- తగు న్యాయం చేయాలి
- సిమెంట్ రోడ్డు, డ్రైనేజీ సదుపాయం కల్పించాలి
- అంబేద్కర్ విగ్రహావిష్కరణకు షామియానాల బిల్లు చెల్లించలేదు
- 25వ రోజు మంత్రి నారా లోకేష్ ‘ప్రజాదర్బార్’ కు విన్నపాల వెల్లువ
- ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని మంత్రి హామీ
అమరావతి(చైతన్యరథం): ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తున్న విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ‘ప్రజాదర్బార్’కు 25వ రోజు మంగళవారం వినతులు వెల్లువెత్తాయి. ఉండవల్లిలోని నివాసంలో జరిగే ‘ప్రజాదర్బార్’ కు మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. మంత్రిని నేరుగా కలిసి తమ సమస్యలను విన్నవించారు. వైకాపా నేతలు తమ భూములు కబ్జా చేశారని కొందరు, వైద్య చికిత్సకు సాయం చేయాలని, ఉద్యోగం ఇప్పించాలని, పెన్షన్లు, ఇల్లు మంజూరు చేయాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని మరికొందరు విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి నారా లోకేష్.. సత్వర పరిష్కారానికి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
సిమెంట్ రోడ్డు నిర్మాణం, డ్రైనేజీ సదుపాయం కల్పించాలి
మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లి గ్రామంలోని జామాయిల్ తోట ప్రాంతంలో 300 మీటర్ల సిమెంట్ రోడ్డు నిర్మాణంతో పాటు డ్రైనేజీ సదుపాయం కల్పించాలని పి.సంపత్ కుమార్.. నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తనకు ఉద్యోగం ఇప్పించి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన తిరువీధుల నాగశ్రావణి కోరారు. రోడ్డు ప్రమాదంలో తమ కుమారుడు మృతిచెందాడని, ప్రమాద బీమా చెల్లింపుల్లో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించాలని దుగ్గిరాలకు చెందిన ఎస్.దుర్గామల్లేశ్వరి విజ్ఞప్తి చేశారు. బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్న తన కుమార్తెకు వైద్యసాయం అందించడంతో పాటు పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన మహ్మద్ అబ్దుల్ ముజీబ్ విజ్ఞప్తి చేశారు. అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్న తనకు ఎలాంటి ఆధారం లేదని, ఇల్లు మంజూరు చేయాలని పోలకంపాడుకు చెందిన మోక నారాయణమ్మ కోరారు. ఆయా విజ్ఞప్తులను పరిశీలించి అండగా ఉంటామని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు.
షామియానాల బిల్లు చెల్లించలేదు
విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ లో నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి షామియానాలు, తాగునీరు సరఫరా చేసిన తనకు గత వైకాపా ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదని, బిల్లుల మంజూరుకు ఆదేశాలు ఇవ్వాలని సిరిపల్లి నారాయణమూర్తి.. మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. బాపట్ల జిల్లా పర్చూరులోని బీఏఆర్ అండ్ టీఏ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి జీతాలు చెల్లించేందుకు అవసరమైన జీవో మంజూరు చేయాలని సిబ్బంది కోరారు. విజయవాడ సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాలలో అనాటమీ విభాగానికి చెందిన హెచ్‌వోడీ డాక్టర్ చిత్ర వేధింపులకు గురిచేస్తున్నారని, విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కాలేజీకి చెందిన పీజీ విద్యార్థులు.. మంత్రి నారా లోకేష్ ను కలిసి ఫిర్యాదు చేశారు. తీవ్ర అనారోగ్యం బారినపడి చికిత్స పొందిన తనకు వైద్య ఖర్చులు రూ.8 లక్షల వరకు అయ్యాయని, సీఎంఆర్‌ఎఫ్ కింద ఆదుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కొండపల్లికి చెందిన మొగిలి శాంతి విజ్ఞప్తి చేశారు.
తూర్పుగోదావరి జిల్లాలో రాజవొమ్మంగిలోని తన 10 ఎకరాల పొలం, ఇంటి స్థలాన్ని గత వైసీపీ ప్రభుత్వ అండతో కబ్జా చేశారని, విచారణ జరిపించి తగిన న్యాయం చేయాలని రాపర్తి మాణిక్యాలరావు కోరారు. భర్త చనిపోయిన తనకు వితంతు పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని గుంటూరుకు చెందిన కె.ప్రశాంతి విజ్ఞప్తి చేశారు. ప్రకాశం జిల్లా నాగిరెడ్డిపాలెంలో వంశపారంపర్యంగా వచ్చిన తన 1.12 ఎకరాల భూమిని గత ప్రభుత్వ అండతో కబ్జా చేశారని, తగిన న్యాయం చేయాలని గుమ్మళ్ల బ్రహ్మయ్య కోరారు. విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన ట్రాన్స్‌పోర్ట్ విభాగంలో 22 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న తమకు డ్రైవర్లు, కండక్టర్లు, క్లీనర్ల పోస్టుల్లో ప్రాధాన్యత కల్పించాలని సిబ్బంది విజ్ఞప్తి చేశారు. ప్రకాశం జిల్లా, మార్కాపురం మండలం అయినముక్కల గ్రామంలో 11 మంది కలిసి కొనుగోలు చేసిన 78.71 ఎకరాలను గత ప్రభుత్వ అండతో వైకాపా నాయకులు కబ్జా చేశారని, విచారణ జరిపించి తగిన న్యాయం చేయాలని పల్నాడు జిల్లా ఓబులేసునిపల్లెకు చెందిన మాగులూరి నారయ్య కోరారు. బుడగ జంగాలను ఎస్సీ జాబితాలో తిరిగి చేర్చేందుకు చర్యలు చేపట్టాలని బుడగ జంగం సంక్షేమ సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వ్యవసాయ మార్కెట్ లో అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేసిన తమను గత వైకాపా ప్రభుత్వం తొలగించిందని, తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సిబ్బంది కోరారు. ఆయా సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.