- ఉన్నతస్థాయి విచారణకు ఆదేశం
- బాధ్యులపై కఠినచర్యలు
- బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం
- మంత్రి లోకేష్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి
- విద్యార్థుల కుటుంబాలకు అండగా ఉంటామన్న మంత్రి లోకేష్
అనకాపల్లి (చైతన్యరథం): అనాథాశ్రమంలో కలుషితాహారం తిని అస్వస్థతకు గురైన ముగ్గురు విద్యార్థులు మృతిచెందారు. మరో 24 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. రెండు రోజుల క్రితం అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాస పట్టణంలోని అనాధాశ్రమంలో కలుషితాహారం తిని 27 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరికి చికిత్స అందిస్తుండగా సోమవారం ముగ్గురు మృతి చెందారు. మృతి చెందిన విద్యార్థులను జాషువా, భవాని, శ్రద్ధగా గుర్తించారు. మిగతా 24 మందికి నర్సీపట్నం, అనకాపల్లి ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో ఏడుగురు, అనకాపల్లి ఏరియా ఆసుపత్రిలో 17 మంది విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. ఘటనపై డీఈవో అప్పారావు విచారణ చేపట్టారు.
ఉన్నతస్థాయి విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశం
అనకాపల్లి జిల్లా, కోటవురట్ల మండలం కైలాస పట్టణంలోని అనాథాశ్రమంలో కలుషిత ఆహారం తిని ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. బాధిత విద్యార్థుల కుటుంబసభ్యులు, సంరక్షకులకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఘటనకు గల కారణాలపై పూర్తి నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌తో ఫోన్లో మాట్లాడిన సీఎం చంద్రబాబు ఘటన వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు అందిస్తున్న వైద్య సహాయం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న విద్యార్థులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని మంత్రి లోకేష్‌కు సూచించారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు తరువాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. విద్యార్థుల మృతికి కారణమైన వారిని అరెస్టు చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అనధికారిక హాస్టల్ మూసివేయాలన్నారు. చిన్నారుల బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందన్నారు. అస్వస్థతకు గురైన చిన్నారుల వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
ఈ ఘటన నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. హాస్టళ్లు, శిశుసంరక్షణ కేంద్రాల్లో తనిఖీలు చేయాలన్నారు. అనుమతులు, భద్రతా ప్రమాణాలను పరిశీలించాలన్నారు. పారిశుద్ధ్యం, ఆహార నాణ్యత ఎలా ఉందో చూడాలని ఆదేశించారు.
ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి లోకేష్
అనాథాశ్రమంలో కలుషితాహారం తిని విద్యార్థులు మృతిచెందిన ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈ ఘటనపై తన మంత్రివర్గ సహచరుడు, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్లతో మాట్లాడానన్నారు అనకాపల్లి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 17మంది విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాల్సిందిగా అధికారులను ఆదేశించానని తెలిపారు. మృతిచెందిన విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు అప్రమత్తతతో వ్యవహరించాలని లోకేష్ స్పష్టం చేశారు. హాస్టల్ నిర్వాహకుడి అరెస్ట్ విద్యార్థుల మృతి ఘటనలో హాస్టల్ నిర్వాహకుడు కిరణ్‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హాస్టల్‌లో 86 మంది విద్యార్థులు ఆహారం తీసుకున్నట్లు నిర్ధారణ అయింది, కలుషిత ఆహారం తినడం వల్లే ముగ్గురు చిన్నారులు చనిపోయారని అనకాపల్లి ఎస్పీ దీపిక చెప్పారు. కిరణ్‌కుమార్‌పై హత్య కేసు నమోదు చేశామన్నారు. ట్రస్టు నిర్వహణలో ఇంకా ఎవరైనా ఉంటే వారిపైన కేసులు నమోదు చేస్తామని తెలిపారు.