- సీఎం చంద్రబాబుకు వినతుల వెల్లువ
- టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ముఖ్యమంత్రి
అమరావతి(చైతన్యరథం): గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతల బాధితులు పలువురు తమకు న్యాయం చేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును వేడుకున్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం సాయంత్రం ప్రజల నుండి వినతులు స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారినుంచి వినతులు స్వీకరించిన సీఎం సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. పలువురు అభాగ్యులకు అభయం ఇవ్వడంతో పాటు ఆర్థిక సాయం కూడా అందించారు. పలువురు వైసీపీ బాధితులు తమ సమస్యలను సీఎం చంద్రబాబు కు తెలిపి సాయం కోరారు.
తమ పొలాన్ని వైసీపీ నేతలు ఆక్రమించుకున్నారని, తనకు న్యాయం చేయాలని సీఎంకు కడప జిల్లా, కొట్టాల గ్రామానికి చెందిన బత్తుల కృష్ణయ్య ఫిర్యాదు చేశాడు. తాను పొలంలోకి అడుగు పెడితే చంపేస్తామని వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని, తన పొలం తిరిగి తనకు వచ్చేలా చేయాలని కృష్ణయ్య కోరారు. తనకున్న రెండు సెంట్లు స్థలాన్ని వైసీపీ అండతో కొంతమంది ఆక్రమించుకున్నారని కాకినాడ రూరల్ మండలం, కరపకు చెందిన దారపు మణికుమారి అనే మహిళ.. సీఎంకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ప్రత్యక్షంగా 10,500 మంది, పరోక్షంగా 5,000 కుటుంబాలకు ఉపాధి కలిగించే మీ సేవా కేంద్రాలను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మీ – సేవా ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోషియేషన్ సభ్యులు.. సీఎంకు వివరించారు. మీ సేవా కేంద్రాలకు మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలని సీఎంను కోరారు. గొల్లపూడికి చెందిన కొల్లా వెంకట్ అనే వ్యక్తి అన్న క్యాంటీన్‌కు రూ.1 లక్ష విరాళంగా ఇవ్వగా ముఖ్యమంత్రి ఆయనను అభినందించారు.