- వరద విపత్తును సంఘటితంగా ఎదుర్కొన్నాం
- ప్రజలు, అధికారుల సహకారం మరువలేను
- బాధితులు ప్రతి ఒక్కరూ నిలదొక్కుకునేలా చేస్తా
- వ్యవస్థలను చిన్నాభిన్నం చేసిన గత పాలకులు
- వాళ్ల నిర్లక్ష్యానికి ప్రజలు మూల్యం చెల్లించాల్సివచ్చింది
- రాజకీయ నేరగాళ్ల భరతం పడతా..
- బుడమేరు గండ్లు పూడ్చివేతను పరిశీలించిన సీఎం
- మంత్రుల పనితీరుకు ముఖ్యమంత్రి ప్రశంసలు
విజయవాడ (చైతన్య రథం): ప్రజలు, అధికారుల సహకారంతో 10 రోజుల్లో భారీ విపత్తును సమర్థంగా ఎదుర్కొన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పదోరోజు పర్యటించిన ఆయన బుడమేరు గండ్లు పూడ్చిన ప్రదేశాలకు కాలినడకన వెళ్లి పరిశీలించారు. గండ్లు పడిన తీరు, వరద ప్రవాహం గురించి అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తున్నామని, అంతిమంగా ప్రతీ ఒక్కరికీ న్యాయం చేసి.. అంతా నిలదొక్కుకునే విధంగా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ చరిత్రలో రికార్డుస్థాయి వర్షపాతం నమోదైంది. ప్రకృతి కన్నెరజేసిందన్నారు. కృష్ణానదిలో రికార్డుస్థాయిలో 11.43 లక్షల క్యూసెక్కుల వరద రావడం, డ్రెయిన్లు పొంగడం, అదే సమయంలో బుడమేరుకు పెద్దఎత్తున నీరు రావడం.. ఇలా అన్నీ కలిసి ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేశాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ‘మూడు రోజులపాటు ఏంచేయాలో.. ఎలా ఎదుర్కోవాలో అర్థం కాలేదు. గత పాలకులు ఐదేళ్లలో వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేశారు. భ్రష్టు పట్టించారు. గత ఐదేళ్లుగా బుడమేరు ఆక్రమణలకు గురైంది. అక్రమ కట్టడాలకు ఆలవాలమైంది. అక్రమ రిజిస్ట్రేషన్‌లు చేసుకున్నారు. ఇంకా చెప్పాలంటే బుడమేరు పూడుకుపోయే దశకు చేరింది. ఐదేళ్లలో చెత్తాచెదారం తీయకపోవడంవల్ల.. వ్యర్థాలు పేరుకుపోయి నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారాయి. గత ప్రభుత్వం బుడమేరు గట్లను పట్టించుకోకపోవడం వల్ల దాదాపు 6 లక్షల మంది ప్రజల అతలాకుతలమయ్యాయన్నారు. దుర్మార్గ పాలనవల్ల లక్షలాదిమంది కష్టపడే పరిస్థితి వచ్చింది. బుడమేరును కట్టడి చేయకపోవడం వల్ల విజయవాడలో పరిస్థితి ఎలావుందో అందరూ చూశారు.
గండ్లు పడకుండా ఉండివుంటే ఇంతకష్టం ఉండేది కాదు. రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు, జలవనరుల అధికారులు రేయింబవళ్లు కష్టపడి బుడమేరుకు పడిన మూడు గండ్లను పూడ్చారు. ఇప్పటికి కొంత లీకేజీలు ఉన్నాయి. ఇంకా కట్టను బలోపేతం చేస్తున్నామన్నారు. మంత్రి నిమ్మల రామానాయుడుతో నారా లోకేష్ సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని పర్యవేక్షించారు. డ్రోన్ లైవ్ ద్వారా గండ్ల పూడ్చివేత పనులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాం. అధికార యంత్రాంగం అహర్నిశలు శ్రమించింది. ప్రజలు సైతం సహకరించారు కనుకే.. విపత్తునుంచి బయటపడ్డాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.
ప్రతి ఒక్క ఇంటికీ ఆహార పొట్లాలు పంపించాలని ప్రయత్నించామని, ఒకరోజు 10 లక్షల ఆహార పొట్లాలు పంపిణీ జరిగిందని సీఎం అన్నారు. హెలికాప్టర్లు, డ్రోన్ల సాయంతో బాధిత ప్రజలకు ఆహారం, తాగునీరు అందించామని, ఎంత ప్రయత్నించినా చివరన ఉండే ప్రజలకు సరిగా సాయం అందించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
వరద బాధితులకు సాయం చేసేందుకు అనేకమంది దాతలు ముందుకొస్తున్నారన్నారని సీఎం చంద్రబాబు వెల్లడిరచారు. కొందరు ఆర్థికసాయం చేస్తుంటే.. మరికొందరు ఆహారం, వస్త్రాలు సాయం చేస్తున్నారన్నారు. అందరూ సాయం చేస్తుంటే గత పాలకులు మాత్రం విషం చిమ్ముతున్నారని వాపోయారు. తనను ఓడిరచిన ప్రజలపై కక్ష తీర్చుకోవాలనే విధంగా ప్రవర్తిస్తున్నారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద ప్రాంతాల్లో 10 రోజులు మంత్రులు, ఉన్నతాధికారులు, అధికారులు, పారిశుధ్ధ్య సిబ్బంది కష్టపడి పనిచేశారన్నారు. అధికార యంత్రాంగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు. రాష్ట్ర, జిల్లా అధికార యంత్రాంగం చేసిన త్యాగాలు చరిత్ర గుర్తుపెట్టుకుంటుందన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, నేవీ, ఆర్మీ సాయంతో వరద సహాయక చర్యలు త్వరితగతిన చేపట్టామన్నారు. టెలీకాన్ఫరెన్స్‌లు పెట్టి ఎప్పటికప్పుడు వరద పరిస్థితిపై సమీక్ష చేసి ప్రాణనష్టం, పంటనష్టం తగ్గించగలిగాంకానీ ఆస్తినష్టం తగ్గించలేకపోయామన్నారు. ఇళ్లలోని గృహోపకరణాలన్నీ నీట మునిగిన పరిస్థితి. ప్రజలను ఆదుకునేందుకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. ఫైరింజన్ల సాయంతో ఇళ్లు శుభ్రం చేయిస్తున్నామని సీఎం వివరించారు.
ప్రతి ఒక్క ఇంటికీ ఎన్యూమరేషన్ టీమ్‌ను పంపించామని, యాప్ ద్వారా డేటా సేకరించామన్నారు. లక్ష కుటుంబాల డేటాను అప్‌డేట్ చేశామన్నారు. విజయవాడలోనే కాదు లంక ప్రాంతాల్లో గ్రామాలు సైతం దెబ్బతిన్నాయి. కొల్లేరు ప్రాంతం దెబ్బతింది. ఏలేరు దిగువ ప్రాంతం దెబ్బతింది. విశాఖపట్నంలో కొండచరియలవల్ల కొంతప్రాంతం దెబ్బతింది. వాటన్నింటినీ అధ్యయనం చేస్తున్నామన్నారు.
వాహనాల స్పేర్‌పార్ట్స్‌కు కూడా 100 శాతం సబ్సిడీ ఇచ్చేలా కంపెనీలతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. ప్రజలు కోలుకొని ధైర్యంగా ముందుకువెళ్లే వరకు అండగా ఉంటామన్నారు. బుధవారం నుంచి ఉత్తరాంధ్రలో పర్యటించనున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఏలేరు బాధితులు, విశాఖ బాధితులను పరామర్శిస్తానన్నారు. అనంతరం నందివాడ, కొల్లేరు, బాపట్ల లంక బాధితులను, వేమూరు బాధితులను పరామర్శిస్తానని సీఎం చంద్రబాబు వివరించారు.
‘సూర్యాస్తమయం అయ్యాక యుద్ధం చేయకూడదనే నియమాలుంటాయి. కానీ మేం రాత్రింబవళ్లు కష్టించి పనిచేశాం. వరద సహాయక చర్యల్లో రాత్రింబవళ్లు పనిచేసి ఎందరికో స్ఫూర్తి నింపిన ప్రతి ఒక్కరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. సమాజం కోసం చూపిన చొరవగా సీఎం చంద్రబాబు అభివర్ణించారు. మీడియా ప్రతినిధులు సైతం ప్రభుత్వ సమాచారం ప్రజలకు చేరవేయడంలో బాగా పనిచేశారని అభినందించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధుల కృషిని కొనియాడారు. పాఠశాల విద్యార్థులు కిడ్డీ బ్యాంకుల్లో నుండి డబ్బు తీసుకొచ్చి వరద బాధితులకు అందించమని సాయం చేయడం ఆనందాన్నిచ్చిందన్నారు.