- తక్షణం బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ పదవినుంచి తప్పించాలి
- మద్యం కుంభకోణంలో ఆయనదే కీలకపాత్ర
- ఎన్నికల కోసం పెద్దఎత్తున మద్యం నిల్వ చేసిన వైకాపా నాయకులు
- దాడులు చేసి సీజ్ చేయండి ` సీఈఓకు అచ్చెన్నాయుడు లేఖ
అమరావతి (చైతన్యరథం): మద్యం మాఫియాతో సంబంధాలున్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొ రేషన్ మేనేజింగ్ డైరెక్టర్ డీ వాసుదేవరెడ్డిని తక్షణం బదిలీ చేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ)కి సోమవారం అచ్చెన్నాయుడు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ఉత్పత్తి చేస్తున్న డిస్టిలరీలు ఎక్కువ శాతం అధికారపార్టీ నాయకుల ఆధీనంలో ఉన్నాయి. మద్యం ఉత్పత్తి నుంచి అమ్మకాల వరకు మొత్తం ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో ఓటర్లకు మద్యం పంపిణీ చేసేందుకు అధికార వైకాపా నాయకులు ఇప్పటికే పెద్దఎత్తున నిల్వలు పెట్టుకున్నారు.
ఇందుకు ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్, ఎక్సైజ్ శాఖ, పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం సహకరిస్తున్నాయి. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మద్యం అమ్మకాలు చేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు సైతం వైకాపాకి చెందిన కార్యకర్తలే. వైకాపా మీటింగులకు ప్రజలను ప్రలోభపెట్టి తీసుకెళ్లేందుకు అధికార పార్టీ నాయకులు ఇప్పటికే పెద్దఎత్తున మద్యం పంపిణీ చేస్తున్నారు. తెలంగాణకు చెందిన ఐ.ఆర్.టి.ఎస్ అధికారి డీ వాసుదేవ రెడ్డికి రాష్ట్రంలోని అధికారపార్టీ మద్యం మాఫియాతో దగ్గర సంబంధాలు ఉన్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న మద్యం కుంభకోణంలోను ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు.
కావున రానున్న ఎన్నికలు ప్రశాతంగా జరగాలంటే మద్యం మాఫియాతో సంబంధాలున్న వాసుదేవరెడ్డిని తక్షణం బదిలీ చేయాలి. రాష్ట్రంలో జరుగుతున్న మద్యం అమ్మకాలపై, రవాణపై నిఘా పెట్టాలి. మద్యం ఉత్పత్తి చేస్తున్న డిస్టిలరీలలో సైతం ప్రత్యేక అధికారులను పెట్టి పర్యవేక్షణ జరపాలి. అధికార పార్టీ నాయకులు ఇప్పటికే గోడౌన్‌లలో దాచిపెట్టిన మద్యం నిల్వలపై దాడులు చేసి సీజ్ చేయాలని లేఖలో అచ్చెన్నాయుడు కోరారు.