- బురద జల్లేందుకు అనవసర ఆరోపణలు
- వైసీపీ నేత సజ్జలకు మంత్రి నారాయణ స్ట్రాంగ్ కౌంటర్
- మాకు అమరావతి ఒకటే రాజధాని
- వైసీపీ దృష్టిలో రాష్ట్ర రాజధాని ఎక్కడో చెప్పాలి
- అధికారం ఉన్నప్పుడు రైతులకు వేధింపులు, ఇప్పుడు మొసలి కన్నీరు
- గత ప్రభుత్వ నిర్వాకంతోనే అమరావతి పనులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి
అమరావతి (చైతన్యరథం): రాష్ట్ర రాజధాని ఎక్కడో వైసీపీ నేతలు స్పష్టంగా చెప్పాలని మంత్రి నారాయణ సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వానికి రాజధాని అమరావతి ఒకటే రాజధాని అనే విషయంలో కూటమి ప్రభుత్వానికి స్పష్టత ఉందన్నారు. మరి వైసీపీ రాజధాని ఏదో చెప్పాలని డిమాండ్ చేశారు. అమరా వతిపై పూటకో విధంగా వైసీపీ విషప్రచారం చేస్తోందని మండిపడ్డారు. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతి గురించి చేసిన వ్యాఖ్యలపై మంత్రి నారాయణ ఘాటుగా స్పందించారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద మంత్రి నారాయణ శనివారం మీడియాతో మాట్లాడారు.
రాష్ట్ర విభజన తర్వాత అమరావతి రాజధానిగా వైసీపీ అంగీకరించింది. రాజధానికి 30 వేల ఎకరాలు కావాలని స్వయంగా జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలోనే చెప్పారు. 2017 చివరిలో అమరావతి నిర్మాణ పనులు ప్రారంభించాం. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మూడుముక్కలాట ఆడింది…కానీ ఎక్కడా రాజధాని ఏర్పాటు చేయలేదు. మొత్తం సర్వనాశనం చేసారు. రాజధానికి భూములిచ్చిన రైతులను నానా ఇబ్బందులు పెట్టారు. మహిళలని కూడా చూడకుండా వారిని జైలుకు పంపించారు. తిరిగి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులంతా ఎంతో ఆనందంగా ఉన్నారు. అమరావతి వచ్చి చూస్తే ప్రస్తుతం పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయో తెలుస్తుంది. ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పక్క రాష్ట్రాల్లో కూడా అమరావతి నిర్మాణ పనులు గురించి చర్చించుకుంటున్నారని మంత్రి నారాయణ అన్నారు.
జగన్ ప్రభుత్వ వైఖరి వల్లే..
గత ప్రభుత్వ నిర్వాకంతోనే అమరావతి నిర్మాణ పనులు ఏడాదిపాటు ఆలస్యం అయ్యాయి. కాంట్రాక్ట్ సంస్థలకు చెల్లించాల్సిన బిల్లులు కూడా చెల్లించలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక తిరిగి నిర్మాణ పనులు ప్రారంభించడానికి న్యాయపరమైన సమస్యలు రాకుండా అధికారులు, ఇంజినీర్లతో కమిటీలు వేసి అన్ని సమస్యలు పరిష్కరించుకున్న అనంతరమే పనులు ప్రారంభించాం. ఆ తర్వాత వర్షాలు రావడంతో మరికొంత ఆలస్యం అయింది. రోడ్లు, అధికారుల భవనాలు అన్నీ వేగంగా జరుగుతున్నాయి. రైతులకు చిన్నచిన్న సమస్యలున్నాయి. కేంద్రమంత్రి పెమ్మసాని, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తో కలిసి రైతుల సమస్యలు పరిష్కరించేలా ముందుకెళ్తున్నాం. ఇటీవల రైతులు కొన్ని కొత్త సమస్యలు తీసుకొచ్చారు. వాటిని కూడా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి నారాయణ చెప్పారు.
బురదజల్లే యత్నం
రివర్ బేసిను, రివర్ బెడ్కు తేడా తెలియకుండా అమరావతిపై జగన్ మాట్లాడారు. తర్వాత మళ్లీ సజ్జల ఏదో మాట్లాడుతున్నారు. తెలంగాణ సెక్రటేరియట్ గానీ అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కానీ కేవలం మంత్రులు, వారి సిబ్బంది, అధికారులు మాత్రమే ఉండేవారు. కానీ అమరావతిలో నిర్మించే సచివాలయంలో మంత్రులు, అధికారులతో పాటు కమిషనర్లు, శాఖాధిపతులు, కార్పొరేషన్లు… ఇలా అన్ని కార్యాలయాలు ఒకేచోట ఉండేలా ప్రజలకు పాలనా విభాగాలు మొత్తం ఒకేచోట అందుబాటులో ఉండేలా నిర్మాణం చేస్తున్నాం. ప్రజలు ఇబ్బందిపడకూడదనే సీఎం చంద్రబాబు దూరదృష్టితో సచివాలయం డిజైన్ చేసారు. వైసీపీ నేతలు మాట్లాడేముందు పూర్తిగా అన్నీ తెలుసుకుని మాట్లాడాలి. ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడవద్దు. రాజధాని నిర్మాణ పనులకు పారదర్శకంగా టెండర్లు పిలిచాం. ప్రజలను తప్పుదారి పట్టించేలా వైసీపీ నేతలు బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి నారాయణ
ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి నిర్మాణం చెప్పిన ప్రకారం పూర్తిచేస్తాం. ఉద్యోగాల కల్పన కోసం స్మార్ట్ ఇండస్ట్రీలు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అధికారంలో ఉన్నప్పుడు రైతులను పట్టించుకోని వైసీపీ నేతలు అధికారం పోయిన తర్వాత ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియటంలేదు. అమరావతిని ఆపడం ఇంకా సాధ్యం కాదని తెలిసి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మంత్రి నారాయణ తప్పుబట్టారు.

















