- ఏ ఒక్కరికి పింఛన్ రాకపోయినా ప్రభుత్వమే బాధ్యత వహించాలి
- పెన్షన్ డబ్బులను కాంట్రాక్టర్లకు మళ్లించి కమీషన్లు కాజేసిన ద్రోహి జగన్ రెడ్డి
- జగన్‌రెడ్డి స్వార్థ రాజకీయానికి వాలంటీర్లు, పెన్షన్‌దారులు బలి
అమరావతి(చైతన్యరథం): వృద్ధులకు ఇంటివద్దనే పింఛన్ పంపిణీ చేసే విధంగా ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె.ఎస్.జవహర్‌రెడ్డిని టీడీపీ నేతలు కోరారు. ఈ మేరకు సోమవారం అమరావతిలోని సచివాలయంలో సీఎస్‌ను కలిసి ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల టీడీపీ నేతలు వినతిపత్రం అందించారు. రాజకీయ లబ్ధి కోసం తెలుగుదేశంపైనా, చంద్రబాబుపైనా దుష్ప్ర చారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎస్‌ను కోరారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీడీపీ నేతలు మాట్లాడారు.
దొడ్డి దారుల్లో అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తున్న జగన్‌రెడ్డి: వర్ల రామయ్య
ఓడిపోతున్నానని జగన్‌రెడ్డికి అర్థమైపోయిందని అందుకే తప్పుడు దారుల్లో గట్టెక్కాలని, తెలుగుదేశం పార్టీపై, చంద్రబాబుపై ప్రజల్లో వ్యతిరేకత తీసుకు వచ్చేందుకు జగన్‌రెడ్డి కుయుక్తులు పన్నుతున్నాడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య మండిపడ్డారు. వాలంటీర్ వ్యవస్థ లోపభూయిష్టంగా ఉందని ఎన్నికల కమిషన్ గ్రహించింది. అందుకే ప్రత్యామ్నాయ మార్గాలతో లబ్ధిదారులకు పింఛను పంపిణీ చేసి, వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఉత్తర్వులు ఇచ్చింది. ఎన్నికల సంఘం నిర్ణ యానికి చంద్రబాబుకి ఏమిటి సంబంధం? చంద్ర బాబు కింద కేంద్ర ఎన్నికల సంఘం పని చేస్తోందా? దీనిపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోంది. పింఛను రాకపోతే చంద్రబాబే బాధ్యుడని బుద్ధి లేని ముఖ్యమంత్రి అంటున్నాడు. అవ్వాతాతల్లో ఏ ఒక్కరికి పింఛన్ రాకపోయినా దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. లబ్ధిదారులందరికి పింఛను అందేటట్లుగా చూడాల్సింది ప్రభుత్వమే. వాస్తవానికి పింఛన్లు ఇవ్వడా నికి ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవు. ఉన్న డబ్బంతా హుటాహుటిన సొంత కాంట్రాక్టర్లకు జగన్‌రెడ్డి దోచి పెట్టాడు. వృద్ధులకు పింఛను ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులున్నాయా లేవా అని సీఎస్‌ను అడిగాం.
ప్రభుత్వ ఖజానాలో ఉన్న డబ్బును కమీషన్ల కోసం సొంత కాంట్రాక్టర్లకు, జగన్‌రెడ్డి మేనమామ రవీంద్రనాధ్ రెడ్డికి ఇవ్వడం సరి కాదు. అవి అవ్వాతాతల పింఛన్ డబ్బులు. వారికే ఇవ్వాలి. నాడు రూ.200 ఉన్న పింఛన్‌ను రూ.2 వేలు చేసింది చంద్రబాబే. మరలా అధికారంలోకి రాగానే పింఛను రూ.4 వేలకు పెంచి, నేరుగా అవ్వాతాతల ఇంటికి వచ్చి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. ఇప్పుడు వృద్ధులను సచివాలయాలకు ఎండలో వచ్చి పింఛను తీసుకోవాలని ప్రభుత్వం చెబుతోంది. అలా కాకుండా ఇంటికే వెళ్ళి పింఛను పంపిణీ చేయాలని సీఎస్‌ను డిమాండ్ చేశాం. పెన్షన్‌దారులెవ్వరూ భయపడాల్సిన పని లేదు. కచ్చితంగా మీ ఇంటికే వచ్చి పింఛను ఇస్తారు. వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని పెన్షన్‌దారులు ఎవ్వరూ నమ్మవద్దు. తప్పుడు వార్తలు ప్రచారాలు చేస్తున్న వైసీపీ అధికారిక ట్విట్టర్ ఖాతాపై చర్యలు తీసుకోవాలి. వైసీపీ సోషల్ మీడియాలో చంద్రబాబుపై దుష్ప్రచారం చేస్తున్నారని, అటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సీఎస్ జవహర్ రెడ్డికి ఫిర్యాదు చేశాం. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్ళి 5వ తేదీలోపు ప్రభుత్వ ఉద్యోగుల చేత పింఛన్ట పంపిణీ పూర్తి చేయాలని సీఎస్‌ను కోరాం. సీఎస్ సానుకూలంగా స్పందించారని, ఈ విషయంలో జిల్లా కలెక్టర్లకు, సెర్ప్‌కు ఆదేశాలిస్తానని చెప్పారని అని రామయ్య తెలిపారు.
పింఛను మొదలు పెట్టిందే టీడీపీ: తెనాలి శ్రావణ్ కుమార్
ఏ విషయాన్నైనా రాజకీయ లబ్ధి కోసం వాడుకోవ డంలో వైసీపీ పీహెచ్‌డీ చేసిందని తాడికొండ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్‌కుమార్ ఎద్దేవా చేశా రు. వాలంటీర్లందరూ మన కార్యకర్తలే…మన పార్టీ కోసమే పని చేయాలని మొదటి నుంచి అధికార పార్టీ నాయకులు చెబుతూనే ఉన్నారు. అలానే కొంతమంది మినహా మిగిలిన వాలంటీర్లు వైసీపీకి అనుకూలంగా పని చేసి నేడు సస్పెండ్ అయ్యి ఇంట్లో కూర్చున్నారు. ఇవన్నీ ఎన్నికల కమిషన్ గమనించింది. అందుకే వాళ్ళ తో పెన్షన్ పంపిణీ చేయించవద్దని ఈసీ ఆదేశాలిచ్చిం ది. ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు పెన్షన్ పంపి ణీలో ప్రత్యామ్నాయ విధానాలు చూడాల్సిన బాధ్యత సీఎస్‌పై ఉంది. గ్రామ,వార్డు సచివాలయాల ఉద్యోగుల చేత ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేయించవచ్చు. ప్రతీ సచివాలయ ఉద్యోగి 40 పెన్షన్ల చొప్పున ఒక్క పూటలోనే పంపిణీ చేయవచ్చు అనే విధానాన్ని సీఎస్ కు తెలుగుదేశం పార్టీ సూచించింది.
ఈ రోజు పింఛను డబ్బులు పడకపోవ డానికి తెలుగుదేశంపార్టీకి ఎటు వంటి సంబంధం లేదు. తెలుగురాష్ట్రాల్లో అసలు పింఛ ను మొదలు పెట్టింది తెలుగుదేశం పార్టీనే. పింఛను పెంచుకుంటూ పోయింది తెలుగుదేశం పార్టీ. అధికా రంలోకి రాగానే రూ.2 వేలు ఉన్న పెన్షన్‌ను ఇచ్చిన హామీ మేరకు రూ.3వేలు చేయకుండా 5 సంవత్స రాలు సాగదీసి ఎన్నికలొస్తున్నాయని చివర్లో రూ.3 వేలు చేసి పింఛనుదారులను జగన్ మోసం చేశాడు. ఈ అంశాలను పక్కన పెట్టి రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్షాలపై అధికార పార్టీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికైనా పింఛను పంపిణీలో నిష్పక్ష పాతంగా వ్యవహరించాలని సీఎస్‌ను కోరామని శ్రావణ్‌కుమార్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు దేవినేని ఉమా మహేశ్వరరావు, కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు వర్ల కుమార్‌రాజా, జులకంటి బ్రహ్మానందరెడ్డి, యార్ల గడ్డ వెంకట్రావు, బొడే ప్రసాద్, కాగిత కృష్ణప్రసాద్, గల్లా మాధవి, పార్టీ నాయకులు పోతినేని శ్రీనివాస రావు, బుచ్చి రాంప్రసాద్, నాదెండ్ల బ్రహ్మం, చిట్టా బత్తిన చిట్టిబాబు, కోడూరు అఖిల్, మీడియా కోఆర్డి నేటర్ దారపనేని నరేంద్ర, తదితరులు పాల్గొన్నారు.
రాజకీయ లబ్ధి కోసం జగన్ డ్రామాలు- నెట్టం రఘురాం
రాజకీయ లబ్ధి కోసం ఎన్నికల కమిషన్ ఉత్తర్వు లను జగన్‌రెడ్డి వాడుకుంటున్నాడని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాజీమంత్రి నెట్టెం రఘురాం విమర్శించారు. బుద్ధి లేకుండా వృద్ధులను ఎండల్లో సచివాలయాలకు వచ్చి పింఛను తీసుకోవాలని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారని దుయ్య బట్టారు. వాలంటీర్లతో పింఛన్ పంపిణీ చేయించ వద్దని ఈసీ చెప్పింది తప్ప.. ఇంటికి వెళ్ళి ఇవ్వొద్ద ని చెప్పలేదు. కానీ చంద్రబాబే పింఛను పంపిణీ ఆపించాడని వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. కచ్చితంగా ప్రత్యామ్నాయ మార్గాలు చూసి ఇతర ప్రభుత్వ ఉద్యోగుల చేత ఇంటింటికి వెళ్ళి అవ్వా తాతలకు పింఛను పంపిణీ చేయించా లని రఘురాం డిమాండ్ చేశారు.