- పర్యాటకాభివృద్ధితో యువతకు ఉపాధి అవకాశాలు
- రోడ్ల నిర్మాణం, కంటైనర్ ఆసుపత్రితో వసతులు
- జగన్‌రెడ్డి హయాంలో గిరిపుత్రులపై నిర్లక్ష్యం
- ఆందోళనలు చేస్తే కేసులు పెట్టి వేధించారు
- టీడీపీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు ఎం.దారునాయక్
అమరావతి(చైతన్యరథం): గత వైసీపీ ప్రభుత్వ పాలనలో జగన్‌రెడ్డి గిరిజన ఏజెన్సీ ప్రాంతంలో రోడ్లు, విద్య, వైద్యం గురించి పట్టించుకోకుండా గాలికొదిలిందని టీడీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడు ఎం.దారునాయక్ ధ్వజమెత్తారు. గత వైకాపా ప్రభు త్వం మద్యం, ఆదాయం పేరిట ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి రుణాలు తెచ్చినా అభివృద్ధి చేసింది మాత్రం శూన్యమని మండిపడ్డారు. వెనకబడిన జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ.350 కోట్లు ఇస్తే ఆ నిధులను కూడా దారి మళ్ళించడంతో ఆ జిల్లాలు మరింత వెనకబడ్డాయన్నారు. గిరిజన ప్రాంతాలను కూటమి ప్రభుత్వం పర్యాటకంగా అభివృద్ధి చేయటం ద్వారా గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించనుందని తెలిపారు. రోడ్ల నిర్మాణం ద్వారా రహదారి కష్టాలు తీరనున్నాయని వివరించారు. రాష్ట్రంలో ఏడు ఐటీడీఏల పరిధిలో 9031 గిరిజన గ్రామాలు ఉండగా వాటిలో 2162 పల్లెలకు ఇప్పటికీ రహదారి సదుపాయం లేదు.. అత్యవసర పరిస్థితు లలో డోలీ మోతలే దిక్కు.. కొండలు, గుట్టలు, ఎక్కి దిగి ఆస్పత్రికి చేరుకునే లోగా ప్రాణాలు గాలిలో కలిసిపోతున్న పరిస్థితి ఉందన్నారు. 2014 – 2019 మధ్య టీడీపీ పాలనలో ఫీడర్ (బైక్) అంబులెన్సులను ప్రవేశపెట్టారు. అది కూడా వెళ్లలేని గ్రామా లకు డోలీల స్థానంలో రోగులను తరలించేందుకు స్ట్రెచర్లను ఇచ్చారని గుర్తుచేశారు.
గత వైసీపీ హయాంలో అరబిందో చేతిలో ఉన్న 108 వాహనాలకు ప్రాధాన్యం ఇచ్చా రు తప్ప ఫీడర్ అంబులెన్స్‌లను పట్టించుకోలేదు..స్ట్రెచర్‌లను పక్కన పెట్టి గిరి పుత్రు లను నిర్లక్ష్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్ల కోసం ఆందోళనలు చేసే గిరిజన సంఘాల నాయకులపై గత ప్రభుత్వంలో కేసులు పెట్టి వైసీపీ నాయకులు వేధించిన విషయం గిరిజనులు ఇంకా మర్చిపోలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికా రంలోకి వచ్చాక గిరిపుత్రుల వైద్య సదుపాయం కోసం గిరిజన ఏజెన్సీలలో డోలీల మోతకు స్వస్తి పలకడానికి కరడవలసలో కంటైనర్ ఆస్పత్రిని ఏర్పాటు చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూటమి ప్రభుత్వం గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రణా ళిక సిద్ధం చేసిందని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 481 పల్లెలకు రోడ్లు నిర్మించనుందని తెలిపారు. వాటిలో 100 మంది కంటే ఎక్కువ జనాభా ఉన్న 149 పీవీటీజీ గ్రామాలకు పీఎం జన్ మాన్ ద్వారా బీటీ రోడ్లు నిర్మించనుందని వివరించా రు. 100 మంది కంటే తక్కువ ఉన్న 78 పీవీటీజీ గ్రామాలతో పాటు 254 నాన్ పీవీటీజీ గ్రామాలకు ఉపాధి హామీ పథకంలో గ్రావెల్, మెటల్ రోడ్లు నిర్మాణం చేపట్ట నుందని, 2025 మార్చిలోగా ఈ రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు.