- కుప్పం నేతలతో భేటీలో భువనేశ్వరి
- చంద్రబాబు తరఫున నేడు భువనమ్మ నామినేషన్
కుప్పం(చైతన్యరథం): టీడీపీ అధినేత చంద్రబాబు తరఫున తొలిసారిగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి కుప్పంలో నామినేషన్ వేయనున్నారు. మధ్యాహ్నం 1.27 గంటలకు చంద్రబాబు తరఫున భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేస్తారు. ఇందుకోసం శుక్రవారం సాయంత్రం ఆమె కుప్పం చేరుకున్నారు. అంతకుముందు బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న భువనేశ్వరికి ఎమ్మెల్సీ శ్రీకాంత్, పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు. అక్కడినుండి ఆమె రోడ్డు మార్గంలో కుప్పం పీఈఎస్ మెడికల్ కాలేజీ గెస్ట్ హౌస్కు చేరుకుని పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తొలుతగా కుప్పం తెలుగుదేశంపార్టీ కుటుంబ సభ్యులకు నమస్కారాలు తెలిపారు. మా కుటుంబంతో కంటే మీతోనే చంద్రబాబు అత్యధిక సమయం గడిపారు..మీరు ఆయనతో దగ్గరగా ఉన్నారు.. చంద్రబాబు ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఆయనకు ఓ టీమ్ అవసరం అన్నారు. కుప్పం ప్రజలు ఇక్కడి పరిస్థితులు చక్కదిద్ది, చంద్రబాబును భారీ మెజారిటీతో గెలిపించడానికి కంకణబద్దులు కావాలని భువనేశ్వరి అన్నారు.
కుప్పం కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు
చంద్రబాబును వరుసగా 7సార్లు కుప్పం ప్రజలు ఆశీర్వదించారు ఈ విషయాన్ని మా కుటుంబం ఎప్పటికీ మరచిపోదు. కుప్పం ప్రజలందరికీ నా కృతజ్ఞతలు. చంద్రబాబు కుప్పంలో ఏ ఒక్కరినీ మర్చిపోరు. పతి ఒక్కరికీ న్యాయం చేస్తారని నా ప్రగాఢ విశ్వాసం. కుప్పంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండేలా చంద్రబాబు చూస్తారు. గత ఐదేళ్లుగా కుప్పం ప్రజలు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. గతంలో ఎన్నడూ ఎదుర్కోని విధంగా నిర్బంధాలు ఎదుర్కొన్నారు. అక్రమ కేసులను భరించారు. వైసీపీ దాష్టీకాలను తట్టుకుంటూ..దీటుగా ఎదుర్కొంటూ పసుపు జెండాను నిలబెడుతూ వస్తున్న కుప్పం కుటుంబ సభ్యులకు నా ప్రత్యేక ధన్యవాదాలు. రానున్న ఎన్నికల్లో కుప్పం మాత్రమే కాదు రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం విజయ దుందుభి మోగించాలి. రాష్ట్ర ప్రజలు, మన కార్యకర్తల కుటుంబాల కోసం నేను నిజం గెలవాలి కార్యక్రమాన్ని చేపట్టి పూర్తిచేశాను. కుప్పం కుటుంబ సభ్యుల సమక్షంలో చంద్రబాబు తరపున నామినేషన్ వేస్తానని నేను అడగడంతో ఆయన ఒప్పుకున్నారు. ఈ అవకాశాన్ని ఇచ్చిన చంద్రబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు. చంద్రబాబు నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కుప్పం కుటుంబ సభ్యులు కదలి రావాలని భువనేశ్వరి పిలుపు ఇచ్చారు.
భువనమ్మ రావటం సంతోషంగా ఉంది
కుప్పం టీడీపీ ముఖ్యనేతలు మాట్లాడుతూ 7సార్లు చంద్రబాబును మేం గెలిపించుకున్నాం..మాకు ఆయనపై అంత నమ్మకం అన్నారు. ప్రతి ఓటరు చందాలు వేసుకుని మా చంద్రన్నకు నామినేషన్ ఫీజులు కట్టి నామినేషన్ వేసుకునేవాళ్లం. ఎందుకంటే చంద్రన్న మా కుటుంబ సభ్యుడు. చంద్రబాబు తరపున నామినేషన్ వేయడానికి భువనమ్మ రావడం తమకు చాలా సంతోషంగా ఉందన్నారు.