- భద్రతా సిబ్బందికి చంద్రబాబు ఆదేశం
- భద్రత పేరుతో సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు
- కాన్వాయ్ దగ్గరికి వచ్చినపుడు కొద్దిసేపు వాహనాలు నియంత్రిస్తే చాలు
అమరావతి(చైతన్యరథం): భద్రత పేరుతో సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని అధికారులకు టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు. చంద్రబాబు గురువారం రాత్రి ఢల్లీి వెళ్లేందుకు ఉండవల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరగా, కాన్వాయ్ వెళ్తున్న క్రమంలో సాధారణ ప్రజల వాహనాలను పోలీసులు నిలిపివేశారు. దీనిని గమనించిన చంద్రబాబు.. భద్రతా సిబ్బందికి కొన్ని సూచనలు చేశారు. కరకట్టపైనా, కాన్వాయ్ వెళ్తున్న ప్రాంతంలో ఎక్కువ సమయం ట్రాఫిక్ ఆపొద్దని భద్రతా సిబ్బందిని ఆదేశించారు. వీఐపీ సెక్యూరిటీ పేరుతో కాన్వాయ్ వెళ్లే దారిలో గంటల తరబడి వాహనాలు నిలిపేసే విధానాలకు స్వస్తి పలకాలన్నారు.
తక్షణమే సంబంధిత అధికారులకు ఈ మేరకు సమాచారం ఇవ్వాలని తన ముఖ్య భద్రతాధికారి (సీఎస్‌ఓ)ని చంద్రబాబు ఆదేశించారు. చంద్రబాబు కాన్వాయ్ ఉండవల్లి నివాసం నుండి ఎయిర్ పోర్టుకు వెళ్లేలోపులోనే గుంటూరు ఎస్పీ, విజయవాడ సీపీలకు చంద్రబాబు భద్రతా సిబ్బంది సమాచారం ఇచ్చారు. కాన్వాయ్ సమీప ప్రాంతానికి వచ్చినప్పుడు అతి తక్కువ సమయం మాత్రమే పౌరుల వాహనాలు నియంత్రించి, వాహనదారులు ఇబ్బంది పడకుండా చూడాలన్న చంద్రబాబు సూచనను ఉన్నతాధికారులకు సీఎస్‌ఓ తెలియజేశారు. భవిష్యత్తులో కూడా సామాన్య ప్రజలకు, వాహన దారులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని చంద్రబాబు సూచించారు.