- ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఏర్పాట్లు
- భక్తులు లక్షలాదిగా తరలివచ్చినా చిన్న ఇబ్బందీ రాలేదు
- అధికారులకు సీఎం చంద్రబాబు అభినందనలు
- మన సంస్కృతి, సంప్రదాయాల్లో పండగలు అంతర్భాగం
- వాటి పవిత్రత కాపాడుకోవటం మనందరి బాధ్యత
అమరావతి (చైతన్యరథం): సంస్కృతి, సంప్రదాయాల్లో పండగలు అంతర్భాగంగా ఉంటాయని.. వాటి పవిత్రత కాపాడుకోవడం మనందరి బాధ్యత అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించటం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. లక్షలాదిగా తరలి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన సంబంధిత అధికారులను అభినందించారు. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి కలిగించేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఈ మేరకు ఆదివారం సీఎం చంద్రబాబు ‘ఎక్స్’లో పోస్టు చేశారు.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించారన్నారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన టీటీడీకి అభినందనలు తెలిపారు. తిరుమలలో ఏటా 450 ఉత్సవాలు జరుగుతాయి. అన్నింటికంటే బ్రహ్మోత్సవాలు ముఖ్యమైనవి. ఆ సారి బ్రహ్మోత్సవాల్లో తిరుమల స్వామివారిని 6 లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. వాహన సేవలకు 15 లక్షల మంది భక్తులు హాజరయ్యారు. గతంలో 16 లక్షల మందికి అన్నప్రసాదాలు అందించారు. ఈ ఏడాది 26 లక్షల మంది భక్తులకు అన్న ప్రసాదాలు అందించారు. పండగ విశిష్టత, వైభవం ఉట్టిపడేలా అద్భుత ఏర్పాట్లు చేశారు. లైట్లతో పాటు ప్రత్యేక డిజిటల్ వ్యవస్థ ఏర్పాటు చేశారని సీఎం చంద్రబాబు తెలిపారు.
మరోపక్క విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ దసరా ఉత్సవాలు ఈ ఏడు అంగరంగ వైభవంగా నిర్వహించామన్నారు. భక్తులకు పూర్తి ఆధ్యాత్మిక వాతావరణంలో దర్శనం కలిగేలా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. మన పండుగలు కేవలం ఉత్సవాల నిర్వహణకే కాదని… మన సంస్కృతి, సాంప్రదాయాలకు, వారసత్వానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. భక్తులకు సౌకర్యాలు పెంచడంతోపాటు దేవాలయాల పవిత్రతను , సాంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందని సీఎం చంద్రబాబు అన్నారు.
చక్రస్నానంతో ముగిసిన బ్రహ్మోత్సవాలు
కలియుగ వైకుంఠంగా పేరుగాంచిన తిరుమల దివ్యక్షేత్రంలో ఈ నెల 4 నుంచి అంగరంగ వైభవంగా జరిగిన తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయదశమి పర్వదినాన శనివారం స్వామివారి చక్రస్నానం కార్యక్రమంతో ఘనంగా ముగిశాయి. దీనిపై టీటీడీ ఈవో జె.శ్యామలరావు మాట్లాడుతూ తిరుమల వెంకన్న స్వామి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించామన్నారు. భక్తులకు సేవ చేయడం అంటే భగవంతుడికి సేవ చేయడమేనని అన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూశామని, ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష జరిపి నిర్ణయాలు తీసుకున్నామని ఈవో శ్యామలరావు చెప్పారు. టీటీడీ సిబ్బంది, విజిలెన్స్ అధికారులు, పోలీసులు, జిల్లా యంత్రాంగం ఎంతో సమన్వయంతో పనిచేసినట్టు తెలిపారు. తిరుమలలో వాహనాల రద్దీ తగ్గేలా నియంత్రణ చర్యలు చేపట్టామని వెల్లడిరచారు. ఈసారి బ్రహ్మోత్సవాల సందర్భంగా 26 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదాలు అందించామని, భక్తులకు పాలు, బాదం మిల్క్, మజ్జిగ, కాఫీ కూడా అందించామని, 4 లక్షల వాటర్ బాటిళ్లు అందించామని వివరించారు. ఇక, అత్యంత ముఖ్యమైన గరుడ వాహన సేవ రోజున మూడున్నర లక్షల మంది భక్తులు తరలివచ్చారని ఈవో శ్యామలరావు వెల్లడిరచారు. ఎవరికీ ఎలాంటి లోటు లేకుండా చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు.
ఇంద్రకీలాద్రిపై పూర్ణాహుతి
అదే విధంగా ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వారి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు కూడా శనివారం ముగిశాయి. ఈ ఉత్సవాల ముగింపులో భాగంగా దేవాలయ ప్రాంగణంలో పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రామారావు, దేవాదాయ శాఖ ప్రత్యేక అధికారి రామచంద్ర మోహన్ పాల్గొన్నారు. మరోవైపు దసరా నవరాత్రుల్లో భాగంగా చివరి రోజు శనివారం అమ్మవారు శ్రీరాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకొనేందుకు భక్తులు ఇంద్రకీలాద్రికి పోటెత్తారు. దీంతో దేవాలయంలోకి వెళ్లే అన్ని క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. ఇంకోవైపు దుర్గమ్మ మాల ధారణతో వచ్చిన భవానీలు సైతం భారీ సంఖ్యలో ఇంద్రకీలాద్రికి చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు.