మంగళగిరి : నాలుగున్నరేళ్లలో ఎస్టీలపై దాడులు.. దుర్మార్గాలే తన అజెండాగా జగన్ పాలన సాగించాడని టీడీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ధారు నాయక్ విమర్శించారు. శ్రీనివాసరెడ్డి అనే వైసీపీ కార్యకర్త నకరికల్లులో మంత్రూభాయ్ అనే గిరిజన మహిళను దారుణంగా ట్రాక్టర్ తో తొక్కించి చంపితే ముఖ్యమంత్రి నామమాత్రంగా కూడా స్పందించలేదు. కృష్ణాజిల్లా మోపిదేవి మండలం కొత్తపాలెంలో ముగ్గురు గిరిజన మహిళలపై దొంగతనం నేరం మోపి అకారణంగా వారిని చిత్రహింసలకు గురిచేస్తే ప్రభుత్వంలో స్పందన లేదు. మూడు నెలల క్రితం ఒంగోలులో గిరిజన యువకుడు నవీన్ నోట్లో మూత్రం పోస్తే, అంత దారుణానికి ఒడిగట్టిన వారిపై ఎలాంటి చర్యలు లేవు. చంద్రబాబునాయుడు గిరిజనుల్ని తన సోదరులుగా భావించారు. గిరిజన గూడేన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేశారు. టీడీపీ ప్రభుత్వం తండాలు, గూడేలను ప్రత్యేక పంచాయతీ లుగా ప్రకటించి వాటి అభివృద్ధికి నిధులు కేటాయిస్తే, జగన్ అధికారంలోకి రాగానే ఆ నిధుల్ని వెనక్కు తీసుకున్నాడు. వైసీపీ ప్రభుత్వం గిరిజన తండాలు.. గూడేల్లో నాలుగున్నరేళ్లలో ఎక్కడా ఒక్క రోడ్డు వేసింది లేదు. సరైన వైద్యసౌకర్యాలు.. తాగునీరు లేక గిరిజనులు నానా అవస్థలు పడుతున్నా ముఖ్యమంత్రి స్పందించరు. గిరిజనుల సంక్షేమం.. తండాలు, గూడేల అభివృద్ధిని విస్మరించిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జగన్ రెడ్డి భజనకే పరిమితమయ్యాడు. గిరిజనులంతా వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డిని, అతని ప్రభుత్వాన్ని పాతాళంలోకి తొక్కేయడం ఖాయం అని ధారునాయక్ హెచ్చ రించారు.