- ప్రకృతి సంపద దోచుకున్న నువ్వు, నాపై 10కోట్ల పరువు నష్టం దావా వేస్తావా?
- ముఖ్యమంత్రికి, మంత్రులకే పరువు లేదు, నీకు నేను క్షమాపణ చెప్పాలా?
- ధైర్యం ఉంటే అడ్వకేట్ కమిషన్ వేయించాలి
మైలవరం (చైతన్యరథం): వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కు దమ్ము, ధైర్యం ఉంటే అడ్వకేట్ కమిషన్ వేయించాలి.. ప్రకృతి సంపద దోచుకున్న నువ్వు కూడా నాపై రూ.10 కోట్లకు పరువు నష్టం దావా వేయడమా.. వైసీపీ పాలనలో ముఖ్యమంత్రి, మంత్రికే పరువు లేదు. అలాటింది నేను… నీకు క్షమాపణ చెప్పాలా అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. ఏం చేసుకుంటావో చేసుకో… నీ అవినీతిపై కోర్టులోనే తెల్చుకుంటానని మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్‌కు సవాల్ విసిరారు. వైసీపీ ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ తనకు పంపిన లీగల్ నోటీసులపై మంగళవారం మైలవరం నియోజకవర్గంలోని పార్టీ కార్యాలయంలో దేవినేని ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ నియోజకవర్గంలోని చేయని అవినీతి లేదని, ప్రకృతిలోని పంచభూతాలతో పాటు… థర్మల్ పవర్ స్టేషన్ నుంచి వచ్చే బూడిదను సైతం దొంగిలించి అమ్ముకున్న నీచ చరిత్ర ఆయనది అని దేవినేని ఉమా ధ్వజమెత్తారు. అక్రమంగా సంపాదించిన డబ్బు కోసం ముఖ్యమంత్రి కార్యాలయం చుట్టూ తిరగడమే పనిగాపెట్టుకున్నారని… ఒక ప్రజాప్రతినిధిగా అభివృద్ధి కోసం కాక… కాంట్రాక్టుల బిల్లుల కోసం సీఎంవో చుట్టూ తిరగడం నియోజకవర్గం ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమన్నారు. దోచుకున్న సొమ్ముతో ప్రశ్నించిన వారిపై దాడులు చేయించడం వసంతకు పరిపాటిగా మారిందని, కొండపల్లి అడవిలో కృష్ణ ప్రసాద్ చేసిన దోపిడీకి అధికారులు బలైయ్యారని అన్నారు. ఇసుక దోపిడీని ప్రశ్నించిన గంటా నవీన్ అనే విలేఖరిని అనుచరులతో చంపించారని, వసంత కుటుంబం మొత్తం ఏ రోజు ఏ పార్టీలో ఉంటారో వారికే తెలియదన్నారు. అవసరాన్ని బట్టి రంగులు మార్చే వారు కూడా తమపై పరువునష్టం కేసులు వేయడం బాధాకరమన్నారు. వాటాల్లో తేడా రావడంతో అనేక సార్లు తాడేపల్లి ప్యాలెస్‌లో కృష్ణ ప్రసాద్ కళ్ల జోళ్లు పలిగిపోయిన మాట వాస్తవం కాదా? అయినా సిగ్గులేకుండా మరోసారి ఎమ్మెల్యే టిక్కెట్ కోసం జగన్ కాళ్ల దగ్గర కాపాలా కాస్తున్నాడని అన్నారు. పొదిలి రవి అనే నీ బంధువుని బినామీ ఆస్తుల కోసం చంపలేదా? గత ఎన్నికల్లో పది రూపాయాల నోట్లు చించి ఎన్నికల సమయంలో డబ్బు పంపిణీ చేసింది నిజం కాదా? ఇలా చెప్పలేని, రాయలేని ఘోరాలకు పాల్పడిన వసంత కృష్ణ ప్రసాద్… నాపై పరువు నష్టం కేసులు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. వసంత పాపాలన్నింటికి లెక్కగట్టి బదులు తీర్చుకునే సమయం ఆసన్నమైందని, వచ్చే ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గం నుంచి ప్రజలే తరిమికొట్టడం ఖాయమని దేవినేని ఉమా పేర్కొన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేసిన అవినీతిని కక్కిస్తామని, రాబోయే రోజల్లో శిక్ష అనుభవించక తప్పదని దేవినేని ఉమామహేశ్వరరావు హెచ్చరించారు.