అమరావతి: వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ జనసేన పార్టీలో చేరారు. బుధవారం జనసేనాని పవన్ కల్యాణ్ చేతుల మీదుగా వంశీ కృష్ణ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ.. వైసీపీలో చేరకముందే నేను పవన్ కల్యాణ్‌కు అభిమానిని. పవన్ ఆలోచనలు నచ్చి నేడు జనసేనలో చేరాను. నేను నా సొంత పార్టీలోకి వచ్చాననే ఆనందం ఉంది. గతంలో ప్రజారాజ్యంలో నేను పని చేశాను. యువరాజ్యం జిల్లా అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్‌తో నాడు తిరిగాను. పవన్ కళ్యాణ్ అంటే అభిమానం నేటికీ ఉంది. నేను వైసీపీకి రాజీనామా చేసి, జనసేనలో చేరాను. గతంలో వైసీపీ అభివృద్ది కోసం నేను కష్టపడ్డాను. ఇప్పుడు జనసేన కోసం అదే అంకితభావంతో పని చేస్తాను. అందరినీ కలుపుకుని ముందుకు సాగుతాను. కొన్ని శక్తులు, కొన్ని కారణాల వల్ల వైసీపీని వీడుతున్నాను. నాకు ధైర్యంగా ఉంటూ నాతో నడిచి వస్తున్న వారందరికీ నా కృతజ్ఞతలు. ఇంకా చాలా మంది జనసేనతో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నారు. త్వరలోనే వారంతా అధికారికంగా పార్టీలోకి వస్తారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్‌తో కలిసి నడుస్తాను. తప్పకుండా జనసేనకు అద్భుతమైన ప్రజాదరణను అందరూ చూస్తారు’’ అని వంశీ కృష్ణ పేర్కొన్నారు.
ఉత్తరాంధ్రలో బలమైన నాయకుడు వంశీకృష్ణ యాదవ్‌తో 2009 నుంచి తనకు పరిచయం ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌అన్నారు. యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి యంగ్ లీడర్‌గా పని చేయడం చూశానన్నారు. మళ్లీ 2023లో ఎమ్మెల్సీగా ఉంటూ జనసేనలో చేరిన వంశీకృష్ణను మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. యువరాజ్యంలో ఉన్న వ్యక్తులు నేడు చాలా మంది కీలక వ్యక్తులుగా మారారన్నారు. వంశీకృష్ణ తన సొంత ఇంటికి వచ్చినట్లుగా ఉందని చెప్పడం ఆనందం కలిగించిందన్నారు. వైసీపీ పాలన గురించి కాకుండా జనసేన సిద్దాంతాలను నచ్చి వచ్చానని తెలిపారన్నారు. పార్టీ పరంగా అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పారు.
ఒక నియోజకవర్గానికే పరిమితం కాకుండా.. రాష్ట్ర నాయకుడిగా వంశీ ఎదగాలన్నారు. మంచి భవిష్యత్ ఇచ్చేలా నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ వ్యవహారం మొత్తం ఒక క్రమంలో నడిపిన పీఏసీ ఛైర్మన్ మనోహర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఏపీ భవిష్యత్‌ను నిర్దేశించే ఎన్నికలు త్వరలో రాబోతున్నాయన్నారు.
జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ సమక్షంలో వంశీ ఈరోజు జనసేనలో చేరారని తెలిపారు. సమాజానికి ఉపయోగపడే విధంగా కింది స్థాయి నుంచి ఎమ్మెల్సీ స్థాయికి వంశీకృష్ణ ఎదిగారన్నారు. మూడు నెలల నుంచి స్థానిక సమస్యలు, ప్రజా సమస్యలపై స్పందించలేకపోతున్నామనే ఆవేదన ఉందన్నారు. పవన్ కళ్యాణ్‌తో కలిసి పని చేయాలనే నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. జనసేనలో చేరేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారన్నారు. విశాఖలో వైసీపీ కోసం వంశీకృష్ణ అహర్నిశలు పని చేశారని.. ఏడు సార్లు నగర అధ్యక్షుడిగా ఉన్న వంశీకృష్ణ జనసేనలోకి రావడాన్ని స్వాగతిస్తున్నామని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.