- ఈ రోజు సాయంత్రం వెల్లడి కానున్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు
- ఏ పార్టీ హవా ఎట్లుందో తెలిసే అవకాశం
- ఊహించని ఫలితాలు ఏ మేరకు ఉండవచ్చు?
అమరావతి : తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో నేటి సాయం త్రం ముగియనున్న పోలింగ్‌తో 5 రాష్ట్రాల్లో చేపట్టిన ఎన్నికల ప్రక్రియ పూర్తవనుంది. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఈ రోజు సాయంత్రం 5.30 గంటలకు వివిధ మీడియా, ఇతర సంస్థలు ‘ఎగ్జిట్ పోల్స్’ ఫలితాలను వెల్లడిరచనున్నాయి.
తెలంగాణ, ఛత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం లలో శాసనసభ ఎన్నికలు వివిధ రోజుల్లో జరిగాయి. ఈ 5 రాష్ట్రాల్లో మొత్తం జనాభా దాదాపు రూ.25 కోట్లు ఉండగా.. అందులో మొత్తం ఓటర్లు సుమారు 17కోట్లు ఉన్నారు. ఎన్నికలు జరిగిన 5 రాష్ట్రాల మొత్తం జనాభా దేశ జనాభాలో 17శాతం ఉండగా.. ఈ రాష్ట్రాల్లోని మొత్తం ఓటర్లు దేశంలోని ఓటర్ల సంఖ్యలో సుమారు 18శాతం మంది.ఈ ఎన్ని కల్లో కనిష్టంగా రాజస్థాన్‌లో 70శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా.. అత్యధికంగా మిజోరంలో 78శాతం పోలింగ్ జరిగింది.
ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. మరో నాలు గైదు నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ముందు వెల్లడౌతుండటంతో దేశవ్యాప్తంగా వీటిపై తీవ్ర ఆసక్తి నెలకొంది. పైన పేర్కొన్న అంకెల ప్రకారం జనాభా, ఓటర్ల శాతం ప్రకారంగా ఈ ఎన్నికల ఫలితాలు దేశ వ్యాప్త రాజకీయ పరిస్థితిని అంచనా వేయటానికి ఆధారపడదగ్గ సూచిక అని పరిశీలకుల అభిప్రాయం. ఈ 5రాష్ట్రాల్లో రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉండగా, మధ్యప్రదేశ్‌లో బీజేపీ, తెలంగాణలో భారతీయ రాష్ట్ర సమితి, మిజోరంలో మిజో నేషనల్ ఫ్రంట్ అధికారంలో ఉన్నాయి.
తెలంగాణలో రెండు సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్ మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తోంది. రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్ లలో 2018 ఎన్నికల్లో బీజేపీని ఓడిరచి కాంగ్రెస్ అధికారం చేపట్టింది. ఆ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయగా.. ఆ తర్వాత జ్యోతిరాదిత్య సింధియా నాయకత్వంలో కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మిజోరాంలో మిజో నేషనల్ ఫ్రంట్ పదేళ్ల విరామం తరువాత 2018 లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
2014, 2019 లోక్ సభ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ తన పరిస్థితిని మెరుగుపరచుకోవటానికి శాయశక్తులా కృషి చేస్తోంది. ఈ రెండు ఎన్నికల్లో నరేంద్ర మోడీ నాయకత్వంలో భారీ విజయాలను సాధించిన బీజేపీ తన పట్టును ఇంకా పెంచుకోవటానికి సర్వశక్తులు ఒడ్డుతోంది. ఓటర్లు శాసనసభ ఎన్నికల్లో ఒకవిధంగా, లోక్ సభ ఎన్నికల్లో మరో విధంగా ఓటు వేస్తున్నారన్న అభిప్రాయం ప్రజలు, పరిశీలకుల్లో బాగా నెలకొంది.
ఇటీవల జరిగిన కర్నాటక శాసనసభ ఎన్నికల్లో విజయాన్ని సాధించిన కాంగ్రెస్ పార్టీ కొంతమేరకు ఆత్మస్థైర్యాన్ని పుంజుకుంది. ఈ నేపథ్యంలో.. తెలంగాణలో విజయం కోసం భాజపా ఈ ఎన్నికల్లో గట్టి ప్రయత్నం చేసింది. రాజస్థాన్ లో గత పాతికేళ్లుగా ప్రభుత్వాలు మారుతూ వచ్చాయి. ఈ రివాజు కొనసాగుతుందా.. లేక కాంగ్రెస్ కు చెందిన ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చరిత్ర మారుస్తారా అన్న విషయంపై ఆసక్తి నెలకొంది.
నేటి సాయంత్రం ఎగ్జిట్‌పోల్స్ వెల్లడికానున్న తరుణం లో ప్రజలు,పరిశీలకుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్న అంశాలు:
1. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లలో ఎవరు పైచేయి సాధిస్తారు?
2. రెండు రాష్ట్రాల్లో అధికారంలోఉన్న కాంగ్రెస్, ఒక రాష్ట్రంలో ప్రభుత్వం నడుపుతున్న బీజేపీ తమ పరిస్థితిని పదిలం చేసుకోగలరా? అదనంగా ఏ మేరకు లాభం పొందగలరు?
3. బీఆర్‌ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు హ్యాట్రిక్ సాధించగలరా?
4. తెలంగాణలో భాజపా ఎటువంటి ఫలితాలను సాధించనుంది?
5. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారం ప్రభావం ఏమేరకు ఉంది?
6. మొత్తంమీద ఈ 5ఫలితాలు ఎటువంటి రాజకీ య సందేశాన్ని ఇవ్వనున్నాయి?
7. ఫలితాలు త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల గురించి ఎటువంటి చర్చకు దారితీస్తాయి? ఏ మేరకు ప్రభావితం చేయగలవు?
ఎగ్జిట్ పోల్స్
ఎన్నికల వాస్తవ ఫలితాల వెల్లడికి ముందే వస్తున్న ఎగ్జిట్ పోల్స్ పై గత 20 సంవత్సరాలకు పైగా ప్రజల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. కొన్నిసార్లు కొన్ని ఎగ్జిట్ పోల్స్ వాస్తవానికి విరుద్ధంగా వచ్చినా వాటి పట్ల ఆసక్తి తగ్గటం లేదు. కొన్ని సంస్థలు ఇచ్చే అంచనాలు కొన్నిసార్లు తప్పినా మొత్తం మీద ఎగ్జిట్ పోల్స్ వాస్తవ ఫలితాలను దగ్గరగా సూచించగలుగుతున్నాయి.
ఈ నేపథ్యం లో.. నేటి సాయంత్రం వెల్లడికానున్న ఎగ్జిట్ పోల్స్ మరో మూడు రోజుల్లో వెల్లడయ్యే వాస్తవ ఫలితాల పట్ల ప్రజల ఉత్కంఠతను కొంతమేరకు తగ్గించగలవు. ఓటరు కరుణ ఎవరిపై ఉందో ఈ సాయంత్రం చాలావరకు వెల్లడి కావచ్చు.