వెన్నుపోటుతో చంద్రబాబు అధికారానికి వచ్చారని వర్ధెల్లి మురళి రాయడం దుర్మార్గం. ఎన్నికైన మెజారిటీ శాసనసభ్యులు ప్రజాస్వామ్యబద్ధంగా చంద్రబాబును ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ప్రభుత్వం దుష్టశక్తి బారిన పడకుండా ఉండేందుకు ఎన్‌టిఆర్ కన్నబిడ్డలందరూ ఏకంగా చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి మద్దతునిచ్చారు. తదనంతరం జరిగిన ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబును గెలిపించి తిరిగి ముఖ్యమంత్రిని చేశారు. ఇంత ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సీఎంగారికి వెన్నుపోటు ఆపాదించడం దుర్మార్గం కాక మరేమిటి?
వెన్నుపోటు.. గొడ్డలిపోటు జగన్ కుటుంబ వారసత్వం. చేనేత వర్గానికి చెందిన మంగంపేట బెరైటీస్ గని యజమాని జింకా వెంకట నరసయ్య.. రాజారెడ్డికి చోటిచ్చాడనే కృతజ్ఞత లేకుండా చంపి తన గనిని దురాక్రమణ చేయడం నిజమైన వెన్నుపోటు. బీసీ శవంతోనే వైఎస్ కుటుంబ వైభవం ప్రారంభమైంది. రెడ్డి కాంగ్రెస్‌లో ఎంఎల్‌ఏగా గెలిచిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. కాళ్ల పారాణి ఆరకముందే పార్టీ ఫిరాయించి ఇందిరా కాంగ్రెస్‌లో చేరడం వెన్నుపోటు కాదా? కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని లక్ష కోట్లు కొట్టేసిన జగన్ చివరకు కాంగ్రెస్ పార్టీని చీల్చడం నిజమైన వెన్నుపోటు. చిన్నాన్నను క్రూరాతిక్రూరంగా గొడ్డలిపోటుతో నరికి చంపిన హంతకుల్ని కాపాడడం నిజమైన వెన్నుపోటు. ఇలాంటివి ఎన్నెన్నో తమ వెన్నుపోట్లును చంద్రబాబుకు అంటగట్టి చెప్పిన అబద్ధమే వందసార్లు చెప్పడం, చెప్పించడం జగన్ నైజం. వర్ధెల్లి మురళి చంద్రబాబు వ్యక్తిత్వాన్ని టార్గెట్ చేసి ఆయనపై అబద్దాలు రాస్తే, నేను జగన్‌ను టార్గెట్ చేసి నిజాల్ని రాస్తాను. ఈ అక్షర యుద్ధంలో నిజందే పైచేయిగా మారి అంతిమంగా నష్టపోయేది జగనే. కనుక చంద్రబాబు వ్యక్తిత్వ హనన రాతల్ని వర్ధెల్లి మురళి మానుకోకపోతే ఆయన జగన్ ఇమేజ్‌ను డామేజ్ చేయడమే అవుతుంది. మురళి నిజమైన మేధావి అయితే శీలహనన రాజకీయాలు పక్కనపెట్టి వైసీపీ సిద్ధాంతం, ఆచరణ, అలాగే టీడీపీ సిద్ధాంతం, ఆచరణపై సైద్ధాంతిక పోరాటానికి రావాలి. అలాకాకుండా శీలహనన రాతేలే కొనసాగిస్తానంటే విధిలేని పరిస్థితుల్లో మేమూ ఎవరి శీలమేమిటో ప్రజలకు చెప్పాల్సివస్తుంది.
సూపర్ సిక్స్, పాలనా వైఫల్యం చెందారనే మురళి ఆరోపణ పచ్చి అబద్ధం. భారీగా పింఛన్ల పెంపుతో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. బోగస్ పింఛన్లు తొలగించి నిజమైన పేదలకు పింఛన్లు ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఉచిత గ్యాస్‌తో మహిళలు సంతోషంగా ఉన్నారు. ధాన్య సేకరణ, విపత్తు సహాయం, నీటి నిర్వహణతో రైతులు సంతోషంగా ఉన్నారు. పెద్దఎత్తున జరుగుతున్న ఉపాధి హామీ పనుల్లో కూలీలు సంతోషంగా ఉన్నారు. రోడ్ల నిర్మాణాలతో ప్రయాణీకులు సంతోషంగా ఉన్నారు. ఒకటవ తేదీనే జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులు పెన్షన్లు పొందుతూ వారూ సంతోషంగా ఉన్నారు. సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించనందున ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలూ సంతోషంగా ఉన్నారు. డిఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ నియామకాలు, 6,100 పోలీస్ నియామకాలు చేస్తున్న చర్యల పట్ల యువత సంతోషంగా ఉన్నారు. ప్రత్యేకించి ఆరు నెలల్లోనే నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించి పరిశ్రమలు, పోలవరం, అమరావతి నిర్మాణాలు న భూతో న భవిష్యతి అనే చందంగా జరుగుతున్నవి. ఇలా ఆరు నెలల్లోనే 400కు పైగా పనులు జరిగి.. కూటమి ప్రభుత్వం రికార్డు సాధించింది. రాష్ట్రంలో కక్ష సాధింపులు లేవు. కనుకనే జగన్ పర్యటనలు, వైకాపా ధర్నాలు చేయగలుగుతున్నారు. అదే జగన్ పాలనలో చంద్రబాబు, లోకేష్ పర్యటనలపై దాడులు చేశారు. ప్రతిపక్షాలు, ఉద్యోగుల ధర్నాలు అంటే గృహ నిర్బంధాలు, అక్రమ కేసులు పెట్టారు.
తానే పెంచి తానే చేసిన విద్యుత్ ధర్నాలలో పది లక్షలమందికి పైగా పాల్గొన్నారనేది పచ్చి అబద్ధం. ఆ ధర్నాలలో వైసీపీ కార్యకర్తలు 170 నియోజకవర్గాలలో సుమారు 50 మందిలోపే పాల్గొన్నారు గాని ప్రజలు పాల్గొనలేదు. అధికారం ఉన్నప్పుడు లాండ్, శాండ్, వైన్, మైన్, గంజాయి, డ్రగ్స్, రేషన్ బియ్యం, ఎర్రచందనంలో విచ్చలవిడిగా దోచుకున్నారు. వీరు ఇప్పుడు జగన్ పర్యటనల్లో హడావుడి చేస్తున్నారు. ప్రజలుగాని, పద్ధతిగా ఉన్న వైసీపీ వారు పాల్గొనడంలేదు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి పర్యటనలకు ప్రజలు స్వచ్ఛదంగా వస్తున్నారు. ఆత్మస్తుతి.. పరనింద ప్రచారాలు మానుకొని ఓటమిపై ఆత్మవిమర్శ చేసుకోకపోతే వైసీపీకి మనుగడ ఉండదు.