- హింస, అవినీతిపై జగన్ మాట్లాడటమా
- ఫేక్ ప్రచారాలు జనం నమ్మరు
- ప్రజల రక్షణకు కట్టుబడిన ప్రభుత్వం ఇది
- ఏ ఘటననూ ఉపేక్షించం, నిందితులెవరినీ వదలం
అమరావతి(చైతన్యరథం): హింస, విధ్వంసం, అరాచకం, అన్యాయం, అక్రమం, అవినీతి గురించి వైఎస్ జగన్ మాట్లాడడం రోత పుట్టిస్తోందని విద్యా, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. రాష్ట్రంలో బాధితులనే నిందితులు చేసి గవర్నమెంట్ టెర్రరిజానికి పాల్పడిన ఆ చీకటి రోజులు పోయి నెల దాటిందన్నారు. మిగిలిన ఆ అరాచకపు ఆనవాళ్లను కూడా కూటమి ప్రభుత్వం కూకటివేళ్లతో పెకిలించి వేస్తోంది. ప్రజా తీర్పుతో ఉనికి కోల్పోయిన జగన్…తాను పేటెంటు పొందిన ఫేక్ ప్రచారాలతో అబద్ధపు పునాదులపై మళ్లీ నిలబడాలని చూస్తున్నాడు. అందుకే రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా హత్యా రాజకీయాలంటూ ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నాడు. శవాలతో రాజకీయాలు చేసే మీ విష సంస్కృతికి ప్రజలు ఇచ్చిన తీర్పే మొన్నటి ఎన్నికల ఫలితాలు అని ఇంకా అర్థం చేసుకోకపోతే ఎలా? నేరాలు చేసి…మళ్లీ వాటిని వేరే వారిపై నెట్టడం అనే మీ కపట నాటకాలకు కాలం చెల్లింది. ప్రజల రక్షణకు కట్టుబడి ఉన్నాం. ఏ ఘటననూ ఉపేక్షించేది లేదు…ఏ నిందితుడినీ వదిలేది లేదు. బెంగళూరు యలహంక ప్యాలెస్లో కూర్చుని ఇక్కడ కుట్రలు అమలు చేయాలంటే కుదరదు. మీ హెచ్చరికలకు భయపడే ప్రభుత్వం కాదు…ప్రజలకు, వారి మానప్రాణాలకు జవాబుదారీగా ఉండే ప్రజా ప్రభుత్వం ఇది అని లోకేష్ స్పష్టం చేశారు.