అమరావతి (చైతన్యరథం): తిరుమల శ్రీవారి సన్నిధిలో వైకుంఠ ఏకాదశిని అత్యంత పవిత్రంగా, అద్భుతంగా నిర్వహించిన టీటీడీకి, జిల్లా యంత్రాంగానికి సీఎం చంద్రబాబు అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్‌లో ముఖ్యమంత్రి పోస్ట్ చేశారు. డిసెంబర్ 30 తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు కల్పించిన ఉత్తర ద్వార దర్శనంలో 97 శాతం మంది సామాన్య భక్తులే దర్శనం చేసుకోవడం అభినందనీయం. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే ఉత్తర ద్వార దర్శనంలో 7.83 లక్షల మందికి దర్శనం కల్పించడం ద్వారా శ్రీవారి అనుగ్రహానికి వారిని పాత్రులను చేశారు. క్యూలైన్ల మానిటరింగ్, అన్నప్రసాదం అందించడం నుంచి భక్తులకు కల్పించే ప్రతి సౌకర్యంలో తీసుకున్న జాగ్రత్తలు, అమలు చేసిన విధానాలు మంచి ఫలితాలు ఇచ్చాయి. శ్రీవారి భక్తులు సంతృప్తి చెందేలా వైకుంఠ ఏకాదశిని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. తిరుమల పుణ్యక్షత్రం పవిత్రతను కాపాడుకునేందుకు భక్తులు కూడా కలిసి రావాలని కోరుతున్నానన్నారు.













