అమరావతి: నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్-నా రాజధాని అమరావతి అని ఐదుకోట్ల ఆంధ్రులు గర్వంగా నినదించే చారిత్రాత్మకమైన రోజుకు దేశ పార్లమెంటు వేదిక కావడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. లోక్ సభలో అమరావతి బిల్లు ప్రవేశపెట్టినప్పటి నుంచి ఆమోదం పొందేవరకు ఆయన ఉండవల్లి నివాసం టివి చూస్తూ ఎప్పటికప్పుడు పరిణామాలను గమనిస్తూ ఉన్నారు. బిల్లు ఆమోదం పొందాక లోకేష్ స్పందిస్తూ… ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని నినాదంతో అభివృద్ధి వికేంద్రీకరణ విధానంతో రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చేసిన ఏకగ్రీవ తీర్మానానికి చట్టబద్ధత కల్పించే అమరావతి బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టి, ఆమోదించడం కోట్లాది ప్రజలు గర్వించదగ్గ సందర్భం. కేంద్రప్రభుత్వానికి, మద్దతుగా నిలిచిన పార్టీలకు కృతజ్ఞతలు. ఇది ఐదుకోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అమరావతి విజయం .. ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం..ఇది రైతుల త్యాగాలకు దక్కిన దైవ ఆశీస్సులు.. శాంతియుత పోరాటానికి దక్కిన ఫలితం.. కోట్లాది ప్రజల కోరికను గౌరవించిన కేంద్రం ఆంధ్రుల ఆత్మగౌరవ రాజధానిగా చరిత్ర-సంస్కృతికి ఆలవాలమైన అమరావతిని నిలిపింది.
జై ఆంధ్రప్రదేశ్..జయహో అమరావతి… తమ ఆనందాన్ని పంచుకున్నారు. అమరావతి చట్టబద్దత బిల్లుపై పార్లమెంటులో జరిగిన చర్చ మొత్తం టీవీలో చూసిలో చూశానని, అక్కడి చర్చ ఉత్కంఠ రేపిందన్నారు. అమరావతి చరిత్ర-సంస్కృతి, ఆవశ్యకత సభ్యులు వివరిస్తుంటే ఒక ఆంధ్రుడిగా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం, దేశంలోని వివిధ పార్టీలు మద్దతుగా నిలవడం ఐదుకోట్ల ఆంధ్ర ప్రజల ఆకాంక్షకు అద్దం పట్టింది. లోక్ సభ వేదికగా అమరావతి గొప్పతనం దేశమంతటికీ మరోసారి పరిచయమైంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రజాస్వామ్య దేవాలయం పార్లమెంటులో చరిత్ర సృష్టించిన అమరావతి చట్టబద్ధత బిల్లు చర్చలో పాల్గొనకుండా వైసీపీ సభ్యులు వాకౌట్ చేయడం వారి ద్రోహబుద్ధికి నిదర్శనం. జగన్ ఎన్ని జన్మలెత్తినా అమరావతిలో ఒక్క ఇటుకనూ తాకలేడు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధినీ ఆపలేడు. నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ శాశ్వతం, నా రాజధాని అమరావతి అజరామరం అంటూ లోకేష్ తమ ఆనందాన్ని వ్యక్తంచేశారు.














