- చంద్రబాబుతో గొంతుకలిపి స్పందించిన వైనం
- ఉత్సాహం నింపిన టీడీపీ అధినేత ప్రసంగాలు
శ్రీకాకుళం(చైతన్యరథం): ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో సోమవారం టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం సభలకు జనం బ్రహ్మరథం పట్టారు. టీడీపీకి కంచుకోటలాంటి జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం ఖాయమనిపించేలా చంద్రబాబు సభలకు జనం పోటెత్తారు. సభలు జరిగిన ప్రాంతాల్లో రోడ్లు ఇసుకేస్తే రాలనంతగా జనంతో కిక్కిరిసిపోవటంతో పాటు, చుట్టుపక్కల మేడలు, మిద్దెలపై మహిళలతో సహా వేలాదిగా జనం నిలబడి చేతులూపుతూ చంద్రబాబుకు స్వాగతం పలికారు. రాజాం, పలాస, టెక్కలి నియోజకవర్గాల్లో సోమవారం జరిగిన సభలకు జనం వేలాదిగా తరలిరావటమే కాకుండా ప్రసంగాల్లో చంద్రబాబుతో గొంతు కలపటం విశేషం.
చంద్రబాబు ప్రసంగాలు సైతం జనాన్ని ఉత్సాహపరిచేలా సాగాయి. ఎక్కడికక్కడ స్థానిక అంశాలను లేవనెత్తుతూ జనంలో ఆలోచన రేకెత్తించారు. జగన్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నలు సంధిస్తూ వారినుంచే సమాధానాలు రాబట్టారు. సభలకు హాజరైనవారు సైతం ప్రతిప్రశ్నకు చేతులు ఊపుతూనో, నోటితోనే సమాధానం ఇస్తూ జగన్ పాలనపై తమ వ్యతిరేకతను చాటిచెప్పారు. గత ఐదేళ్లుగా జగన్ విధ్వంసక విధానాలతో తీవ్రంగా నష్టపోయిన ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఊరట నిచ్చేలా అధికారంలోకి వచ్చాక చేపట్టే కార్యక్రమాలను వివరిస్తూ జనంలో టీడీపీ అధినేత ఉత్సాహం నింపారు.
ఉత్తరాంధ్ర ఉత్సాహం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. వైసీపీపై విశాఖ విరుచుకుపడుతోంది. కూటమి విజయానికి విజయనగరం జయకేతనం చూపిస్తోంది. కురుక్షేత్ర యుద్ధానికి ఉత్తరాంధ్ర సింహాలు గర్జిస్తున్నాయి. ఉత్తరాంధ్రలో మొత్తం 34 సీట్లు ఎన్డీఏ గెలుస్తుంది. జగన్ రెడ్డి సభలకు కూలి జనం అయితే, ప్రజాగళానికి వచ్చేది స్వచ్ఛంద జనం. జగన్ ఒక్కో సభకు రూ.25 కోట్లు ఖర్చు పెడుతున్నారు, బిర్యాని ప్యాకెట్లు, మందు బాటిళ్లు పంచిపెడుతున్నారు. అయినా జనం రావట్లేదు. దీంతో కొత్త డ్రామాలు ఆడుతున్నారని చంద్రబాబు విమర్శించినప్పుడు జనం నుంచి పెద్దఎత్తున స్పందన వచ్చింది.
ఏ ప్రాంతమైనా బాగుపడాలంటే నీళ్లు కావాలని చెబుతూ గత టీడీపీ ప్రభుత్వం 5 ఏళ్లల్లో ఉత్తరాంధ్ర జలవనరుల ప్రాజెక్టులకు రూ. 1,600 కోట్లు చేస్తే, జగన్ రెడ్డి పెట్టిన ఖర్చు రూ.594 కోట్లు మాత్రమే అని చెప్పి ఈ ప్రాంత సాగునీటి రంగంపై వైసీపీ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం ప్రదర్శించిందనేది జనానికి అర్థమయ్యేలా చంద్రబాబు వివరించారు. జగన్ రెడ్డి సొంత పత్రిక సాక్షికి ప్రకటనల రూపంలో దోచిపెట్టిన, సలహాదారులకు సమర్పించుకున్న వేల కోట్ల రూపాయలతో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు పూర్తయి, ఈ ప్రాంతానికి నీటికొరత తీరేదని చంద్రబాబు చెప్పినప్పుడు జనం కూడా అవును.. అవును అంటూ చేతులెత్తి తమ ఆమోదం తెలియజేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో నేడు హైదారాబాద్‌కు తలమానికంగా ఉన్న శంషాబాద్ ఎయిర్ పోర్టు నిర్మాణ బాధ్యతలను ఉత్తరాంధ్ర గడ్డ మీద పుట్టిన జీఎంఆర్ కు అప్పజెప్పాను. ఒకప్పుడు అంతర్జాతీయ విమాన సర్వీసులు లేని హైదరాబాద్ తద్వారా ప్రపంచానికి అనుసంధానం అయ్యింది. పరిశ్రమలు వచ్చాయి, ఉద్యోగాలు వచ్చి రూ.కోట్లు సంపాదించడం మొదలుపెట్టారు. అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతంలోను భోగాపురం ఎయిర్‌పోర్టును కడదామనుకునే లోపు ఎన్నికలు వచ్చాయి. టీడీపీ గెలిచిఉంటే 2020లోనే భోగాపురం ఎయిర్‌పోర్టు పూర్తయి ఈ ప్రాంతం అభివృద్ధిలో దూసుకుపోయి ఉండేది. జగన్ రివర్స్ పాలనలో భోగాపురం ఎయిర్‌పోర్టును పడుకోబెట్టారని చంద్రబాబు వివరించినప్పుడు నిజమే అంటూ జనం స్పందించారు.
ప్రభుత్వ ఉద్యోగాలు పొందే వారిలో ఉత్తరాంధ్ర వాసులే ఎక్కువ. అదే విధంగా సైన్యంలో కూడా. పిల్లలను చదివించి, ఉద్యోగాలు ఇవ్వాలంటూ.. అందుకు కరెంట్, మౌలిక సదుపాయాలు ఉండాలి. అవన్నీ సైకో జగన్‌రెడ్డి పాలనలో సర్వనాశనం అయ్యాయని చంద్రబాబు చెప్పినప్పుడు జనం కూడా అంగీకరిస్తున్నట్లుగా చేతులు ఊపటం కనిపించింది. నా హయాంలో భావనపాడు పోర్టుకు శంకుస్థాపన చేశాం. విశాఖ నుండి భావనపాడు వరకు పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించాలనుకున్నాం. ఉత్తరాంధ్ర యువతకు అండగా ఉంటే అద్భుతాలు సృష్టిస్తారు. కానీ తన ప్రణాళికలన్నింటినీ విధ్వంకారుడు జగన్‌రెడ్డి నాశనం చేశాడని చంద్రబాబు చెప్పినప్పుడు సభలకు హాజరైనవారు కూడా అవునంటూ గొంతు కలిపారు.
టీడీపీ హయాంలో గిరిజన విశ్వవిద్యాలయానికి 550 ఎకరాలు ఇచ్చి విశాఖ దగ్గరలో పనులు ప్రారంభించాం. ఇప్పుడు జగన్ రివర్స్ విధానాలతో ఎక్కడికి వెళ్లిందో తెలియదు. విశాఖలో వైసీపీ నేతల కబ్జాతో ఉత్తరాంధ్ర విలవిలలాడిరది. నేను ఉత్తరాంధ్రకు విదేశాల నుంచి పరిశ్రమలు తెస్తే జగన్ భూ సెటిల్‌మెంట్లు తెచ్చారు. విశాఖను వాణిజ్య రాజధానిగా చేస్తే జగన్ గంజాయి, డ్రగ్స్ రాజధానిగా చేశారని చంద్రబాబు విమర్శలకు జనం అవునంటూ స్పందించారు.
అధికారంలోకి రాగానే కొత్త పరిశ్రమల ఏర్పాటుతో పాటు, ఈ ప్రాంతంలో మూతపడిన పరిశ్రమలను తెరిపించి ఉద్యోగాలు ఇస్తామని చంద్రబాబు ప్రకటించినప్పుడు సభికుల్లో సంతోషం వ్యక్తమయింది. ఉత్తరాంధ్రలో రెడ్ల పెత్తనం కావాలా అని చంద్రబాబు ప్రశ్నించినప్పుడు వద్దు..వద్దు అంటూ జనం బదులిచ్చారు.
ఫ్యాన్‌కి ఓటేస్తే ఉరివేసుకోవాలి. ఫ్యాన్ పని అయిపోయిందని చంద్రబాబు అంటే ఫ్యాన్‌కు కరెంటు లేదు.. ఇక తిరగదంటూ జనం బదులివ్వటం విశేషం.
రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలనేది నా చివరి కోరిక. ప్రజల రుణం తీర్చుకునే రోజు దగ్గరలోనే ఉంది. గతంలో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఏ విధంగా సేవ చేశానో అంతకంటే మెరుగైన పాలన చేసి ప్రజల రుణం తీర్చుకుంటానని చంద్రబాబు అన్నప్పుడు జనం వెంటనే మళ్లీ మీరే రావాలంటూ నినదించటం కొసమెరుపు.