సిడ్నీ (ఆస్ట్రేలియా): శాసన వ్యవస్థకు పారదర్శకతే ప్రాణమని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఉద్ఘాటించారు. అదే.. న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలకు భిన్నంగా శాసనవ్యవస్థను నిలుపుతోందన్నారు. రాజ్యాంగం, సభా నియమాలు.. శాసన వ్యవస్థ పనితీరులో దాపరికానికి తావు లేకుండా చేశాయన్నారు. ప్రజలు చట్టసభల కార్యకలాపాలను పరిశీలించి, తమ అభిప్రాయాలు వెల్లడిరచేందుకు అవకాశం కల్పించడం పారదర్శకతకు పునాదిగా నిలుస్తోందన్నారు. ఈ పారదర్శకతను పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ చట్టసభలు ప్రత్యక్ష ప్రసారం నిర్వహిస్తున్నాయని స్పీకర్ తెలిపారు.
ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో 67వ కామన్వెల్త్ పార్లమెంటరీ మహాసభల్లో ‘‘ఉత్తమ విధానాల అమలు ద్వారా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ప్రతిష్ట’ అనే అంశంపై చర్చలో పాల్గొంటూ, శాసనసభ కమిటీ పనితీరుకు మరింత పారదర్శకత అవసరమని అయ్యన్నపాత్రుడు అభిప్రాయపడ్డారు. కమిటీ సమావేశాల వివరాలను ప్రజలకు చేరవేసేందుకు అన్ని పక్షాలు చర్చ ద్వారా ఏకాభిప్రాయం సాధించాల్సిన అవసరం ఉందన్నారు.
శాసనసభ ప్రధాన కర్తవ్యం చట్టాలను రూపొందించడం అని, అయితే చట్టాలపై సమగ్ర చర్చకు తగినంత సమయం దొరక్కపోవడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. ప్రజల రోజువారీ సమస్యల పరిష్కారంలో శాసనసభ్యులు నిమగ్నమవడం వల్ల చట్టాలపై పరిశోధనకు తగిన సమయం దొరకడం లేదని స్పీకర్ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థలు, ఇతర ప్రభుత్వ సంస్థలు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తే శాసనసభ్యులకు భారం తగ్గుతుందని చెప్పారు.
ప్రశ్నల సమయం, శూన్యకాలం, ప్రత్యేక ప్రస్తావనలు వంటి సాధనాలు ఉన్నప్పటికీ, శాసనసభ పనిదినాలు తక్కువగా ఉండటం వల్ల ఆశించిన ఫలితాలు సాధించడం కష్టమవుతోందన్నారు. అందుకే, ఏడాదిలో కనీసం ఎన్ని రోజులు చట్టసభలు సమావేశం కావాలన్నది రాజ్యాంగ సవరణ ద్వారా నిర్ధారించాలని ఆయన సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏడాదికి కనీసం 70 రోజులు సమావేశమవడం మంచిదని అయ్యన్నపాత్రుడు అభిప్రాయపడ్డారు.
అంతేకాకుండా, సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థలో విస్తృతంగా ప్రవేశపెట్టబోతున్నామని, త్వరలోనే కాగితరహిత కార్యకలాపాల కోసం చర్యలు తీసుకుంటున్నామని స్పీకర్ తెలిపారు. ప్రపంచంలోని ఉత్తమ విధానాలను స్వీకరించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.