.900కుపైగా నామినేటెడ్ పదవుల్లో ఒక్కరూ ఎస్టీ లేరు
.తమ బాధలు గవర్నర్ వద్ద వెళ్లబోసుకున్న గిరిజన నేతలు
విజయవాడ: వైసీపీ అధికారంలోకి వచ్చిన తరు వాత 12 గిరిజన సంక్షేమ పథకాలను రద్దు చేసినట్లు గిరిజన నేతలు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు తెలియజేశారు. రాష్ట్ర ఎస్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎం.దారునాయక్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మొగిలి కల్ల య్య, టీడీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షులు సివేరి దొన్ను దొర, ఉపాధ్యక్షురాలు కత్తి పద్మ తదితరులు శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి రాష్ట్రంలో గిరిజనులకు జరుగుతున్న అన్యాయం గురించి వివరించారు. తమకు న్యాయం చేయమని అభ్యర్థిస్తూ ఒక వినతి పత్రం ఇచ్చా రు. గిరిజన విద్యార్థులకు విదేశాల్లో చదువెందుకని అంబేద్కర్ ఓవర్సీస్ విద్య పథకాన్ని, గిరిజన యువతకు ఉన్నత ఉద్యోగాలకు శిక్షణ ఇచ్చే ఎన్టీఆర్ విద్యోన్నతి పథకాన్ని రద్దు చేశారని తెలిపారు. రెండేళ్లలో నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ ద్వారా ఒక్క గిరిజన విద్యార్థికి కూడా శిక్షణ, ఉద్యోగావకాశాలు కల్పించలేదన్నారు. గిరిజన యువతులకు అందించే పెళ్లి కానుక రూ.లక్షకు పెంచుతున్నట్లు ప్రకటించి..రెండేళ్లలో ఒక్కరికీ ఇవ్వలేదని పేర్కొన్నారు. 60శాతం కేంద్ర నిధులతో ముడిపడి ఉన్న గిరిజనాభివృద్ధికి దోహదం చేసే ట్రైకార్ ను నిర్వీర్యం చేసినట్లు తెలిపారు. రెండేళ్లలో ఒక్క గిరిజన యువకుడికి కూడా రుణాలు మంజూరు చేయలేదని,స్వయం ఉపాధిని దెబ్బతీశారని వివరించారు.
ఒక్క ఎస్టీని కూడా నిమినేటెడ్ పోస్టులో నియమించలేదు
నామినేటెడ్ పనులు, పదవుల్లో రిజర్వేషన్లు కల్పి స్తామని ఆర్భాటంగా ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి.. మూడేళ్లల్లో ఒక్క ఎస్టీకి కూడా స్థానం కల్పించలేదని తెలిపారు. 900కు పైగా నామినేటెడ్ పదవులు భర్తీ చేసి ఒక్క ఎస్టీని కూడా నామినేట్ చేయకపోవడం శోచనీయమన్నారు. గిరిజన ప్రాంతాల్లోని టీచర్ పోస్టులను 100 శాతం గిరిజనులతోనే భర్తీ చేసేలా జీవో ఎం.ఎస్ నెం. 3 ను తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసినట్లు తెలిపారు. ఈ జీవోను సుప్రీం కోర్టు కొట్టేస్తే, జగన్ రెడ్డి ప్రభుత్వం కనీసం అప్పీల్ కు కూడా వెళ్ళలేదన్నారు. గిరిజనుల పట్ల వైసీపీ ప్రభుత్వం పక్షపాత వైఖరి చూపిస్తోందని తెలిపారు. గిరిజనుల పట్ల శ్రద్ధ వహించి వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన గిరిజనుల సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని వారు గవర్నర్ ను కోరారు.