ఎవరికీ తెలియదు. పిట్టకథల మంత్రి చెప్పే కబుర్లు వినడానికి ప్రజలు సిద్ధంగా లేరని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
విజన్‌కు విధ్వేషానికి మధ్య పోరాటం
ఈ ఎన్నికలు ‘విధ్వంస పాలనకు అభివృద్ధికి సవాల్. నీతికి అవినీతికి మధ్య యుద్ధం. విజన్‌కి విధ్వేషానికి మధ్య పోరాటం. ధర్మానికి అధర్మానికి, రాతియుగం రాక్షసులకు స్వర్ణయుగం సాధకులకు మధ్య పోరాటంగా చంద్రబాబు అభివర్ణించారు. ఇక్కడున్న బుగ్గనకు, అక్కడ సైకో జగన్‌రెడ్డికి ఒళ్లంతా అహకారమేనని విమర్శిస్తూ, తమ అహంకారంతో వ్యవస్థల్ని నాశనం చేశారని, అభివృద్ధిని విచ్ఛిన్నం చేశారన్నారు. ప్రజా జీవితాలను ఛిద్రం చేసిన దొంగల్ని వదిలి పెట్టకూడదన్నారు. జగన్‌రెడ్డి ముఠా దోపిడీ ఏస్థాయికి చేరిందంటే.. చట్టాన్ని వ్యవస్థల్ని చేతుల్లోకి తీసుకుని దోచుకుంటున్నారని, శాస్వతంగా ఉండిపోతామనే భ్రమలో ప్రజల ఆస్తుల కబ్జాకు ప్రయత్నాలు చేశారన్నారు. పరదాలు కట్టుకుని తిరిగే సైకో.. ఇప్పుడు ప్రజల్లోకి వచ్చి మళ్లీ బుగ్గలు నిమురుతున్నాడు. గతంలోనూ ఇలాగే ముద్దులు పెట్టి అధికారంలోకి వచ్చాక పిడిగుద్దులు గుద్దాడు. సచివాలయానికే వెళ్లని ముఖ్యమంత్రికి ఆ పదవిలో ఉండే హక్కుందా? ఐదేళ్లలో ఒక్క రోజూ సచివాలయానిక వెళ్లలేదు. ప్రజలకు చేసిందిదీ అని మీడియాముందు చెప్పలేని సన్నాసి రాష్ట్రానికి అవసరమా? అంటూ తీవ్ర స్వరంతో నిలదీశారు.
సీమలో ఒక్క ప్రాజెక్టైనా కట్టారా?
పరిపాలన అంటే అప్పులు తేవడం, హరికథలు చెప్పడం కాదు. ఆర్ధిక వ్యవస్థను పటిష్టపర్చాల్సింది పోయి సచివాలయాన్నీ తాకట్టు పెట్టారు. ఆస్పత్రులు, రైతుబజార్లు సహా చివరికి మద్యం ఆదాయాన్నీ తాకట్టు పెట్టిన వీరిని ఏమనాలి? అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమకు జగన్‌రెడ్డి ఏమైనా చేశాడా? ఒక్క ప్రాజెక్టు కట్టాడా? ఎక్కడైనా రోడ్డేశాడా. ఒక్క పరిశ్రమ అయినా తెచ్చారా? ఇలాంటి వారికి మరోసారి ఓటు అడిగే హక్కుందా? జగన్‌రెడ్డి రంగుల పిచ్చికి రూ.3500 కోట్ల ప్రజల సొమ్ము వృధా అయ్యింది. ఇప్పుడు ప్రజలంతా ఏకమై రంగుల పిచ్చోడిని శాశ్వతంగా ఇంటికి పంపించాలి. బడికి, గుడికి, చెట్టుకి, పుట్టకు కూడా రంగులేసుకున్నాడు. గతంలో ఎప్పుడైనా ఇలాంటి పిచ్చోడిని చూశామా? అని ఎద్దేవా చేశారు. వందల మంది సలహాదారుల్ని నియమించి రూ.700 కోట్లు దారబోశాడు. సాక్షి పత్రికకు ప్రకటనల పేరుతో రూ.1000 కోట్లు దోచిపెట్టాడు. రాయలసీమ ప్రజలకు తాగునీరివ్వలేదు. సాగునీటి ప్రాజెక్టులపై పైసా ఖర్చు చేయలేదు. కానీ, సొంత పేపర్‌కు ప్రజల సొమ్ము దారబోశాడు. తాజాగా ప్రజల పట్టాదారు పాస్ పుస్తకాలపైనా జగన్ ఫోటో వేసుకున్నాడు. ఇదేమైనా జగన్‌రెడ్డి తాత ఆస్తా? మీ పొలం చుట్టూ ఫోటోలతో సర్వే రాళ వేశాడు. ఇప్పుడు ప్రజల భూములన్నీ జగన్‌రెడ్డి తన పేరుతో రాసుకుంటున్నాడు. బ్రిటీషు కాలం నుండి ప్రతి ఒక్కరికీ భూమి రికార్డులున్నాయి. అడంగల్, పట్టాదారు పాస్ పుస్తకాలన్నీ మన పేరుతో ఉన్నాయి. కానీ, అన్నీ ఆన్ లైన్లో పెట్టేస్తానంటున్నాడు. అక్కడ పేరు మార్చేస్తే మన జీవితాలు బుగ్గైపోతాయి. ఒంటిమిట్టలో ఇలాగే ఒక చేనేత కార్మికుడి భూమిని వైసీపీ నేతలు రాయించుకుంటే ఏమీ చేయలేక కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. మీ భూమి కొట్టేయడానికి వస్తున్న సైకోని తరిమికొట్టాలి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే మనం ఏమీ చేయలేని పరిస్థితి దాపురిస్తుంది. జగన్‌రెడ్డి ఎంత దుర్మార్గుడంటే ఆరోగ్యశ్రీకి రూ.1500 కోట్లు బకాయిలు పెట్టి పేదల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టాడని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏ ఒక్క రైతన్నా సంతోషంగా ఉన్నారా.?
ఐదేళ్ల జగన్‌రెడ్డి పాలనలో ప్రజల జీవితాలు దుర్బరంగా మారిపోయాయి. ఆదాయం పెరగలేదు గానీ ఖర్చులు పెరిగాయి. జీవన ప్రమాణాలు నాశనం చేశాడు. డోన్ సభలో అడుగుతున్నా.. రాష్ట్రంలో ఏ రైతైనా బాగున్నాడా? వ్యవసాయాన్ని చంపేశాడు. రైతు మెడ నొక్కేయడంతో దీనావస్థలో ఉన్నారు. గత ఐదేళ్లలో హార్టీకల్చర్ ఏమైనా బాగుపడిరదా? డ్రిప్ ఇరిగేషన్ గతంలో 90శాతం సబ్సిడీతో అందించాను. ఇప్పుడు ఇస్తున్నారా? వ్యవసాయం ఎండిపోతోంది. హార్టీకల్చర్ హబ్‌గా ఉండాల్సిన రాయలసీమను నాశనం చేస్తున్నాడు. పండ్లు, కూరగాయలతో కళకళలాడాల్సిన సీమ రైతు ఆందోళనతో ప్రాణాలొదులుతున్నాడు. అందుకే అన్నదాత పథకంతో ప్రతి రైతుకు ఏటా రూ.20 వేలు ఇచ్చి అండగా నిలుస్తాను. మన హామీలన్నీ ప్రజల్లోకి వెళ్లేలా కార్యకర్తలు పని చేయాలి. గడపగడపనా మన హామీలు వివరించాలని బాబు పిలుపునిచ్చారు.
పెరిగిన ధరలతో ప్రజలు భయపడుతున్నారు
నిత్యావసర వస్తువుల ధరలు మండుతున్నాయని, నియంత్రించాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని బాబు వ్యాఖ్యానించారు. నాసిరకం మద్యానికి అధిక ధరలు వసూలు చేసి జేబులు నింపుకుంటున్నారని ఆగ్రహించారు. కల్తీ మద్యం కారణంగా 30 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్మార్గుడు తన ధనదాహం కోసం వేలాది మంది మహిళల మాంగళ్యాలు తెంచాడు. ఈ నాసిరకమైన మద్యాన్ని అరికడతానని బాబు హామీ ఇచ్చారు. అలాగే, పిల్లల్ని గంజాయికి అలవాటు చేసి వారి జీవితాలు నాశనం చేస్తున్నాడు. ఇలాంటి పార్టీ మనకు అవసరమా? అని ప్రశ్నించారు. బిడ్డల భవిష్యత్తే తల్లిదండ్రులకు ముఖ్యం. కానీ, జగన్‌రెడ్డి చేస్తున్న ఈ అరాచకం నుండి మీ బిడ్డల్ని కాపాడే బాధ్యత నేను తీసుకుంటానని ప్రమాణం చేస్తున్నానన్నారు.
నేనొస్తే కరెంట్ ఛార్జీల పెంపు ఉండదు
జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాడు. నేనొస్తే కరెంటు ఛార్జీలు పెరగవు. ఎవరికివాళ్లు విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకుని, మిగులు విద్యుత్‌ను సొమ్ము చేసుకునే ప్రణాళికలు తెస్తున్నట్టు చంద్రబాబు వెల్లడిరచారు. అధికారంలోకి రాగానే చెత్త పన్ను రద్దు చేస్తానని, తాను లక్షల రూపాయల ఐటీ ఉద్యోగాలు కల్పిస్తే.. జలగ వచ్చి రూ.5వేల వాలంటీర్ ఉద్యోగాలు అంటున్నాడన్నారు. జాబు కావాలంటే బాబు కావాలి. మన ప్రభుత్వం వస్తేనే యువతకు ఉద్యోగాలొస్తాయని చంద్రబాబు స్పష్టం చేశారు. ఉద్యోగులకు సంబంధించి సీపీఎస్ విషయంలో ప్రత్యేక విధానం రూపొందించి ఉద్యోగులకు న్యాయం చేస్తానని బాబు హామీ ఇచ్చారు. ఉద్యోగులంతా సమైక్యంగా ఉండాలని, పీఆర్సీ ఇచ్చి ఉద్యోగులకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటానని, ప్రతి ఒక్కరూ గౌరవ ప్రదంగా పని చేయడానికి అనువైన వాతావరణం కల్పిస్తానన్నారు. ఉద్యోగులందరికీ న్యాయం చేసే బాధ్యత తనదంటూనే, పెన్షన్ సకాలంలో ఇచ్చి అండగా నిలుస్తానని ప్రామిస్ చేశారు. రాష్ట్రంలోని ఐదు కోట్లమందికి అండగా నిలిచి, న్యాయం చేసే బాధ్యత తీసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. బీసీలందరికీ న్యాయం చేసే బాధ్యత తనదని, బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ప్రకటించానన్నారు. ఐదేళ్లలో రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేసి బీసీలకు స్వయం ఉపాధి కల్పిస్తానని, స్వయం ఉపాధి రుణాలు, ఆదరణ పథకంతో ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తానన్నారు. చేతి వృత్తుల్లో ఆధునిక పద్ధతులు తీసుకొచ్చి ఆర్ధికంగా సస్థిరపడేలా ప్రోత్సహిస్తానన్నారు.
నన్ను నమ్మినవాళ్లను వదులుకోను
మొన్నటి వరకు పని చేసిన ధర్మవరం సుబ్బారెడ్డికి అనివార్య కారణాలతో సీటు ఇవ్వలేకపోయాను. కానీ, సుబ్బారెడ్డికి అండగా నిలిచి న్యాయం చేసే బాధ్యత నాది. సూర్యప్రకాశ్ గెలుపు కోసం సుబ్బారెడ్డి వర్గం పని చేయాలి. నాతో కలిసి పని చేసిన వ్యక్తిని ఎప్పుడూ వదులుకోను. ఎంఆర్‌పిఎస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరినీ కలవండి. దళితులకు జగన్‌రెడ్డి చేసిన అన్యాయాన్ని వివరించండి. ఏ, బీ, సీ, డీ వర్గీకరణతో మాదిగలకు న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటాను అని చంద్రబాబు హామీ ఇచ్చారు.
సూపర్-6 పథకాలతో మారనున్న జీవితాలు
ఆస్తిలో సమాన హక్కు కల్పించిన పార్టీ తెలుగుదేశం. చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వకుండా మెడపట్టి గెంటేసిన నాయకుడు జగన్ రెడ్డి. తల్లికి అన్నం పెట్టకుండా తరిమేసినోడు మహిళలకు ఏమిస్తాడని నిలదీశారు. మహాశక్తి పథకంలో భాగంగా మహిళలకు 4 కార్యక్రమాలు రూపొందించాను. ఆడబిడ్డ నిధితో ప్రతి ఆడబిడ్డకూ నెలకు రూ.1500 చొప్పున ఏటా రూ.18 వేలు ఎంత మంది ఉంటే అందరికీ ఆర్ధిక సాయం అందిస్తాను. తల్లికి వందనం కింద ప్రతి బిడ్డకూ రూ.15 వేలు చొప్పున అందిస్తాను. ఎంతమంది పిల్లలున్నా అందరినీ చదివించే బాధ్యత తీసుకుంటాను. దీపంతో ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాను. అధికారంలోకి రాగానే ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తాను. ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తాను. మా ఆడబిడ్డల్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లే వాహనానికి నేడే డ్రైవర్. ప్రతి మహిళ తాను ఆర్ధికంగా స్థిరపడేలా చేసే బాధ్యత నాది. డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తాను. ప్రతి ఆడబిడ్డ ఇంటికి ఆర్ధిక మంత్రిగా ఉండాలని చంద్రబాబు కాంక్షించారు.
ముస్లింలకు అండగా ఉంటా
డోన్‌లో ముస్లిం మైనార్టీ సోదరులు ఎక్కువగా ఉన్నారు. బీజేపీతో కలిసి మసీదులు కూల్చేస్తానని బుగ్గన కథలు చెబుతున్నాడు. మైనార్టీలకు న్యాయం చేసింది నేనే. ఉర్ధూ యూనివర్శిటీ ఏర్పాటు చేసింది, ఉర్దూను రెండో భాషగా గుర్తించింది తెలుగుదేశం పార్టీ. దుకాన్ మకాన్, దుల్హన్ లాంటి పథకాలు తెచ్చింది తెలుగుదేశం పార్టీ. రంజాన్ తోఫా ఇచ్చి అండగా నిలిచాను. ఈ పథకాలన్నీ జగన్ రెడ్డి రద్దు చేసి మైనార్టీలను ఉద్దరించానంటున్నాడు. పార్లమెంటులో సీఏఏ, ఎన్‌ఆర్సీ బిల్లులకు మద్దతిచ్చి ఇక్కడ డ్రామాలాడుతున్నాడు.
ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు
ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందిస్తాం. తాగు, సాగునీటి సమస్యల్ని పరిష్కరించి చూపిస్తాను. పెన్షన్ ప్రారంభించింది తెలుగుదేశమే. రూ.200 ఉన్న పెన్షన్ రూ.2000 చేసింది నేనే. కానీ, జగన్ రెడ్డి ఐదేళ్ల పాటు ముక్కుతూ మూలుగుతూ రూ.1000 పెంచాడు. ఏప్రిల్ నుండే పెన్షన్ పెంచి రూ.4000 ఇస్తాను. మొత్తం కలిపి అందిస్తాను. కానీ, ఈ జగన్ రెడ్డి ఏమన్నాడో తెలుసా.. ఎప్పుడో ఐదేళ్ల తర్వాత రూ.500 పెంచుతాడంట. ప్రతి అవ్వ తాతకు అండగా నిలుస్తాను. పెద్ద కొడుకుగా నేనుంటాను. ప్రతి పెన్షన్ దారుడికి ఏటా రూ.48 వేలు పెన్షన్ రూపంలో అందిస్తాను. దివ్యాంగులకు నెలకు రూ.6000 చొప్పున సంవత్సరానికి రూ.72 వేలు అందిస్తాను. సంపద సృష్టించి ఆ సంపదను ప్రజలకు పంచుతా. అంతేగానీ, ఈ జగన్ రెడ్డిలా అప్పులు చేయబోను. ప్రతి ఒక్కరిలో మనో ధైర్యం ఉన్నపుడు ఎంతటి వైకల్యమైనా మన ముందు దిగదుడుపే. దివ్యాంగులకు అవసరం మేరకు ఎలకట్రికల్ మోటార్ వాహనాలు అందిస్తాను. ప్రతి ఒక్కరికీ రెండు సెంట్ల ఇళ్ల స్థలం ఇచ్చి ఇళ్లు కట్టిస్తాను. పిచ్చుక గూళ్లు కట్టించి ఊళ్లు కట్టానంటూ కథలు చెబుతున్నాడు. టిడ్కో ఇళ్లకు రంగులేసుకోవడం తప్ప పేదలకు పంచకుండా పాడుబెడుతున్నాడు. అధికారంలోకి రాగానే వాటిని పంచిపెడతాను. రోడ్లకు మహర్దశ కల్పిస్తాను. ఇసుక అందుబాటులో ఉంచి నిర్మాణ రంగాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తాను. బుగ్గన ఆర్ధిక మంత్రో అప్పుల మంత్రో అర్ధం కావడం లేదు. ఎప్పుడూ నియోజకవర్గంలో ఉండడూ.. సచివాలయంలోనూ ఉండడు. అప్పుల కోసం చిప్ప పట్టుకుని ఢల్లీిలో తిరుగుతుంటాడు. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి.. తాను మాత్రం మైనింగ్ లో వేల కోట్లు వెనకేసుకున్నాడు. గజేంధ్ర రెడ్డి అనే బంధువు ఏనుగులా కనిపించిన ప్రజల ఆస్తులన్నీ మింగేస్తున్నాడు. మైనింగ్, క్రషింగ్ యూనిట్లను కబ్జా చేశాడు. కర్ణాటక మద్యం తీసుకొచ్చి అమ్ముకుంటున్నాడు. డోన్ లో దోచుకున్న డబ్బుతో దేశంలో ఎక్కడెక్కడో ఆస్తులు కూడబెట్టుకుంటున్నాడు. సూర్యప్రకాశ్ రెడ్డి కోసం ఒక బటన్, బైరెడ్డి శబరి కోసం మరో బటన్ నొక్కాలి. వీరి గెలుపు చూసి జగన్ రెడ్డికి వెన్నులో వణుకు పుట్టాలి.’’ అని చంద్రబాబు నాయుడు అన్నారు.