- టీటీడీని ఏటీఎంలా మార్చుకుని దోచుకు తిన్నారు
- అవినీతి అనకొండ రోజా నీ బాగోతం ఎరుకే
- పరామర్శ పేరుతో మీ డ్రామాలు ప్రజలకు తెలుసు
- శాసనమండలి విప్ పంచుమర్తి అనురాధ
మంగళగిరి(చైతన్యరథం): తిరుమలను ఆదాయ వనరుగా మార్చుకుని, కలియుగ దైవాన్ని కూడా దోచేసిన వైసీపీ నటి, అవినీతి అనకొండ రోజారెడ్డి కూడా తిరుమల పవిత్రత గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని ఎమ్మెల్సీ, శాసనమండలి విప్ పంచుమర్తి అనురాధ ధ్వజమెత్తారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూట మి ప్రభుత్వం తెచ్చిన రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు ప్రధానితో శంకుస్థాపన సమయంలోనే అధికారుల నిర్లక్ష్యంతో తిరుపతిలో దురదృష్టకర సంఘటన జరగటం బాధాకరమన్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి ఘటనకు బాధ్యులైన ఇద్దరు అధికారు లను సస్పెండ్ చేసి ముగ్గురు అధికారులపై బదిలీ వేటు వేయటం జరిగిందన్నారు. చనిపోయిన వారికి రూ.25 లక్షల ఎక్సగ్రేషియా, గాయపడిన వారికి రూ.5 లక్షల పరిహారం ప్రకటించారని తెలిపారు. 31 క్రిమినల్ కేసులతో 16 నెలలు జైల్లో చిప్ప కూడు తిన్న జగన్ ఉత్తరాంధ్రకు ఏం చేశాడో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
ప్రజాధనం వృథా చేసి రూ.500 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్న జగన్ అండ్ కో కబ్జాల బాగోతం ఉత్తరాంధ్ర ప్రజలందరికీ తెలుసునని దుయ్యబట్టారు. జగన్, ఆయన అనుచ రులు ముఖ్యంగా రోజా డ్రామాలు ఆడేందుకు పరామర్శ నెపంతో ప్రజలను ఇబ్బంది పెట్టడానికి వెళ్లారా? అని ప్రశ్నించారు. ఉహించని ఘటనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడు తున్న వైసీపీ నేతలకు, వారి హయాంలో జరిగిన గోదావరి బోటు ప్రమాదం, అన్నమయ్య డ్యామ్ గేటు కొట్టుకుపోవడం, రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత వంటి నిర్లక్ష్యంతో జరిగిన మరణాలు గుర్తు లేవా? అని ప్రశ్నించారు. ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనపై ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్న వైసీపీ నేతలని అసలు మనుషులంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి అండ్ కో చేసినట్టు కూటమి ప్రభుత్వంలో ఎవరు కూడా పవిత్ర తిరుమల ప్రసాదాన్ని రాజకీయ అవసరాలకు వాడలేదు… టికెట్లు అమ్ము కోలేదు.. తిరుమలలో రాజకీయాలు మాట్లాడడం వంటివి చేయలేదని గుర్తుచేశారు. తిరుమల పవిత్రతను అపవిత్రం చేసిన వైసీపీ నేతలు తిరుమల, వేంకటేశ్వర స్వామి, భక్తుల గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు.
డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమలలో అహంభావంతో తిరిగిన జగన్‌కు నిజంగా స్వామి మీద భక్తి ఉందా? అని ప్రశ్నించారు. టీటీడీని వైసీపీ నేతలు ఏటీఎం మిషన్‌గా మార్చేశారని విమర్శించారు. వైసీపీ పాలనలో అవినీతిపరులు, నేరచరిత్ర ఉన్న వారితో టీటీడీ బోర్డు నింపారని మండిపడ్డారు. కనకదుర్గమ్మ గుడిలో సింహాలు మాయమైనప్పుడు, అంతర్వేది లో రథం తగలబడినప్పుడు, తిరుమల టికెట్లపై అన్యమత ప్రచారం జరిగినప్పుడు నాడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు. తన అవినీతికి తిరుమలను అడ్డాగా మార్చి టికెట్లను అమ్ముకుని లక్షల్లో సంపాదించారని, వివిధ నగరాల్లో కోట్లలో గెస్ట్ హౌస్‌లు, భూకబ్జాలు, బెల్ట్ షాపుల ద్వారా వందల కోట్లు దోచుకున్నారంటూ రోజా మీద ధ్వజమెత్తారు. గ్రావెల్ దోపిడీ, టూరిజం, విజయపురం కొండ తవ్వకం వంటి దోపిడీతో ప్రజల సొమ్ము దోచుకున్న వైసీపీ నటి రోజారెడ్డి అలి యాస్ శ్రీలతరెడ్డికి చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత ఉందా? అని ప్రశ్నించారు.
వైసీపీ నేతలు టీటీడీ చైర్మన్‌పై మాట్లాడే ముందు ఆయన గురించి తెలుసుకుని మాట్లా డాలని హితవుపలికారు. బి.ఆర్.నాయుడు తన కుటుంబసభ్యుల గెస్ట్‌హౌస్ ఖర్చులు తనే చెల్లించి ప్రోటోకాల్ వాహనాలు వాడకుండా..కాఫీ, టీ ఖర్చులు సైతం స్వయంగా భరి స్తున్నారన్నారు. కరుణాకర్‌రెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి లాగా తిరుమలని దోచుకోవడం లేదని వ్యాఖ్యానించారు. పరామర్శ నెపంతో వెళ్లిన జగన్‌రెడ్డికి ఊహించిన డ్రామా కనిపించక పోవడంతో అసహనంతో డాక్టర్లను తిట్టడం, రోగులను ఇబ్బంది పెట్టడం చేశారంటూ విమర్శించారు. ఇదేనా పరామర్శ అని ప్రశ్నిస్తూ ప్రజలు జగన్ డ్రామాలు గమనిస్తున్నా రని హితవుపలికారు.