తెలంగాణ లో ఎన్నికల వేడి రాజుకుంది. త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ సర్వ సన్నద్ధం అయింది. 2019 ఎన్నికల ఫలితాలతో డీలా పడిన పార్టీ శ్రేణులు ఒక్కసారిగా ఇనుమడించిన ఉత్సాహంతో ముందుకురకసాగాయి. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణ లోనూ వ్యూహాన్ని అమలు చేయసాగారు. టిటిడిపి అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ నియమితులు అయిన నాటి నుంచి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది.
ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కి వెన్నుదన్నుగా వున్న తెలంగాణ ప్రాంతంలో, రాష్ట్ర విభజన అనంతరం పరిస్థితులు తారుమారయ్యాయి. అయితే తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో నిర్ణాయకపాత్ర పోషించేందుకు టిడిపి సన్నద్ధం అయింది. దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం చేపట్టారు. అదేసమయంలో సభ్యత్వ నమోదు చేపట్టారు. ఈ రెండు కార్యక్రమాలకు తెలంగాణ లో అనూహ్య స్పందన లభిస్తోంది. వివిధ కారణాల వల్ల ఇతర పార్టీలకు వెళ్లిన నాయకులు తిరిగి టిడిపి గూటికి చేరుకుంటున్నారు.
ప్రధానంగా అధికార టి ఆర్ ఎస్ పార్టీ నుంచి టిడిపి లో చేరే వారి సంఖ్య క్షేత్ర స్థాయిలో రోజురోజుకు అధికమవుతోంది. కొద్దిరోజుల క్రితం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఆ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలకు, అసెంబ్లీ స్థానాలకు కో ఆర్డినేటర్ లను నియమించారు.
పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం మరి కొద్ది రోజుల్లో పూర్తి కానున్నది. అనంతరం నాయకుల ప్రతిభ, సామర్థ్యం ఆధారంగా నియోజకవర్గాలకు ఇంచార్జీ లను నియమించనున్నట్లు టిటిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించారు. అదేవిధంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ తో పాటు అనుబంధ విభాగాలు అన్నింటినీ పునర్వ్యవస్థీకరించనున్నట్టు కాసాని తెలిపారు.