- ఏపీ పర్యాటకం సురక్షితం అనే నమ్మకం కలిగించాలి
- పర్యాటక ప్రదేశాల్లో ప్రత్యేక ప్రవర్తనా నియమావళి
- టూరిజం హాట్ స్పాట్లలో హెలీపోర్టుల అభివృద్ధి
- నిర్ణీత కాలవ్యవధిలో ప్రణాళికల అమలు
- ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం
- అటవీ, పర్యాటక, దేవాదాయ, రోడ్లు భవనాల శాఖల మంత్రులతో సమన్వయ సమావేశం
అమరావతి (చైతన్యరథం): మన రాష్ట్రంలో పర్యటక రంగంలో ఉపాధి అవకాశాలు విస్తృతంగా ఉన్నాయి.. వాటిని అందిపుచ్చుకునే విధంగా ప్రణాళికలకు రూపకల్పన చేయాలి.. రాష్ట్రానికి వచ్చే పర్యటకుల భద్రతకు 100 శాతం భరోసా ఇవ్వాలి.. ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలా సురక్షితం అన్న భావన పర్యాటకుల్లో కలగాలి.. అందుకోసం టూరిజం సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్ పాలసీ తీసుకురావాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రానికి వచ్చే పర్యటకులు సంతోషంగా తిరిగి వెళ్లాలన్నారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులందరూ తరలి వచ్చినప్పుడు వారికి భధ్రమైన పరిస్థితులు కల్పించాలని, మహిళా పర్యాటకుల భద్రతకు ప్రత్యేక విధానం తీసుకురావాలని సూచించారు. సోమవారం రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి, ఉపాధి కల్పనపై పర్యాటక, దేవాదాయ, రోడ్లు, భవనాల శాఖల మంత్రులు, అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో యువత, గిరిజన ప్రాంతాల ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు పర్యాటక శాఖలో అద్భుత అవకాశాలు ఉన్నాయన్నారు. టూరిజం హాట్ స్పాట్లను గుర్తించడం, అక్కడ సౌకర్యాలు మెరుగుపర్చడం ద్వారా దేశ, విదేశాల నుంచి పర్యాటకులను ఆకర్షించవచ్చు. ఆయా ప్రాంతాల్లో హెలీపోర్టులు ఏర్పాటు చేయవచ్చు. అందుకోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలి. నిర్ణీత సమయంలో వాటిని అమలు చేయాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నేను చాలా సందర్భాల్లో టూరిజం పాలసీపై చర్చించాం. పర్యాటక అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల్లో అత్యంత ప్రాధాన్యతాంశం భద్రత. రాష్ట్రంలో ఏ మూలకి వెళ్లినా భద్రతకు ఇబ్బంది ఉండదు అన్న భావన టూరిస్టుల్లో కల్పించాలి. ప్రకృతిని ఇష్టపడుతూ అటవీ ప్రాంతాల్లో పర్యటించేవారికి తగిన భద్రత అందించాలి. పర్యాటక ప్రదేశాల్లో శాంతి,భద్రతలు పూర్తిగా అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఎకో టూరిజం అభివృద్ధి చేస్తున్న ప్రాంతాల్లో మన సంస్కృతి, సామాజిక పరిస్థితులపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. పర్యటకులతో ఎలా మసలుకోవాలి అనే అంశంపై ఒక ప్రవర్తనా నియమావళి తీసుకువచ్చి, దాన్ని కచ్చితంగా అమలు చేయాలి. ఉల్లంఘనలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి. ముఖ్యంగా హోటల్స్, ట్రావెల్స్ నిర్వాహకులు ఈ నియమావళి కచ్చితంగా పాటించే విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పవన్ మార్గ నిర్దేశం చేశారు.
ప్రకృతిని వారసత్వ సంపదగా గుర్తించాలి
టూరిజం హాట్ స్పాట్లను గుర్తించి ఆయా ప్రాంతాల్లో హెలీ టూరిజం అభివృద్ధి చేయాలి. అన్ని పర్యాటక ప్రాంతాల్లో ఒకే తరహా ఆర్కిటెక్చర్ ఏర్పాటు చేయాలి. మన రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఆర్కిటెక్చర్‌ని అభివృద్ధి చేయాలి. అది అంతరించిపోయిన కళలకు పునరుజ్జీవం పోసేదిగా ఉండాలి. రాష్ట్రంలో ఏ మూలకి వెళ్లినా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నామన్న భావన పర్యాటకులకు కలగాలి. 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం వెంబడి అడ్వెంచర్ టూరిజం, కృష్ణా, గోదావరి జలాల్లో బోట్ రేసులు వంటి వాటిని నిర్వహించడం ద్వారా పర్యాటకులను ఆకర్షించాలి. మంగళగిరి, కొండపల్లి, సిద్ధవటం, తదితర కొండ ప్రాంతాల్లో పర్వతారోహణకు అనువైన పరిస్థితులు కల్పించాలి. నేను గతంలో పార్వతీపురం మన్యం ప్రాంతానికి వెళ్లిన సమయంలో అద్భుతమైన ప్రకృతి ప్రసాదిత దృశ్యాలు వీక్షించే అవకాశం దక్కింది. అలాంటి ప్రాంతాలను వారసత్వ సంపదగా గుర్తించి పరిరక్షణకు ఏర్పాట్లు చేయాలని పవన్ సూచించారు.
మరిన్ని శాఖలను భాగస్వాముల్ని చేయాలి
మన కవుల గొప్పదనాన్ని భావితరాలకు అందించేలా గుర్రం జాషువా, కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, గురజాడ అప్పారావు, మొల్లమాంబ, తదితరుల ఇళ్లను పరిరక్షించి, వాటిని సాహితీ సర్క్యూట్‌గా ఏర్పాటు చేయాలి. సమాజాన్ని ఆధ్యాత్మిక, సేవా మార్గం వైపు నడిపిన మన అవధూతలు గొలగమూడి వెంకయ్య స్వామి, కాశీనాయన, తదితరుల ఆశ్రమాలను స్పిరిచ్యువల్ సర్క్యూట్ గా తీర్చిదిద్దాలి. అల్లూరి జిల్లా, చింతపల్లి ప్రాంతంలో ఉన్న జంగిల్ బెల్స్ సమస్యను పరిష్కరించాం. పర్యాటక అభివృద్ధిలో టూరిజం, అటవీశాఖలతో పాటు గిరిజన సంక్షేమ శాఖ, నీటిపారుదల శాఖలను కూడా భాగస్వామ్యం చేయాలి. ఎలాంటి ప్రణాళిక రూపొందించినా నిర్ణీత కాల వ్యవధిలో వాటిని పూర్తి చేయాలని పవన్ ఆదేశించారు. ఇందుకు సంబంధించి తదుపరి సమావేశం జనవరి 6వ తేదీ నిర్వహించాలని నిర్ణయించారు.
ఈ సమావేశంలో అటవీశాఖ సలహాదారు మల్లికార్జునరావు, ఉన్నతాధికారులు అజయ్ జైన్, ఆమ్రపాలి, శాంతిప్రియ పాండే, రాహుల్ పాండే, శరవణన్, రామచంద్ర మోహన్, శ్రీనివాస్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కృష్ణబాబు, కాంతిలాల్ దండే, హరి జవహర్‌లాల్ పాల్గొన్నారు.














