- సామాన్యుడి జీవితం మార్చేలా ‘విజన్’
- రాష్ట్రస్థాయి నుంచి కుటుంబం వరకు యూనిట్
- సాంకేతిక వినియోగంతో పేదరికం లేని సమాజం
- ఏఐ హబ్‌లుగా అమరావతి, వైజాగ్ రూపకల్పన
- సంపద సృష్టికి దోహదపడే పాలసీలకు ప్రాధాన్యం
- టెక్నాలజీ, అవకాశాలను అందిపుచ్చుకునేలా విధానాలు
- రాష్ట్ర ప్రగతికి వ్యవస్థలను, ప్రజలను సిద్ధం చేయాలి
- నీతి ఆయోగ్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు చర్చలు
అమరావతి: అట్టడుగు స్థాయి వ్యక్తి జీవితాన్ని మార్చేలా ప్రభుత్వ విజన్ ఉండాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సచివాలయంలో నీతి ఆయోగ్ సీఈవో బి.వి.ఆర్.సుబ్రహ్మ ణ్యం, సంస్థ ప్రతినిధులు, నిపుణులు శుక్రవారం సీఎంతో సమావేశమయ్యారు. ఈ సంద ర్భంగా వికసిత్ ఆంధ్రప్రదేశ్ – 2047 కోసం విజన్ డాక్యుమెంట్, ప్రణాళిక తయారుపై చంద్రబాబు వారితో చర్చించారు. రానున్న రోజుల్లో రాష్ట్ర అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్ర మాలు, ప్రాజెక్టులపైనా మాట్లాడారు. తన గత అనుభవాలు, నిర్ణయాలు, వాటి ఫలితాలు, భవిష్యత్ ఆలోచనలను వారితో పంచుకున్నారు. దేశాభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిం చేందుకు ప్రత్యేకమైన ప్రణాళికలతో ఏపీ పనిచేస్తుందని తెలిపారు.
ఏఐ హబ్‌లుగా అమరావతి, వైజాగ్‌కు ప్రణాళికలు
ప్రభుత్వాలు విజన్‌తో పనిచేయాలి. ఉమ్మడి రాష్ట్రంలో సంస్కరణలు, విజన్‌తో వచ్చిన ఫలితాలు మనం చూశాం. నేడు వికసిత్ ఆంధ్రప్రదేశ్ కోసం విజన్ 2047 సిద్ధం చేసుకుని ప్రయాణం సాగించాలి. వినూత్న ఆలోచనలతో టెక్నాలజీని ఉపయోగించుకుని పేదరికం లేని సమాజం సాధించాలి. అందుకు అనుగుణంగా వికసిత్ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047 సిద్ధం చేయాలి. జనాభా సమతుల్యతపై లోతైన కసరత్తు చేసి ప్రణాళిక సిద్ధం చేయాలి. రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయి. అమరావతి, వైజాగ్ ఏఐ హబ్‌లుగా రూపొందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలి. రాష్ట్రంలో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఉన్నాం.
రాష్ట్ర ప్రగతికి వ్యవస్థలను, ప్రజలను సిద్ధం చేయాలి
ప్రతి సామాన్యుడికీ ఫలాలు అందాలి. రాష్ట్ర స్థాయి నుంచి మండల, కుటుంబ స్థాయి వరకు ఒక యూనిట్‌గా ప్రణాళికలు రచించాలి. అప్పుడే విజన్ డాక్యుమెంట్‌కు సార్థకత చేకూరుతుంది. వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలను తీసుకురావడంతో పాటు, ప్రకృతికి వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా విధానాలు ఉండాలి. సీమలో హార్టికల్చర్ ఆధారిత ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు వస్తే రైతులు లబ్ధి పొందుతారు. రాష్ట్ర ప్రగతిలో కీలకమైన విద్యుత్ రంగంలో రానున్న రోజుల్లో అనూహ్య మార్పులు వస్తాయి. వాటికి అనుగుణంగా వ్యవస్థలను, ప్రజలను సిద్ధం చేయాలి. మానవ వనరుల విషయంలో నైపుణ్యం పెంచేలా చర్యలు తీసుకోవాలి. దీని కోసం పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీ వరకు సిలబస్ రూపొందించాలి.
మేధావులు, నిపుణులతో చర్చించి డాక్యుమెంట్
కొత్త టెక్నాలజీని, అవకాశాలను అందిపుచ్చుకునే విధానాలు విజన్ డాక్యుమెంట్లో ఉండాలి. సంపద సృష్టికి దోహదపడే పాలసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఐఐటీ, ఐఐఎం, ఐఎస్బీ వంటి సంస్థలు, మేధావులు, నిపుణులతో చర్చించి డాక్యుమెంట్ సిద్ధం చేయాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. మారుమూల గ్రామంలో ఉన్న సామాన్య వ్యక్తికి కూడా ఫలితాలు అందేలా విజన్ ఉండాలని సూచించారు. రానున్న రోజుల్లో వికసిత్ ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్‌పై మరిన్ని సమావేశాలు, సమాలోచనలు జరిపి దానిని విడుదల చేయా లని భావించారు. ఈ సమావేశంలో మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.