- మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రలో నారా భువనేశ్వరి పర్యటన
- చంద్రబాబు అక్రమ అరెస్ట్ తట్టుకోలేక మృతిచెందిన కార్యకర్తల కుటుంబాలకు పరామర్శ, భరోసా
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ కార్యక్రమం బుధవారం నుంచి తిరిగి ప్రారంభమవుతోంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అక్రమ అరెస్ట్ తో తీవ్ర మనస్తాపానికి గురై, గుండె పగిలి మృతిచెందిన వారి కుటుంబాలను ఈ కార్యక్రమం ద్వారా ఆమె పరామర్శిస్తున్నారు. ఇప్పటికే పలు కుటుంబాలను ఆమె పరామర్శించారు. తరువాత కొంత కాలం ఈ కార్యక్రమానికి విరామం వచ్చింది. తిరిగి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి మూడు రోజలపాటు ఉత్తరాంధ్ర ప్రాంతంలోని మూడు ఉమ్మడి జిల్లాల్లో భువనేశ్వరి పర్యటించనున్నారు. బాధిత కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించి, భరోసా కల్పించనున్నారు. ఈ నెల 3న విజయనగరం, 4న శ్రీకాకుళం, 5న విశాఖ జిల్లాల్లో ఈ కార్యక్రమం జరగనుంది. విశాఖపట్నం విమానాశ్రయం నుండి బుధవారం ఉదయం 10గంటలకు విజయనగరం వెళ్తారు. విజయనగరం లోని 29వ వార్డులో కోరాడ అప్పారావు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అనంతరం బొబ్బిలి నియోజకవర్గం, తెర్లం మండలంలోని, పెరుమల్లి గ్రామంలో మైలేపల్లి పోలయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం బొబ్బిలి నియోజకవర్గం, చీకటిపేట మండలం, మోదుగువలస పంచాయతీలో గులిపల్లి అప్పారావు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఈ మూడు కుటుంబాలను పరామర్శించిన అనంతరం రాజాం నియోజకవర్గంలో బస చేయనున్నారు. తరువాత రోజు గురువారం శ్రీకాకుళం జిల్లా లో భువనేశ్వరి పర్యటన ఉంటుంది.