- బీమా క్లెయిమ్స్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం
- రుణాల రీషెడ్యూల్‌పైనా బ్యాంకులకు దిశానిర్దేశం
- బాధితులపట్ల మానవతా దృక్పథం చూపించాలని వినతి
- బ్యాంకర్లు, బీమా కంపెనీలతో ముఖ్యమంత్రి భేటీ
విజయవాడ (చైతన్యరథం): కలెక్టరేట్‌లో బ్యాంకర్లు, బీమా కంపెనీల ప్రతినిధులతో బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. వరదలతో ప్రజలు ఆస్తులు నష్టపోయిన పరిస్థితుల్లో 10 రోజుల్లో బీమా క్లెయిమ్స్ పరిష్కరించాలని సూచించారు. బుడమేరు వరద కారణంగా వేలాది ఇళ్లు నీటమునిగాయి. ప్రతి ఇంట్లో ద్విచక్ర వాహనాలు, కార్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఫ్రిజ్‌లు, టీవీలు, ఏసీలువంటి విలువైన వస్తువులు దెబ్బతిన్నాయి. కుటీర పరిశ్రమలు నడుపుకునే వారి సామగ్రి మొత్తం నీటి పాలైంది. ఎన్నడూ చూడని విపత్తును నేడు విజయవాడ ప్రజలు ఎదుర్కొంటున్నారు. గతంలో తుపాన్లు, వరదలు వచ్చినప్పటికీ నేటి పరిస్థితి వాటికి పూర్తి భిన్నంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో సర్వంకోల్పోయి జీవితం కొత్తగా మొదలుపెట్టే వారికి బ్యాంకర్లు, బీమా కంపెనీల భరోసా ముఖ్యమన్నారు. ఈఎంఐల చెల్లింపులో బ్యాంకర్లు ఒత్తిడి చేయరాదని సూచించారు. నిబంధనలు సరళతరం చేసి ప్రజలకు రుణాలివ్వాలని సూచించారు. 10 రోజుల్లో వాహన, ఇతర బీమాలను పరిష్కరించాలని సూచించారు. ఆన్‌లైన్ విధానం ద్వారా త్వరతగతిన అవసరమైన ప్రక్రియ పూర్తిచేయాలని కోరారు. వరద బాధిత ప్రాంతాల్లో ప్రజల రుణాల కాలపరిమితిని రీ షెడ్యూల్ చేయాలని, యుద్ధప్రాతిపదికన రుణాలు మంజూరు చేయాలని కోరారు. ప్రభుత్వం, బ్యాంకులు, బీమా కంపెనీలు అందరం కలిసి ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేశారు.
ఎక్కువ సాయానికి కేంద్రం, ఆర్‌బీఐతో సంప్రదింపులు
బీమావున్న వారికి, లేనివారికి రెండు కేటగిరీలుగా చేసి ఎలా సహాయం చేయాలో ఆలోచిస్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. వరద బాధితులకు వీలైనంత ఎక్కువగా సహాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు చేస్తోందని వివరించారు. ప్రభుత్వంతోపాటు బ్యాంకర్లు, బీమా కంపెనీలు కూడా మానవీయ కోణంలో స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో బాధితులు క్లెయిమ్‌ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తామని తెలిపారు. వినియోగదారుల వద్ద ఉన్న డేటాతో పాటు మునిసిపల్, రవాణా శాఖలవద్ద ఉన్న డేటా సహాయంతో క్లెయిమ్‌లకు దరఖాస్తు చేయాలని సూచించారు. అన్ని శాఖల వద్ద ఉన్న డేటా మొత్తాన్ని క్రోడీకరించి బాధితులను ఆదుకుందామని పిలుపునిచ్చారు. బాధితుల వివరాలను ప్రభుత్వం గుర్తించి బ్యాంకర్లకు ఇస్తుంది. బ్యాంకర్లు రుణాలు రీషెడ్యూల్ చేయాలని కోరుతున్నాం. ప్రభుత్వం, బ్యాంకులు, కంపెనీలు అందరం కలిసి వరద బాధితులకు ఆక్సిజన్ అందిద్దాం. రుణాల రీషెడ్యూల్, 10 రోజుల్లో క్లెయిమ్స్ పూర్తి చేయాలన్న ప్రతిపాదనలపై చర్చించుకుని రావాలని సీఎం సూచించారు.