- భారతీయుల గుండెల్లో వాజ్ పేయి చిరస్థాయిగా నిలుస్తారు
- ఎన్టీఆర్, వాజ్ పేయి ఎప్పుడూ గుర్తుండేలా స్మృతివనాల అభివృద్ధి
- సంపద సృష్టి పీపీపీ ద్వారానే సాధ్యమని 30 ఏళ్లుగా నిరూపితం
- పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మిస్తే జైల్లో వేస్తామనే వారిని ఏమనాలి.?
- ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా అభివృద్ధి యాత్ర ఆగదు
- వాజ్ పేయిలాంటి మహోన్నతులతో రాజకీయం చేశాను…
- ఇప్పుడు చిల్లర వ్యక్తులతో చేయాల్సి వస్తోంది: సీఎం చంద్రబాబు
- రాజధానిలో వాజ్ పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం, కేంద్రమంత్రి చౌహాన్
- వాజ్ పేయి చిత్రంతో కూడిన పోస్టల్ స్టాంప్ ఆవిష్కరణ
అమరావతి (చైతన్య రథం): మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ ప్రవేశపెట్టిన సంస్కరణలే అభివృద్ధికి కేంద్ర బిందువుగా మారాయని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. దేశానికి వాజ్పేయి: సుపరిపాలన పరిచయం చేశారని కొనియాడారు. అమరావతి రాజధానిలోని వెంకటపాలెంలో వాజ్ పేయి విగ్రహావిష్కరణలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిసి పాల్గొన్నారు. అనంతరం వాజ్ పేయి జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన సుపరిపాలన దినోత్సవం బహిరంగ సభలో ప్రసంగించారు. అంతకుముందు సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు.
వాజ్ పేయి గుర్తుండేలా స్మృతివనం
డిసెంబర్ 25 ఒక చారిత్రాత్మక రోజు అని, యుగపురుషుడు వాజ్పేయి పుట్టిన రోజని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ‘వాజ్పేయి శత జయంతిని దేవతల రాజధాని ప్రజా రాజధానిలో నిర్వహించుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉండేలా రాజధాని నిర్మిస్తున్నాం. ఇందుకుసహకరిస్తోన్న రైతులను అభినందిస్తున్నా. ఒక్క రూపాయి తీసుకోకుండా రాజధానికి 34 వేల ఎకరాల భూమినిచ్చిన రైతులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. దేశం గర్వించే నేత, అరుదైన నాయకుడు వాజ్పేయ్. వాజ్పేయి శత జయంతి ఉత్సవాలకు రాజధానిలో ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ కోరారు. చరిత్ర గుర్తుంచుకునేలా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పాం. ఈనెల 11 నుంచి అటల్ మోదీ సుపరిపాలన యాత్రను బీజేపీ చేపట్టింది. 26 జిల్లా కేంద్రాల్లో వాజ్పేయ్ విగ్రహాలు ఏర్పాటు చేశారు. మూడు పార్టీల నేతలంతా కలిసి అటల్ మోదీ సుపరిపాలన యాత్రను విజయవంతం చేశారు. ఆయన చరిత్ర, చేసిన మంచి పనులు ప్రజలకు గుర్తుండేలా స్మృతివనం ఏర్పాటు చేస్తాం’ అని సీఎం ప్రకటించారు.
నాకు నిత్య స్ఫూర్తి ఎన్టీఆర్
తనకు నిత్యం స్ఫూర్తినిచ్చే నేత ఎన్టీఆర్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దేశంలో కాంగ్రెస్ వ్యతిరేక భావజాలనికి బీజం వేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. ‘ఎన్టీఆర్, వాజ్పేయి చాలా చనువుగా ఉండేవారు. 1984లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని ఇందిరాగాంధీ రద్దు చేస్తే అద్వానీ, వాజ్పేయి ఎన్టీఆర్ను ముందుకు నడిపించారు. నేషనల్ ఫ్రంట్ ద్వారా యాంటీ కాంగ్రెస్కు బీజం వేసి ప్రభుత్వాన్ని కూడా ఎన్టీఆర్ ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్, వాజ్పేయి ప్రజలకు ఎప్పుడూ గుర్తుండేలా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతాం’ అని చంద్రబాబు వెల్లడించారు.
దేశ ప్రగతికి వాజ్ పేయి గట్టి పునాదులు
‘నేను చాలామంది నేతలను దగ్గరగా చూశాను. నాడు వాజ్పేయ్, నేడు ప్రధాని మోదీ విశిష్ట లక్షణాలు, చరిత్ర తిరగరాసే నాయకత్వం ఉన్నవారు. వాజ్పేయి మధ్యప్రదేశ్లో సాధారణ కుటుంబంలో జన్మించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. జన్సంగ్, బీజేపీనుంచి 10సార్లు లోక్సభకు, 2సార్లు రాజ్యసభకు ఎంపికయ్యారు. వాజ్పేయి తెలివైన నాయకుడే కాదు.. అద్భుత కవి.. మానవతా వాది. నాతో చాలా సన్నిహితంగా ఉంటారు. నేను ఆయన ఆలోచనలు తెలిసిన వ్యక్తిని. దేశ ప్రగతికి గట్టి పునాదులు వేశారు. నేడు జాతీయ రహదారులపై తిరుగుతున్నామంటే దానికి ఆయన చొరవే కారణం. మనదేశంలో రోడ్లు గతంలో అధ్వాన్నంగా ఉండేవి. నేను చిన్నదేశమైన మలేషియాకు వెళ్లి అక్కడున్న 8 వరుసల రహదారులను చూసి వాజ్పేయ్క వివరించాను.
ఇంతపెద్ద దేశంలోనే మనం మంచి రోడ్డు వేయలేకపోతున్నామని ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో మొదటి సారి చెన్నై- తడకు జాతీయ రహదారి నిర్మించారు. నాలెడ్జ్ ఎకానమీకి వెన్నెముక టెలికామ్ సెక్టార్లో డీరెగ్యులేషన్ ప్రారంభించి ప్రగతికి పునాది వేశారు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ 4జీ రివల్యూషన్తో ముందుకు దూసుకెళ్తున్నారు. పీపీపీ విధానంలో దేశం అభివృద్ధి అవుతుంది. ఏ దేశంకంటే మనం తక్కువ కాదని చెప్పి ఆచరణలో పెట్టిన వ్యక్తి వాజ్పేయ్. రోడ్లు, ఎయిర్పోర్టులు వంటి వివిధ ప్రాజెక్టులు తీసుకొచ్చారు. హైదరాబాద్లో గతంలో చిన్న ఎయిర్ పోర్టు ఉండేది. పెద్దగా విమానాలు వచ్చేవి కావు. విమానాశ్రయం అభివృద్ధి కోసం వాజ్పేయిని కలిసిన వెంటనే ఓపెన్ స్కై పాలసీ తీసుకొచ్చారు. హైదరాబాద్కు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు వచ్చిందంటే దానికి కారణం వాజ్పేయి. ఓపెన్ స్కై పాలసీ, నగరాల మధ్య రహదారులులాంటి వివిధ సంస్కరణలు దేశ ప్రగతికి కీలక బిందువుగా నిలిచాయి’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
అబ్దుల్ కలాం, వాజిపేయి భారతరత్నాలు
అణు పరీక్షలు చేస్తే దేశానికి నిధులు ఇవ్వమని అప్పట్లోనే అమెరికా స్పష్టం చేసినా వెరవకుండా అణుపరీక్షలు నిర్వహించారు. 1999 లో 36మంది ఏపీనుంచి ఎంపీలయ్యారు. 29మంది టీడీపీ, ఏడుగురు బీజేపీనుంచి గెలిచి వాజ్పేయికి అండగా నిలిచారు. నాటి కార్గిల్ యుద్ధం, నేటి సింధూర్ చరిత్రలో నిలుస్తాయి. మన దేశం జోలికి వస్తే…. మన శక్తి ఏంటో ప్రపంచానికి చూపిన నేతలు వాజ్పేయి, మోదీ. దేశంలో అణువిద్యుత్కు అబ్దుల్ కలాం శ్రీకారం చుట్టూరు. అబ్దుల్ కలాంను రాష్ట్రపతిగా వాజ్పేయి ఎంపిక చేశారు. అందులో నేను కూడా భాగస్వామిగా ఉండడం నా అదృష్టం. అబ్దుల్ కలాం, వాజ్పేయి భారత రత్నాలు, కొందరు నాయకులు స్ఫూర్తినిస్తారు. మరి కొంతమంది దేశం కోసం బతుకుతారు… దేశం కోసమే ఆలోచిస్తారు. వంద ఏళ్ల తర్వాత కూడా వాజ్పేయిని స్మరించుంటున్నామంటే అదీ ఆయన గొప్పతనం. భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా వాజ్పేయి ఉంటారు. సుపరిపాలన ఆయన చూపిన మార్గం’ అని సీఎం చంద్రబాబు వివరించారు.
హైటెక్ సిటీతో సైబరాబాద్..
క్వాంటం వ్యాలీతో అమరావతి ప్రారంభం
‘మోదీ వచ్చాక 11వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ 4వ స్థానికి వచ్చింది. త్వరలోనే 3వ స్థానానికి వస్తాం. 2047నాటికి మన దేశం ప్రపంచంలో నెంబర్ 1గా తయారవుతుంది. ఆ సత్తా, శక్తి నరేంద్ర -మోదీకి ఉంది. తెలుగువారిని అగ్రభాగాన నిలబెట్టే బాధ్యత తీసుకుంటా. ప్రపంచంలో భారతీయలు నెంబర్ 1గా ఉంటారు. భారతీయుల్లో తెలుగువారు నెంబర్ 1గా ఉంటారు. శివరాజ్ సింగ్ చౌహాన్ సీఎంగా చేశారు. ప్రజల కోసం ఆయన బతికారు. ఆలోచించారు. ఏ పదవిలో ఉన్నా వన్నె తెస్తారు. ఏ ఎన్నికల్లోనూ ఓడిపోలేదు. ఎప్పుడూ ప్రజల మనిషిగా ప్రజల హృదయాల్లో నిలవాలని పని చేస్తున్నారు.ఇటువంటి నాయకులతో పని చేయడం ఆనందంగా ఉంది. రాజధాని నిర్మాణ పనుల్లో వేగం పెంచాం. ఇంకా గేరు మార్చుతాం. గతంలో హైదరాబాద్లో హైటెక్ సిటీ భవనాలను వాజ్ పేయి ప్రారంభించారు. హైటెక్ సిటీతో సైబరాబాద్ ప్రారంభమైంది. క్వాంటమ్ వ్యాలీతో అమరావతిప్రారంభమవుతోంది” అని చంద్రబాబు స్పష్టం చేశారు.
మెడికల్ కాలేజీలు కట్టేవారిని జైల్లో పెడతారా.?
“అమరావతి, పోలవరం, హైవేలువంటి కీలక ప్రాజెక్టులకు మోదీ, కేంద్రం సహకరిస్తోంది. రాష్ట్రం మొన్నటి వరకు వెంటిలేటర్పై ఉంది. ఇప్పుడు నిలదొక్కుకుని ముందుకెళ్తుంది. వాజ్పేయి చేసిన అభృద్ధి, చూపిన దారి అందరికీ స్ఫూర్తి. పీపీపీ విధానం గురించి తెలియని వారు ప్రైవేట్పరం అంటూ మాట్లాడుతున్నారు. కేంద్రం కూడా పీపీపీ విధానంపై స్పష్టంగా ఉంది. మెరుగైన సేవలు, ఉద్యోగాలు కల్పించాలంటే పీపీపీ విధానం బెస్ట్ అని చెప్తోంది. పీపీపీ పద్ధతిలో చేపట్టే మెడికల్ కాలేజీల నిర్మాణానికి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా ఆర్థిక మద్దతు కూడా ఇస్తున్నాం. పీపీపీ విధానంలో రోడ్డు వేస్తే, ఎయిర్ పోర్టు కడితే ప్రయివేట్ వ్యక్తులకు చెందదు. ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటుంది.
నియమాల ప్రకారం కొన్ని సంవత్సరాలు నిర్వహించి ప్రభుత్వాలకు అప్పగిస్తారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు కడితే జైల్లో పెడతామని బెదిరిస్తున్నారు. అభివృద్ధి చేసే వారిని జైల్లో పెడతామనే వారిని ఏమనాలో ప్రజలే ఆలోచించుకోవాలి. 2047నాటికి మనదేశం ప్రపంచలో నెంబర్ 1గా ఉండాలంటే… దానికి ఏపీ ట్రెండ్ సెట్టర్గా ఉండాలని నేను ఆలోచన చేస్తున్నా. అలాంటి నేను రాష్ట్రంలోని అభివృద్ధి వ్యతిరేకులతో రాజకీయం చేయాల్సి వస్తోంది. నాడు. వాజ్పేయితో కలిసి రాజకీయం చేశాను, కానీ నేడు చిల్లర వ్యక్తులతో రాజకీయాలు చేస్తున్నందుకు బాధగా ఉంది. ఎవరెన్ని చెప్పినా, అడ్డంకులు సృష్టించిన అభివృద్ధి ఆగదు. హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీని అందించేందుకు ఎన్టీఆర్, వాజ్ పేయ్ స్పూర్తితో ముందుకెళ్తా’ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.














