- 7.5 లక్షల మందికి ఉపాధి లక్ష్యం
- ఏపీ విద్యుత్ సంస్థలు దేశంలోనే అగ్రస్థానంలో ఉండాలి
- సీఎం చంద్రబాబు మార్గదర్శకత్వంలో విద్యుత్‌రంగానికి పూర్వవైభవం
- ఏపీ ట్రాన్స్‌కో, జెన్‌కో డెైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
అమరావతి (చైతన్యరథం): ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ`2024 ద్వారా రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించి, దాదాపు 7.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ జెన్కో ఆధ్వర్యంలో రూపొందించిన 2025 డైరీ, క్యాలెండర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ఏపీ జెన్‌కో ఎండీ కేవీఎన్ చక్రధర్ బాబుతో కలిసి మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విజనరీ లీడర్, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా అధిక విద్యుత్ ఉత్పత్తి కోసం, వినియోగదారులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందించేందుకు, విద్యుత్ సంస్థల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న ఏపీ ట్రాన్స్‌కో, జెన్కో అధికారులకు, సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తమ ప్రభుత్వం విద్యుత్ శాఖను సంస్కరించే దిశగా అడుగులు వేస్తోందన్నారు. సంక్షోభం నుంచి సంక్షేమం దిశగా పయనించేందుకు ఎన్నో కార్యక్రమాలకు నాంది పలుకబోతుందని మంత్రి చెప్పారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ` 2024 తీసుకుని వచ్చిందన్నారు. దీని ద్వారా రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించి దాదాపు 7.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు.
రాబోయే కాలంలో ఏపీ ట్రాన్స్‌కో రూ.15,729 కోట్ల విలువైన ప్రాజెక్టులను అమలు చేస్తుందని, దీని ద్వారా 71 సబ్ స్టేషన్లు, 16,507 ఎంవీఏ ట్రాన్స్‌ఫర్మేషన్ సామర్థ్యం, 4696 సీకేఎం టాన్స్‌మిషన్ లైైన్స్‌ను ఏర్పాటు చేస్తుందన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గదర్శకంలో పంప్డ్ స్టోరేజి ప్రాజెక్టుల (పీఎస్‌పీ) రంగంలోకి ఏపీ జెన్‌కో అడుగుపెట్టిందని, ఈ సందర్భంగా ఉద్యోగులందరికీ హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. ఎగువ సీలేరులో 1350 మెగావాట్ల సామర్థ్యంతో సొంతంగా పీఎస్‌పీ నిర్మించేందుకు ప్రణాళికా బద్ధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పీక్ లోడ్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని దశల వారీగా 5000 మెగావాట్ల సామర్థ్యంతో సంయుక్త భాగస్వామ్యంలో ఐదు పీఎస్‌పీలు నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌హెచ్‌పీసీ తో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకోవడం ఏపీ విద్యుత్ రంగంలోనే కీలక ముందడుగు అని మంత్రి పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పత్తిలో, నాణ్యమైన విద్యుత్ సరఫరాలో అంకితభావం, నిబద్ధతను కనబరుస్తూ.. ఆంధ్రప్రదేశ్‌ను విద్యుతాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దాలని.. ఈ క్రతువులో ట్రాన్స్‌కో, జెన్‌కోల భాగస్వామం అత్యంత కీలకమన్నారు. ఏపీ ట్రాన్స్‌కో, జెన్‌కో పేరు ప్రతిష్టలు దేశ వ్యాప్తంగా ఇనుమడిరప చేసేలా, ఏపీ విద్యుత్ ఉత్పత్తి సంస్థలను దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా, సమష్టిగా అంకిత భావంతో కృషిచేయాలని పిలుపునిచ్చారు. కొత్త ఏడాదిలో విద్యుత్ సంస్థలు నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునేలా సిబ్బంది ముందడుగు వేయాలని మంత్రి గొట్టిపాటి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏపీట్రాన్స్‌కో డైరెక్టర్ ఏకేవీ భాస్కర్, ఏపీజెన్‌కో డైరెక్టర్లు ఎం.సుజయ్ కుమార్ (హైడెల్/ఎఫ్‌ఏసీ), పీ అశోక్ కుమార్ రెడ్డి (థర్మల్/ఎఫ్‌ఏసీ), పీ నవీన్ గౌతమ్ (హెచ్‌ఆర్/ఎఫ్‌ఏసీి), ట్రాన్స్‌కో, జెన్‌కో చీఫ్ ఇంజనీర్లు, సీజీఎంలు పాల్గొన్నారు.