అమరావతి(చైతన్యరథం): రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ మంగళవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినందున అభినందనలు తెలియచేసి జ్ఞాపిక అందచేశారు. మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జెన్నిఫర్ లార్సన్ని, ఆమె బృందాన్ని పవన్ కళ్యాణ్ సత్కరించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు, అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టేందుకు ఉన్న అవకాశాలు ఈ భేటీలో చర్చకు వచ్చాయి. రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వంతో కూడిన ప్రభుత్వ పాలన ఉందనీ, పెట్టుబడులను ప్రోత్సహించే సానుకూల దృక్పథం తమ ప్రభుత్వంలో ఉందని ఉప ముఖమంత్రి తెలిపారు. మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునే నైపుణ్యం కలిగిన యువత రాష్ట్రంలో ఉన్నారని, వారి ప్రతిభకు తగిన అవకాశాలు అందించేందుకు, ఉన్నత విద్యకు అమెరికా వెళ్ళేవారికి తగిన సహకారం, మార్గనిర్దేశనం అందించాలని కోరారు. పర్యావరణహితమైన కార్యక్రమాలకు ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో యూఎస్ కాన్సుల్ పొలిటికల్, ఎకనామిక్స్ విభాగం చీఫ్ ఫ్రాంక్ టాలుటో, ఆ విభాగం ప్రతినిధులు శ్రీమాలి కారే, సిబప్రసాద్ త్రిపాఠి పాల్గొన్నారు.